బాబు సర్కార్ మళ్లీ పరార్

31 Mar, 2016 02:53 IST|Sakshi
బాబు సర్కార్ మళ్లీ పరార్

- మరోమారు పలాయనం చిత్తగించిన ప్రభుత్వం
- ద్రవ్య వినిమయ బిల్లుపై ఓటింగ్‌కు ససేమిరా
- ప్రతిపక్ష సభ్యులంతా డిమాండ్ చేసినా పట్టించుకోని స్పీకర్
- ఒక్క సభ్యుడు అడిగినా ఓటింగ్ జరపాలంటున్న నిబంధనలు
- సభలో విలువలకు, నిబంధనలకు తిలోదకాలు
- ఫిరాయింపు ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకే తాపత్రయం
- ‘డివిజన్’పై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్న ప్రతిపక్షనేత  

 
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: నిబంధనలు లేవు.. విలువలు లేవు.. సంప్రదాయాలు - శాసనసభ ఔన్నత్యం సంగతి సరేసరి... అన్నీ ‘చంద్రా’ర్పణం. సభ హుందాతనం గురించి తరచూ లెక్చర్లిచ్చే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సభా సంప్రదాయాలన్నిటినీ తుంగలో తొక్కారు. విలువలను పాతాళానికి దిగజార్చారు. సభలో తమకు స్పష్టమైన మెజారిటీ ఉన్నా ద్రవ్య వినిమయ బిల్లుపై ఓటింగ్ జరపకుండా పలాయనం చిత్తగించారు. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ సభ్యులంతా ముక్తకంఠంతో డివిజన్‌కు డిమాండ్ చేస్తున్నా నిబంధనలకు విరుద్ధంగా.. సభా మర్యాదను మంటగలుపుతూ మూజువాణితో మమ అనిపించారు.
 
 శాసనసభ బడ్జెట్ సమావేశాలలో ముగింపు రోజు కూడా చంద్రబాబు  మూజువాణి మంత్రాన్ని పఠించారు. ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టిన సందర్భంలోనూ అధికారపక్షం ఇలానే వ్యవహరించింది. నిబంధనలకు    తిలోదకాలిచ్చింది. విలువలకు పాతరేసింది. బుధవారం మూజువాణి ఓటుతో ప్రభుత్వం పారిపోయే ప్రయత్నం చేస్తున్నపుడు ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ‘కౌల్ అండ్ షక్దర్’లోని నిబంధనలను సభకు వివరించే ప్రయత్నం చేస్తుంటే మైక్ కట్ చేశారు. ఇక మాట్లాడే అవకాశమే ఇవ్వలేదు. ప్రజలంతా చూస్తున్నారన్న బెరుకు లేకుండా నిస్సిగ్గుగా సభా సంప్రదాయాలను ఇలా తుంగలో తొక్కడం, ప్రతిపక్షం గొంతునొక్కడం మునుపెన్నడూ ఎరగమని విశ్లేషకులంటున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడకుండా కాపాడుకోవడం కోసమే ఓటింగ్ జరక్కుండా ప్రభుత్వం జాగ్రత్త పడుతున్నదని విమర్శకులంటున్నారు.  ఓటింగ్ జరక్కుండా కాపాడుకునేందుకు స్పీకర్ వ్యవస్థనూ రాష్ర్ట ప్రభుత్వం దుర్వినియోగపరచడం దారుణమని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రతిపక్షనేత సహా సభ్యులంతా పట్టుబట్టినా డివిజన్‌కు అనుమతించకపోవడం నిబంధనలకు విరుద్ధమే కాదు అన్యాయం కూడా అని సీనియర్ పార్లమెంటేరియన్లు పేర్కొంటున్నారు. ప్రతిపక్షనేత లేచి నిలబడి నిబంధనలను చదివి వినిపిస్తుంటే పట్టించుకోకుండా పదేపదే మైక్ కట్ చేయడం దారుణమని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా ఈ స్థాయిలో ప్రతిపక్షం గొంతు నొక్కిన సందర్భాలు మునుపెన్నడూ కనీ విని ఎరుగమని విశ్లేషకులు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. డివిజన్ ఆఫ్ ఓట్ ను కోరడమనేది రాజ్యాంగపరంగా ప్రతిపక్ష సభ్యులకు లభించిన హక్కు.
 
