సైబర్‌ నేరగాళ్ల ‘డబుల్‌ ధమాకా’!

25 Jul, 2016 21:46 IST|Sakshi
సందీప్‌ సహోతా

► లక్కీ డ్రా పేరుతో కొంత మొత్తం స్వాహా
► అది తిరిగి ఇస్తామంటూ మరికొంత కాజేత
► నిందితుడిని అరెస్టు చేసిన సైబర్‌ క్రైమ్‌ కాప్స్‌


సాక్షి, సిటీబ్యూరో: ఈ–మెయిల్స్, ఎస్సెమ్మెస్, ఫోన్‌కాల్సే పెట్టుబడిగా రెచ్చిపోతున్న సైబర్‌ నేరగాళ్లు నానాటికీ తెలివి మీరుతున్నారు. లక్కీ డ్రాల పేరుతో కొందరు అందినకాడికి దండుకొని టోకరా వేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు దీనికి భిన్నంగా ‘డబుల్‌ ధమాకా’ ఇస్తున్నారు మరికొందరు సైబర్‌ క్రిమినల్స్‌. మొదట కొంత డబ్బు దండకోవడం, దాన్ని తిరిగి ఇస్తామంటూ మరికొంత కాజేస్తున్న ఘరానా నేరగాడిని సీసీఎస్‌ ఆధీనంలోని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేసినట్లు డీసీపీ అవినాష్‌ మహంతి సోమవారం వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన సందీప్‌ సహోతా ఆ రాష్ట్రంలోని వైశాలి ప్రాంతంలో స్థిరపడ్డాడు. పెరల్‌ పార్క్‌ సమీపంలో సాండ్స్‌ ఇన్ఫోసిస్టమ్స్‌ పేరుతో సంస్థను ఏర్పాటు చేసి కొత్త మోసానికి తెరలేపాడు.


‘లక్కీ’లోనూ వెరైటీ...
వివిధ మార్గాల్లో సెల్‌ఫోన్‌ వినియోగదారుల డేటా సేకరించే ఇతగాడు లక్కీ డ్రా పేరుతో ఫోన్లు చేస్తుంటాడు. సాధారణంగా ఈ తరహాలో ఫోన్లు చేసే నేరగాళ్లు లక్కీ డ్రా తలిగిలిందని, దాన్ని పొండానికి పన్నులు చెల్లించాలని చెప్పి కాజేస్తుంటారు. అయితే సందీప్‌ రూటే సెపరేటు. వినియోగదారులకు ఫోన్‌ చేసి ఆన్‌లైన్‌లో సాండ్స్‌ షాపింగ్‌ హబ్‌.కామ్‌ పేరుతో వెబ్‌సైట్‌ నిర్వహిస్తున్నామని చెప్తాడు. లక్కీ డ్రాలో మీ నెంబర్‌ ఎంపికైందంటూనే... ఎలాంటి పన్నుల మాట ఎత్తడు. ‘లక్కీ’ అయిన నేపథ్యంలో మా వెబ్‌సైట్‌లో ఉండే ఎలక్ట్రానిక్‌ వస్తువుల్ని 60 నుంచి 70 శాతం డిస్కౌంట్‌కు ఇస్తామంటాడు. ఎలాంటి వడ్డీ లేకుండా నెలసరి వాయిదాలకూ అవకాశం అంటూ నమ్మబలుకుతాడు. దీంతో కొందరు వినియోగదాడులు అతడి బుట్టలో పడతారు. సందీప్‌ ఇదే పంథాలో దేశ వ్యాప్తంగా మోసాలు చేస్తున్నాడు.


రెండు దఫాల్లో అందినంత...
నగరంలోని బేగంబజార్‌ ప్రాంతానికి చెందిన ధర్మేంద్ర తివారీకి కాల్‌ చేసిన సందీప్‌ ఇదే పంథాలో ఎర వేశాడు. తివారీ ఆసక్తి చూపడంతో డెబిట్‌కార్డ్‌ వివరాలు తెలపాలని కోరి రూ.13,999 అప్పటికప్పుడే కాజేశాడు. కొద్దిసేపటికి మళ్లీ కాల్‌ చేసిన సందీప్‌... మొదటి బుకింగ్‌ రద్దు చేసి, నగదు తిరిగి జమ చేస్తామన్నాడు. దీనికోసం మీ సెల్‌ ఫోన్‌కు వచ్చే వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌ చెప్పాలనడంతో ఆయన అలానే చేశారు. దీంతో రెండోసారి ఏకంగా రూ.54,996 కాజేశాడు. మోసపోయినట్లు గుర్తించిన తివారీ ఫిర్యాదు మేరకు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏసీపీ కేసీఎస్‌ రఘువీర్‌ నేతృత్వంలో ఇన్‌స్పెక్టర్‌ కేవీఎం ప్రసాద్‌ దర్యాప్తు చేసి నిందితుడు ఢిల్లీలో ఉన్నట్లు గుర్తించి అక్కడకు వెళ్లి అరెస్టు చేశారు. ఇతడి నుంచి రూ.1.5 లక్షల నగదు తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. సందీప్‌ను పీటీ వారెంట్‌పై హైదరాబాద్‌ తీసుకువచ్చి రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు