అడవిలో హై అలర్ట్ | Sakshi
Sakshi News home page

అడవిలో హై అలర్ట్

Published Thu, Mar 31 2016 2:50 AM

అడవిలో హై అలర్ట్ - Sakshi

 సాక్షి ప్రతినిధి కాకినాడ/చింతూరు : చరిత్రలో చెప్పినట్లు ఫ్రాన్స్ తుమ్మితే యూరప్‌కు జలుబు చేస్తుందో లేదో కానీ.. ఛత్తీస్‌గఢ్‌లో తుపాకి పేలితే విలీన మండలాలు గజగజా వణికిపోతున్నాయి. వరుస పోలీసు ఎన్‌కౌంటర్లు, మావోయిస్టుల ప్రతీకార దాడులతో పొరుగు రాష్ట్రం ఛత్తీస్‌గఢ్ అట్టుడుకుతోంది. పోలీసు ఎన్‌కౌంటర్లలో రెండు రోజుల క్రితమే ముగ్గురు.. ఈ నెల ప్రారంభంలో ఎనిమిది మంది మావోయిస్టులు హతమయ్యారు. దీనికి ప్రతీకారంగా మావోయిస్టులు బుధవారం చెలరేగిపోయారు. దంతేవాడలో సీఆర్‌పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న     వాహనాన్ని పేల్చేశారు. దీంతో ఏడుగురు జవాన్లు మృతి చెందారు. ఈ నేపథ్యంలో విలీన మండలాల్లో ఏపీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏజెన్సీలో హై అలర్ట్ ప్రకటించారు.
 
  ఛత్తీస్‌గఢ్, ఆంధ్రా-ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో భారీ ఎత్తున కూంబింగ్ చేపట్టారు. దీంతో ఏ సమయంలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని గిరిజనులు బిక్కుబిక్కుమంటున్నారు.ప్రతీకార దాడుల హోరు : ఇటీవల జరుగుతున్న వరుస ఘటనలతో సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జనవరి 16న ఛత్తీస్‌గఢ్ రాష్ర్టం బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఈ నెల 1న ఆంధ్రా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో గ్రేహౌండ్స్ బలగాలు జరిపిన దాడిలో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు.
 
  ఈ నెల 2న ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మఢ్ ప్రాంతంలో ఇన్‌ఫార్మర్ల నెపంతో 20 మంది ఆదివాసీలను మావోయిస్టులు హతమార్చారు. చింతూరు మండల సరిహద్దుకు సమీపంలోని మొర్లిగూడ వద్ద మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలడంతో ఒక జవాను మృతి చెందాడు. సుక్మా జిల్లా కిష్టారం అటవీ ప్రాంతంలో మావోయిస్టుల దాడిలో ముగ్గురు, కాంకేర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరో ముగ్గురు జవాన్లు బలయ్యారు. 
 
 మొర్లిగూడ, భెర్జివద్ద మావోయిస్టులు అమర్చిన మందుపాతరలు పేలడంతో ఓ బాలిక, ఓ మహిళ మృత్యువాత పడ్డారు. నారాయణ్‌పూర్ జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. దంతెవాడ జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు బుధవారం మందుపాతర పేల్చడంతో ఏడుగురు జవాన్లు బలయ్యారు. ఈ దాడుల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. మావోయిస్టుల కదలికలున్న ఎటపాక, ఏడుగురాళ్లపల్లి, చింతూరు, మోతుగూడెం, డొంకరాయి పోలీస్ స్టేషన్ల పరిధిలో సిబ్బందిని అప్రమత్తం చేశారు.

Advertisement
Advertisement