Mera Bill Mera Adhikar: బిల్‌ తీసుకుంటే చాలు..రూ. కోటి మీవే!

25 Aug, 2023 12:32 IST|Sakshi

'మేరా బిల్‌ మేరా అధికార్‌'  ప్రభుత్వ కొత్త స్కీం

వినియోగదార్లలో రశీదు అడిగే సంస్కృతిని ప్రోత్సహించడమే లక్ష్యం

ప్రతీ నెలా లక్కీ డ్రాలో 800, 10 లక్షల  బహుమతి 

బంపర్‌ డ్రా : కోటి రూపాయలు

Mera Bill Mera Adhikar: అన్ని కొనుగోళ్లకు ఇన్‌వాయిస్‌లు, బిల్లులు అడిగే  సంస్కృతిని ప్రోత్సహించేలాకేంద్రం  కొత్త పథకాన్ని తీసు కొస్తోంది రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ప్రభుత్వం 'మేరా బిల్ మేరా అధికార్' పేరుతో 'ఇన్‌వాయిస్ప్రోత్సాహక పథకాన్ని' ప్రారంభిస్తోంది. ఇందుకోసం వినియోగదారులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ప్రతి త్రైమాసికంలో లక్కీడ్రా నిర్వహించి, రూ.1 కోటి చొప్పున రెండు బంపర్‌ బహుమతులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

వినియోగదారులు తాము  జరిపే కొనుగోళ్లన్నింటికీ విక్రయదార్ల నుంచి రశీదును అడగడాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో 'మేరా బిల్‌ మేరా అధికార్‌' అనే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఆర్థిక శాఖ  పేర్కొంది. సెప్టెంబరు 1 నుంచి 12 నెలల కాలానికి ప్రయోగాత్మక పద్ధతిలో (పైలట్‌ ప్రాజెక్ట్‌)  ఈ  స్కీం షురూ కానుంది.  

ఆర్థిక శాఖ అందించిన వివరాల   ప్రకారం ప్రతీ నెలా లక్కీ డ్రాలో 800 జీఎస్‌టీ రశీదులను ఎంపిక చేస్తారు. వీరికి రూ.10,000 చొప్పున ప్రైజ్‌ మనీ ఇవ్వనుంది. లక్కీడ్రాలో ఎంపిక చేసిన మరో 10 రశీదులకు రూ.10 లక్షల చొప్పున  బహుమతి అందిస్తుంది. అయితే  ప్రతి మూడు నెలలకు ఒకసారి  బంపర్‌  డ్రా ఉంటుంది. ఇందుకోసం గత మూడు నెలల నుంచి బంపర్‌ డ్రా నెలలో 5వ తేదీ వరకు అప్‌లోడ్‌ చేసిన రశీదుల నుంచి విజేతను ఎంపిక చేస్తారు.  ఈ పథకం ప్రారంభంలో అసోం గుజరాత్ , హరియాణా,  పుదుచ్చేరి, దాద్రా అండ్‌ నగర్ హవేలీ మరియు డామన్ & డయ్యూ కేంద్రపాలిత ప్రాంతాలలో పైలట్‌గా లాంచ్‌ కానుంది.

డ్రా అర్హతలు, నిబంధనలు

♦ జీఎస్‌టీ రిజిస్టర్డ్‌ సప్లయ్‌దారులనుంచి వినియోగదార్లు తీసుకున్న రశీదులను మాత్రమే డ్రాకు పరిగణనలోకి తీసుకుంటారు.
♦ జీఎస్‌టీ గుర్తింపు సంఖ్య, రిసీట్‌ నెం,  డేట్‌, విలువ, ప్రాంతం తదితర వివరాలను పొందుపర్చాల్సి ఉంటుంది.
♦ డ్రాలో విజేతగా ఎంపికైన  కస్టమర్లు, ఈ సమాచారం అందిన తేదీ నుంచి 30 రోజుల్లోగా యాప్‌ లేదా  వెబ్‌పోర్టల్‌లో పాన్‌, ఆధార్‌, బ్యాంకు  అకౌంట్‌ లాంటి వివరాలివ్వాలి.
♦ ఒక నెలలో గరిష్ఠంగా ఒక వ్యక్తి 25 రశీదులను అప్‌లోడ్‌ చేయవచ్చు
♦ లక్కీ డ్రాకు అర్హత పొందాలంటే రశీదు విలువ కనీసం రూ.200
♦ బీ2సీ రశీదులన్నింటినీ  నెల 5వ తేదీ(అంతుకుముందు నెలలోని బిల్లులను)లోపు అప్‌లోడ్‌ చేస్తేనే నెలవారీ డ్రాకి అర్హత
వీటిని 'మేరా బిల్‌ మేరా అధికార్‌' మొబైల్‌ అప్లికేషన్‌లోను, 'వెబ్‌ డాట్‌ మేరాబిల్‌డాట్‌జీఎస్‌టీ డాట్‌ జీవోవీడాట్‌ఇన్‌ అనే వెబ్‌పోర్టల్‌లోనూ అప్‌లోడ్‌   చేయాలి. 

మరిన్ని వార్తలు