బోగస్ ఏరివేతతో 20 శాతం బియ్యం ఆదా

8 Aug, 2015 03:12 IST|Sakshi

* వచ్చే నెల నుంచి పటిష్టంగా ‘ఆహారభద్రత’
 
*  పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ప్రజాపంపిణీ వ్యవస్థను పటిష్ట పర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రేషన్ సరుకులు పక్కదారి పట్టకుండా కట్టుదిట్టం చేస్తోంది. బోగస్‌కార్డుల ఏరివేత, అక్రమాలకు పాల్పడుతున్న డీలర్లు, మిల్లర్లపై క్రిమినల్ కేసుల నమోదు, నిత్యావసర వస్తువుల రవాణాలో ఆధునిక సాంకేతికత వినియోగం వంటి చర్యలతో ఇప్పటికే 15 నుంచి 20 శాతం మేర బియ్యాన్ని ఆదా చేయగలిగామని ఆర్థిక, పౌర సరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.

రాష్ట్రానికి సుమారు రూ.200 కోట్ల నుంచి రూ.300 కోట్ల మిగులు లభిస్తోందన్నారు. శుక్రవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృధ్ధి కేంద్రంలో జిల్లాల జాయింట్ కలెక్టర్లతో మంత్రి సమీక్ష జరిపారు. రేషన్ అక్రమాల నిరోధం, ఆహార భద్రతా చట్టం అమలు, ధాన్యం సేకరణ విధానం తదితరాలపై మంత్రి పలు సూచనలు చేశారు. సమావేశం అనంతరం ఈటల మాట్లాడుతూ.. వచ్చే నెల నుంచి ఆహారభద్రతా చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తామన్నారు. కొత్త కార్డుల జారీకి చర్యలు తీసుకుంటున్నామన్నారు.

అదనపు బియ్యం విషయమై కేంద్రానికి పదేపదే విన్నవిస్తున్నా స్పందనలేదని, దీంతో ఆ భారాన్ని రాష్ట్రమే భరిస్తుందన్నారు. ఈ నెలలోనే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఈపాస్, జీపీఎస్, బయో మెట్రిక్ విధానాన్ని ప్రవేశపెడుతున్నామని చెప్పారు. అర్హులందరికీ దీపం పథకం సిలిండర్‌లు అందించేందుకు కసరత్తు చేస్తున్నామని చెప్పారు. ఐకేపీ, పీఏసీఎస్, డీసీఎంఎస్‌ల ద్వారానే ధాన్యం కొనుగోళ్లు జరుగుతాయని చెప్పారు.

మరిన్ని వార్తలు