ఫింగర్‌ప్రింట్స్‌తో నేరగాడి చరిత్ర

17 Jun, 2017 00:35 IST|Sakshi
ఫింగర్‌ప్రింట్స్‌తో నేరగాడి చరిత్ర

అందుబాటులోకి అటోమేటిక్‌ ఫింగర్‌ప్రింట్స్‌ ఐడింటిఫికేషన్‌ సిస్టమ్‌
లైవ్‌ స్కానర్స్‌ ద్వారానే నేరగాళ్ల వేలిముద్రను సేకరించాలి
సైబారాబాద్‌ సీపీ సందీప్‌ శాండిల్యా ఆదేశాలు


సిటీబ్యూరో: నేరగాళ్ల వేలిముద్రలను డిజిటల్‌ ఫార్మాట్‌లో సేకరించడం ద్వారా వారికి సంబంధించిన నేరచరిత్ర సెకన్లలో కనిపించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన కొత్త సాఫ్ట్‌వేర్‌ అటోమేటిక్‌ ఫింగర్‌ప్రింట్స్‌ ఐడింటిఫికేషన్‌ సిస్టమ్‌ (పాపిలియన్‌–ఏఎఫ్‌ఐఎస్‌)ను సైబరాబాద్‌ పోలీసులు అందుబాటులోకి తీసుకొచ్చారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో ఈ కొత్త సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన పరికరాలను పేట్‌బషీరాబాద్, కూకట్‌పల్లి, ఆర్‌జీఐఏ, షాద్‌నగర్‌ ఠాణా సిబ్బందికి సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సందీప్‌ శాండిల్యా పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..1999వ సంవత్సరంలో ఇన్‌స్టాల్‌ చేసిన ఫింగర్‌ ప్రింట్స్‌ అండ్‌ క్రిమినల్‌ ట్రేసింగ్‌ సిస్టమ్‌ స్థానంలో అటోమేటిక్‌ ఫింగర్‌ప్రింట్స్‌ ఐడింటిఫికేషన్‌ సిస్టమ్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు.  అరచేతి ముద్రణ లైవ్‌ స్కానర్లు, హెచ్‌డీ వెబ్‌ కెమెరాలు, మొబైల్‌ సెక్యూరిటీ చెక్‌ డివైస్‌లను అన్ని పోలీసు స్టేషన్లకు అందిస్తున్నామన్నారు. ‘ఇంక్, స్లాబ్, రోలర్‌ ద్వారా వేలిముద్రలు సేకరించే స్థానంలో న్యూ లైవ్‌ స్కాన్‌ సిస్టమ్‌ పనిచేయనుంది. ఇక నుంచి లైవ్‌ స్కానర్స్‌ ద్వారానే నేరగాళ్ల వేలిముద్రను అన్ని ఠాణాల ఎస్‌హెచ్‌వోలు సేకరించాలి. దీంతో కొన్ని సెకన్ల వ్యవధిలోనే నిందితునికి సంబంధించిన చరిత్ర అంతా డిజిటల్‌ పార్మాట్‌లో కళ్ల ముందు ప్రత్యక్షం అవుతుంది’ అన్నారు.

ఆండ్రాయిడ్‌ మొబైల్, ట్యాబ్లెట్‌కు మొబైల్‌ సెక్యూరిటీ చెక్‌ డివైస్‌ అనుసంధానించడం ద్వారా నేరగాడు ఫింగర్‌ ప్రింట్‌ టచ్‌కాగానే అతడికి సంబంధించిన డాటా కళ్ల ముందు ఫొటోలతో సహా ప్రత్యక్షమవుతుందని తెలిపారు. పోలీసు మొబైల్‌ వెహికల్స్, నైట్‌ పెట్రోలింగ్‌ వెహికల్స్, రక్షక్, నాకాబందీ సిబ్బందికి ఇది ఎంతో ఉపయుక్తకరమన్నారు. కార్యక్రమంలో సైబరాబాద్‌ జాయింట్‌ సీపీ షానవాజ్‌ ఖాసీమ్, క్రైమ్‌ డీసీపీ జానకి శర్మ, అదనపు డీసీపీ క్రైమ్స్‌ శ్రీనివాసరెడ్డి, సీఐడీ ఫింగర్‌ ప్రింట్స్‌ డైరెక్టర్‌ ప్రభాకర్‌రావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు