టీడీపీ నేత ప్రదీప్ చౌదరిపై గురి

21 Jul, 2015 09:15 IST|Sakshi
టీడీపీ నేత ప్రదీప్ చౌదరిపై గురి

 సాక్షి, హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఏసీబీ విచారణ ఎదుర్కొంటున్న జూబ్లీహిల్స్ నియోజక వర్గం శ్రీనగర్ కాలనీ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ప్రధాన అనుచరుడైన వి.ప్రదీప్ చౌదరిపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో గతంలో బెదిరింపుల కేసు నమోదైంది. ఈ కేసును ఇప్పుడు పోలీసులు తిరగదోడుతున్నారు.  ఈ కేసులో ప్రదీప్ చౌదరి ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసు రికార్డులు తెలుపుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే...బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని ప్లాట్ నెం.697లో 7069 గజాల స్థలాన్ని కె.రవీందర్‌రెడ్డి అనే వ్యక్తి 1995లో జూబ్లీహిల్స్‌కు చెందిన జగదీశ్వర్‌రావుతో డెవలప్‌మెంట్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు.

2005 జనవరి 13న ప్రదీప్‌చౌదరి, జగదీశ్వర్‌రావు, మాగంటి గోపినాథ్, అమర్‌గౌడ్‌లతో పాటు 25 మంది రౌడీలు ఈ ప్లాట్‌ను ఆక్రమించడమే కాకుండా అక్కడ ఉన్న రవీందర్‌రెడ్డి మనుషులను బెరించి తరిమికొట్టారు. దీంతో రవీందర్‌రెడ్డి మేనేజర్ జి.తిరుమల్‌రెడ్డి అదే రోజు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలోపే ప్రదీప్‌చౌదరితో పాటు రౌడీలంతా అక్కడి నుంచి పరారయ్యారు. జూబ్లీహిల్స్ పోలీసులు ఈ కేసులో ఏ-1గా జగదీశ్వర్‌రావు, ఏ-2గా మాగంటి గోపినాథ్, ఏ-3గా ప్రదీప్‌చౌదరి, ఏ-4గా అమర్‌గౌడ్‌తో పాటు 22 మందిపై ఐపీసీ సెక్షన్ 147, 148, 452, 506, 7(1) ఆఫ్ క్రిమినల్ లా అమెండ్‌మెంట్ యాక్ట్స్ కింద కేసులు నమోదు చేశారు. అయితే, ఈ కేసులో వీరంతా ముందస్తు బెయిల్ పొందారు. ఇప్పటికీ ఈ కేసు పెండింగ్‌లోనే ఉంది. ఇప్పుడు ఈ కేసును తిరగదోడాలని నిర్ణయించుకున్న పోలీసులు వివరాల సేకరణ మొదలెట్టారు.  ఏ ఏ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదై ఉన్నాయని ఆరా తీస్తున్నారు.

మరిన్ని వార్తలు