‘డబుల్‌’కు రియల్టర్లు రెడీ!

13 May, 2017 01:03 IST|Sakshi
‘డబుల్‌’కు రియల్టర్లు

సిటీబ్యూరో: ఎట్టకేలకు గ్రేటర్‌లో ‘డబుల్‌’ ఇళ్ల నిర్మాణానికి రియల్‌ రంగంలోని బిల్డర్లు ముందుకొస్తున్నారు. నగరంలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణానికి సంబంధిత రంగంలోని బడా కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో, జీహెచ్‌ఎంసీలో పేరు నమోదు చేసుకున్న రియల్‌ రంగంలోని వారికి సైతం టెండర్లలో పాల్గొనేందుకు అవకాశమిస్తూ ప్రభుత్వం మినహాయింపునిచ్చింది. అయినప్పటికీ వారి నుంచి ఆశించిన స్పందన కనిపించలేదు. జీహెచ్‌ఎంసీ అధికారులతో పాటు మునిసిపల్‌ మంత్రి కేటీఆర్‌ సైతం రియల్‌ రంగంలోని బిల్డర్లతో సమావేశం నిర్వహించి ఇళ్ల నిర్మాణానికి ముందుకు రావాలని కోరారు.

గ్రేటర్‌లో ఈ సంవత్సరం లక్ష డబుల్‌ బెడ్‌రూమ్‌ఇళ్లు లక్ష్యం కాగా, ఇటీవల జీహెచ్‌ఎంసీ టెండర్లు పిలిచిన 12,242 ఇళ్లకు గాను 11,962 ఇళ్లకు టెండర్లు దాఖలయ్యాయి. మొత్తం 14 ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి ఈ టెండర్లు ఆహ్వానించగా, ఒక చోట ఎవరూ టెండరు దాఖలు చేయలేదు. మరోచోట సాంకేతిక కారణాలతో పెండింగ్‌లో పడింది. మిగతా 12 ప్రాంతాల్లో 11,962 ఇళ్లకు టెండర్లు ప్రాథమికంగా అర్హత పొందాయి. పూర్తిస్థాయి పరిశీలనానంతరం అర్హులైన వారికి టెండర్లు ఖరారు చేయనున్నారు. ఈ 12 ప్రాంతాల్లోనూ పది  ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి రియల్‌ రంగంలోని వారే టెండర్లు దాఖలు చేశారు. మిగతా రెండు ప్రాంతాల్లో కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేశారు. రియల్‌ రంగంలోని బిల్డర్ల నుంచి టెండర్లు దాఖలు కావడంతో  అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

వీరు టెండర్లు దాఖలు చేసిన ప్రాంతాల్లో నగర కోర్‌ ఏరియాతోపాటు రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలోని శివారు ప్రాంతాలున్నాయి. ఇదిలా ఉండగా న్యూ ఇందిరానగర్‌లో మాత్రం ఎవరూ టెండరు దాఖలు చేయలేదు. నార్సింగి సర్వే నెం. 105కు సంబంధించి సాంకేతిక ఇబ్బందులతో పెండింగ్‌లో ఉంచారు. మురహరిపల్లి, శ్రీరామ్‌నగర్‌లలో ఇళ్ల నిర్మాణాలకు పెద్ద కాంట్రాక్టర్లు ముందుకు రాగా, మిగతా అన్ని ప్రాంతాల్లో రియల్టర్లు టెండర్లు దాఖలు చేసినట్లు సంబంధిత అధికారి పేర్కొన్నారు.
 

>
మరిన్ని వార్తలు