పడకేసిన ‘బస’..! | Sakshi
Sakshi News home page

పడకేసిన ‘బస’..!

Published Sat, Aug 8 2015 3:37 AM

Welfare Accommodation Homes problems

ఇందూరు : జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కలిపి మొత్తం 147 సంక్షేమ వసతిగృహాలున్నాయి. ఈ హాస్టళ్లల్లో నెలకొన్న సమస్యలు, విద్యార్థుల ఇబ్బందులను తెలుసుకుని పరిష్కరించేందుకు గత ప్రభుత్వ ఆదేశాల మేరకు మూడు సంవత్సరాల క్రితం నాటి కలెక్టర్ వరప్రసాద్ రాత్రుల్లో బస కార్యక్రమం పేరిట స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. మూడేళ్ల పాటు సజావుగానే సాగిన ఈ కార్యక్రమం ఇటీవల పడకేసింది. గతంలో ఉన్నతాధికారులు వసతిగృహాల్లో బస చేసి విద్యార్థులతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకునేవారు. వారితో కలిసి భోజనం చేసి మౌలిక వసతులను స్వయంగా పరిశీలించేవారు.

అదే విధంగా స్పెషల్ అధికారులకు ప్రత్యేక ప్రొఫార్మా ఇచ్చి వసతిగృహంలో ఉన్న సౌకర్యాలేంటి...? లేనివి ఏంటి...? వార్డెన్ ఉంటున్నాడా..? విద్యార్థుల హాజరు శాతం, ఆ రోజుకు సంబంధించిన మెనూ అమలు చేశారా...? తదితర విషయాలను నివేదిక ద్వారా జిల్లా కలెక్టర్‌కు అందజేసేవారు. దాని ఆధారంగా వసతి గృహల్లో ఉన్న మౌలిక వసతులు కల్పించేవారు. పనితీరు బాగాలేని వార్డెన్‌లపై చర్యలు సైతం తీసుకున్నారు. అరుుతే ప్రస్తుతం వసతి గృహాల్లో బస కార్యక్రమాన్ని ప్రభుత్వం మరిచిపోయింది. హాస్టల్ విద్యార్థులకు సరిపడా దుప్పట్లు, కార్పెట్లు అందాయా లేదో తెలియని పరిస్థితి ఉంది.

మరో వైపు కొన్ని వసతి గృహల్లో తాగునీరు, హాస్టల్ భవనాలకు కిటికీలు, తలుపులు సరిగా లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దోమతెరలు, మూత్రశాలలు, మరుగుదొడ్లు లేక నానా కష్టాలు ఎదుర్కొంటున్నారు. చాలా వసతిగృహాల్లో మెనూ సక్రమంగా అమలు కావడం లేదనే ఆరోపణలు ఉన్నారుు. వార్డెన్‌లు స్థానికంగా ఉండాలని కలెక్టర్ రొనాల్డ్‌రోస్ ఆదేశాలు జారీ చేసినా.. ఏ ఒక్కరు కూడా స్థానికంగా ఉండి వసతి గృహల్లో బసచేయడం లేదు.

దీంతో హాస్టళ్లలో ఏం జరుగుతుందో తెలియడం లేదు. నెలకు రెండు సార్లు వసతిగృహాలను తనిఖీ చేయాల్సిన సహాయ సంక్షేమాధికారులు మామూళ్లకు అవాటుపడి అటువైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవేళ తప్పని సరిగా తనిఖీ చేయాల్సి వస్తే నామమాత్రంగా చేసి చేతులు దులుపుకోవడం పరిపాటిగా మారిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తనిఖీలకు వెళుతున్నట్లు ఉన్నతాధికారులకు తప్పుడు నివేదికలు సమర్పించడంతో విద్యార్థుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు.

 కాల్‌సెంటర్ రావడంతో తగ్గిన ప్రత్యక్ష పర్యవేక్షణ...
 కాల్ సెంటర్ సౌకర్యం అందుబాటులోకి రావడంతో వసతిగృహాల్లోని ల్యాండ్ నంబర్‌కు ఫోన్ చేసి రోజు వారీ వివరాలను కాల్ సెంటర్ సిబ్బంది తెలుసుకుంటున్నారు. దీంతో ప్రత్యక్ష పర్యవేక్షణ, తనిఖీలు పూర్తిగా తగ్గిపోయాయి. అలాగే వసతిగృహాల్లో బస చేయాల్సిన పాలకులు, ప్రజాప్రతినిధులు కూడా ఆ ఉసే ఎత్తడం లేదు. ఇలా మూడు, నాలుగు సంవత్సరాలుగా వస్తున్న బస కార్యక్రమం ఆనవారుుతీ తప్పుతోంది. ఇకనైనా హాస్టల్ బసను కొనసాగిస్తే విద్యార్థుల సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుందని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement
Advertisement