కార్మికశాఖలో విభజన పూర్తి

1 Oct, 2016 04:00 IST|Sakshi
కార్మికశాఖలో విభజన పూర్తి

- జిల్లా స్థాయిలో డీసీఎల్ పోస్టులు రద్దు
- చిన్న జిల్లాలు కావడంతో ఏసీఎల్‌లకే పగ్గాలు
- అన్ని జిల్లాలకు ఎంప్లాయిమెంట్ అధికారుల నియామకం

 
 సాక్షి, హైదరాబాద్: జిల్లాల పునర్విభజన నేపథ్యంలో కార్మికశాఖలో విభజన పూర్తి చేశారు. జిల్లాస్థాయి అధికారుల ఎంపిక, క్యాడర్ల ఏర్పాట్లు తదితర ప్రక్రియ మొత్తం పూర్తయింది. ఈ మేరకు ఏయే జిల్లాకు ఎవరెవరు వెళ్లాలనే దానిపై ఉద్యోగులకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. అక్టోబర్ 3నుంచి నూతనంగా ఏర్పడబోయే జిల్లాలకు వెళ్లాల్సిందిగా ఉద్యోగులను ఆదేశించారు. అయితే పునర్విభజన నేపథ్యంలో జిల్లాలు చిన్నవి కావడంతో క్యాడర్ పోస్టుల హోదాను తగ్గించారు. ప్రస్తుతం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మినహా మిగతా జిల్లాలకు బాధ్యులుగా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్(డీసీఎల్) స్థాయి అధికారులు ఉన్నారు.
 
 కానీ ఇప్పుడు ఆ హోదాను తగ్గించి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ (ఏసీఎల్) స్థాయి అధికారులకే బాధ్యతలు అప్పగించాలని కార్మికశాఖ నిర్ణయించింది. అం దుకు అనుగుణంగా నూతన జిల్లాలకు ఏసీఎల్ స్థాయి అధికారులకు ఎంపిక చేసిన జిల్లాల బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. అలాగే దసరా నాటికి నూతన జిల్లాల్లో కార్యాలయాలు ఎంపిక చేసుకోవడంతో పాటు పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని కార్మికశాఖ ఆదేశాలిచ్చింది. అదేవిధంగా జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారుల విషయంలో కూడా కార్మికశాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నూతనంగా ఉద్యోగులెవరినీ చేర్చుకోకపోవడంతో ఉన్న వారితోనే సర్దుబాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు జూనియర్ అధికారులకు నూతన జిల్లా బాధ్యతలు అప్పగించాలని కార్మికశాఖ స్పష్టం చేసింది.

మరిన్ని వార్తలు