అవిశ్రాంత సేవ!

15 Jun, 2017 02:04 IST|Sakshi
అవిశ్రాంత సేవ!
- అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల రిటైర్మెంట్‌పై స్పష్టత కరువు
అరవై ఏళ్లు నిండినా బాధ్యతలు నిర్వహిస్తున్న వైనం
వివిధ కేటగిరీల్లో పనిచేస్తున్న 5,398 మంది
 
సాక్షి, హైదరాబాద్‌: 58 సంవత్సరాలు.. పదవీ విరమణకు అర్హత వయసు ఇది. ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఈ వయసు వస్తే వెంటనే ఉద్యోగానికి స్వస్తి పలకాల్సిందే. అయితే సమగ్ర శిశు అభివృద్ధి ప్రాజెక్టులో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఐసీడీఎస్‌ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేసే టీచర్లు, హెల్పర్లకు కొన్నేళ్లుగా పదవీ విరమణ లేదు. వారి రిటైర్మెంట్‌పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో నిర్దేశిత వయసు పైబడిన వారంతా విధుల్లో కొనసాగుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 5,398 మంది అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు అరవై ఏళ్లు నిండినట్లు ఆ శాఖ గణాంకాలు చెబుతున్నాయి.
 
సేవలు మందగమనం...
శిశు అభివృద్ధి కార్యక్రమాల అమలులో అంగన్‌వాడీ కేంద్రాలే కీలకం. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించడం, ఆరోగ్య సమస్యల్ని వైద్యశాఖకు చేరవేయడం.. ఇతర ప్రభుత్వ పథకాల అమలు లో భాగస్వామ్యం కావడం అంగన్‌వాడీ టీచర్లు, హెల్ప ర్ల ప్రధాన కర్తవ్యం. అయితే అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల పదవీ విరమణపై స్పష్టత లేకపోవడంతో కొన్ని చోట్ల సేవలు మందగిస్తున్నాయి. ప్రభుత్వం ఇటీవల ఐసీడీఎస్‌ కార్యక్రమాల అమలులో సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించింది. అంగన్‌వాడీల సర్వేల తాలూకు సారాన్ని ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేయడం, సరుకులు, గుడ్ల దిగుమతికి ఎగ్‌ యాప్‌ రూపకల్పన, క్షేత్రస్థాయిలో గణాంకాల సేకరణలో ప్రత్యేక నమూనాలను రూపొం దించడంతో వయసు మళ్లిన టీచర్లు, హెల్పర్లు ఉత్సాహంగా పనిచేయలేకపోతున్నారు. దీంతో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ.. పదవీ విరమణపై స్పష్టతనివ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.
 
ఆర్థిక సాయం తేలితేనే స్పష్టత..
సాధారణ ఉద్యోగులకు పీఎఫ్, సీపీఎస్‌ లాంటి పథకాలుండటంతో రిటైర్మెంట్‌ నాటికి వారికి ప్రత్యేక ఆర్థిక సాయం అందుతుంది. కానీ అంగన్‌వాడీల విషయంలో ఇలాంటి పథకాలు లేవు. దీంతో ఏళ్లుగా సేవలందించిన తమకు కొంత మొత్తాన్ని ఆర్థిక సాయం కింద ఇచ్చిన తర్వాతే రిటైర్మెంట్‌ చేయాలని సంఘాలు ఒత్తిడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థికసాయంపై స్పష్టత వస్తే తప్ప రిటైర్మెంట్‌ ప్రక్రియ కొలిక్కి రాదని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని వార్తలు