బూట్ ఫర్ బెనిఫిట్

5 Oct, 2014 22:51 IST|Sakshi
బూట్ ఫర్ బెనిఫిట్

సెంట్రల్ ఏసీ... మోడ్రన్ ఎక్విప్‌మెంట్, చెమటలు పట్టిన శరీరం నుంచి వచ్చే స్మెల్, నియంత్రించేందుకు ఉపయోగించే ఆర్టిఫిషియల్ పరిమళం...  వీటి నుంచి ఉపశమనం కలిగిస్తూ అందుబాటులోకి వచ్చినవే బూట్ క్యాంప్స్. నాలుగు గోడల మధ్య  కన్నా  గాలి, వెలుతురుధారాళంగా ఉండే చోటే ఎక్సర్‌సైజ్‌కు సరైన నెలవని భావిస్తున్నారు సిటీజనులు.  కాళ్లకు బూట్లు తొడుక్కొని పచ్చదనం పరుచుకున్న ప్రదేశాల్లో ప్రత్యక్షం అవుతున్నారు.

క్యాహై ‘క్యాంప్’?

సైనిక శిక్షణలో భాగంగా అమెరికాలో ప్రారంభమైన బూట్‌క్యాంప్ యాక్టివిటీ.. దేహాన్ని కొన్ని క్లిష్టమైన పరిస్థితులకు, పరిసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించినది. కామన్ పబ్లిక్ దీనికి చేరువ కావడానికి కారణం.. ఇది సమూహంతో కలసి చేసే ఓపెన్ ఎయిర్ వర్కవుట్ కావడమే. సిటీలో పార్క్‌లు.. స్పేసియస్ గ్రౌండ్స్.. అవుట్ కట్స్‌లో కొండ గుట్టలు ఈ బూట్‌క్యాంప్స్‌కు కేరాఫ్‌గా మారుతున్నాయి. ఫిట్‌నెస్ కోసం తపిస్తున్న సిటీవాసులు.. ప్రకృతి ఒడిలో చల్లదనాన్ని ఆస్వాదిస్తూ బూట్‌క్యాంప్ మంత్రాన్ని పఠిస్తున్నారు.

వెయిట్ నిల్.. ఎనర్జీ ఫుల్..

 ఈ బూట్‌క్యాంప్‌లో వయసు, ఫిట్‌నెస్ స్థాయిల వారీగా బృందాలను విభజిస్తారు. ఆయా బృందాలకు తగ్గట్టుగా ఫిట్‌నెస్ ఫార్ములా రూపొందిస్తారు. వారి సామర్థ్యాలకు అనుగుణంగా పరికరాలు సమకూరుస్తారు. ఇందులో బాడీ వెయిట్ తగ్గించే వ్యాయామాలకే
 ఫ్రిఫరెన్స్ ఇస్తున్నారు. వాకింగ్‌తో మొదలయ్యే బూట్‌క్యాంప్ వ్యాయామం.. స్ట్రెచ్ లేదా యోగా భంగిమలతో పూర్తవుతుంది. ఈ మధ్యలో విభిన్న రకాలుగా చేసే పుషప్స్, జంపింగ్ జాక్స్, ట్విస్టింగ్, క్రాస్ జాక్స్, ఫ్రంట్ జాక్స్, డక్ వాక్, టైగర్ వాక్, క్రొకడైల్ వాక్, క్రాబ్ వాక్, రన్నింగ్, జాగింగ్, స్ప్రింటింగ్.. ఇలా సరికొత్త థీమ్స్‌తో వర్కవుట్స్ చేయిస్తారు. ఈ వ్యాయామంలో భాగంగా కోన్స్, స్విస్‌బాల్స్, ఫ్లోర్‌నెట్స్, క్లైంబర్ నెట్స్, చాపింగ్ స్టిక్స్, రెసిస్టెన్స్ ట్యూబ్స్,  హ్యామర్స్, బ్యాగ్స్ వంటి పరికరాలను సైతం వినియోగిస్తారు. ఈ శిబిరాల్లో ఆర్గానిక్ ఫుడ్ అందిస్తారు. వీటిలో హెల్త్-ఫిట్‌నెస్ సెషన్స్ కూడా భాగమే.

ఆరోగ్యమే.. బెని‘ఫిట్’

ఈ తరహా బూట్ క్యాంప్‌లను నిర్వహించడానికి నగరానికి చెందిన కార్పొరేట్ కంపెనీలు బాగా ఆసక్తి చూపిస్తున్నాయని వావ్ ఫిట్‌నెస్ స్టూడియో నిర్వాహకురాలు పూర్ణిమారావు అన్నారు. ఉద్యోగుల
 ఆరోగ్యాన్ని, పనిలో చురుకుదనాన్ని ఆశిస్తున్న కంపెనీలు.. వారి కోసం బూట్‌క్యాంప్స్‌ను ఏర్పాటు చేస్తున్నాయని చెప్పారు. ఈ క్యాంప్‌ల
 నిర్వహణ కోసం విశాల ప్రాంగణాలను కూడా నిర్వాహకులు అద్దెకు తీసుకుంటున్నారు. అనుభవ జ్ఞులైన ఫిట్‌నెస్ ట్రైనర్స్, ఫిజియో థెరపిస్ట్, డైటీషియన్.. వంటి నిపుణుల సేవలను వినియోగించుకుంటున్నారు. ఆహ్లాదకర వాతావరణంలో పిక్నిక్‌లా ఆనందంతో పాటు ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తుండడంతో బూట్‌క్యాంప్‌లకు సిటీలో రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది.
 
హ్యాపీనెస్..

ఎక్సర్‌సైజ్‌లకు ఎక్కువ స్పేస్ దొరుకుతూ, టైర్డ్‌గా అనిపించకపోవడం, డిఫరెంట్ టైప్ వర్కవుట్స్‌తో పాటు ఫన్నీగేమ్స్, క్లీన్ వెదర్ బూట్‌క్యాంప్‌ల ప్రత్యేకత. మా ఫిట్‌నెస్ స్టూడియో ఆధ్వర్యంలో వారానికి రెండు సార్లయినా ఈ తరహా క్యాంప్‌లు నిర్వహిస్తున్నాం. వీటి వల్ల ఫిట్‌నెస్‌తో పాటు హ్యాపీనెస్ కూడా అదనంగా దొరుకుతుంది.
 
- పూర్ణిమారావు, వావ్ ఫిట్‌నెస్ స్టూడియో    
 
 

మరిన్ని వార్తలు