 అయితే ఓటింగ్ జరిగితే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల సంగతి బైటపడిపోతుంది కాబట్టి వారు అనర్హులయిపోతారు కాబట్టి వారిని కాపాడేందుకే ప్రభుత్వం ఇలా నిస్సిగ్గుగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిందనేది నిర్వివాదాంశమని పరిశీలకులంటున్నారు. ఇక సభ్యుల బలాబలాలను ప్రకటించేటపుడు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు 67 మంది అని స్పీకర్ ప్రస్తావించడం గమనార్హం. వాస్తవానికి ఫిరాయించిన ఎమ్మెల్యేలు 10 మంది, సస్పెన్షన్‌కు గురైన ఒక ఎమ్మెల్యేని తీసివేస్తే వైఎస్సార్సీపీ సభ్యుల సంఖ్య 56 మాత్రమే. కానీ స్పీకర్ అత్యంత జాగ్రత్తగా 67 అని ప్రస్తావించారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడానికి సాంకేతికంగా కూడా ఎలాంటి అవకాశం లేకుండా చేయడానికే స్పీకర్ అలా ప్రకటించారని ప్రతిపక్షసభ్యులు విమర్శిస్తున్నారు.
 
 సాధారణంగా ఎమ్మెల్యేలు ఫిరాయిస్తే వారి చేత రాజీనామా చేయించడం, లేదంటే అనర్హత వేటు వేయడం, తిరిగి ప్రజాభిప్రాయం కోరేందుకు ఆ స్థానాల్లో ఎన్నికలకు సిద్ధపడాలి. కానీ అధికార పక్షం ఈ మూడింటికీ సిద్ధంగా లేదు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను రక్షించుకోవడం కోసమే నిబంధనలకు విరుద్ధంగా ఓటింగ్‌ను బహిష్కరించారు.  హామీలు నెరవేర్చకుండా అవినీతి వ్యవహారాలలో కూరుకుపోయిన చంద్రబాబు ప్రభుత్వం ప్రజల్లో పరువు పోగొట్టుకుందని, అందుకే ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించడానికి గానీ, అనర్హత వేటు వేయడానికి గానీ చంద్ర బాబు వెనకాడుతున్నారని ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నాయకులు విమర్శిస్తున్నారు. స్పీకర్ డివిజన్‌కు అంగీకరించకుండా ఏకపక్షంగా వ్యవహరించడంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం నిబంధనలకు కాలరాసి ఫిరాయింపు ఎమ్మెల్యేలను కాపాడుకోవచ్చు గానీ నైతికంగా ఓటమిపాలయ్యినట్లేనని వైఎస్సార్సీపీ నేతలంటున్నారు.
 
 ఒక్క సభ్యుడు అడిగినా ఓటింగ్ జరపాలంటున్న నిబంధనలు
 పార్లమెంటరీ వ్యవహారాల్లో సహజ న్యాయం పరిరక్షణకే ప్రాధాన్యత ఉంటుంది. శాసన వ్యవస్థల అధిపతులు కూడా పరిస్థితులను బట్టి సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా పనిచేస్తారు. సభలో ఏ అంశం మీదైనా మూజువాణి ఓటును ఎవరైనా ప్రశ్నిస్తే.. తప్పకుండా ‘డివిజన్ ఆఫ్ ఓట్’కు వెళ్లాల్సి ఉంటుందని పార్లమెంటరీ నిబంధనలు చెబుతున్నాయి. పార్లమెంటరీ వ్యవహారాల్లో అనుసరిస్తున్న పద్దతులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. నిబంధనలే కాదు అది ఓ సాంప్రదాయంగా కూడా పాటిస్తూ వస్తున్నారు.
 
 కౌల్ అండ్ షక్దర్ 917వ పేజీలో ఇందుకు సంబంధించిన నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. ద్రవ్య వినిమయ బిల్లు ఒక్కటే కాకుండా, సభ ఆమోదం కోసం వచ్చే ఏ అంశంలో అయినా.. మూజువాణి ఓటును ఏ ఒక్క సభ్యుడు ప్రశ్నించినా.. సభాపతి స్థానంలో ఉన్న వారు మరింత స్పష్టత కోసం ‘డివిజన్’కు వెళ్లాల్సిందేనని నిబంధనలు చెబుతున్నాయి. ఎవరూ ప్రశ్నించకపోతే.. మూజువాణి ఓటుతో సరిపెట్టవచ్చు. కానీ రెండు సందర్భాలలో స్పీకర్ హడావిడిగా మూజువాణి ఓటుతో సరిపెట్టేశారు. ‘డివిజన్’కు అవకాశమివ్వలేదు.
 

మరిన్ని వార్తలు