‘నకిలీ’ ముద్రణకు పాక్‌లో పవర్‌ప్రెస్

10 Sep, 2016 01:12 IST|Sakshi
‘నకిలీ’ ముద్రణకు పాక్‌లో పవర్‌ప్రెస్

- దొంగ నోట్ల తయారీకి క్వెట్టా కేంద్రంగా ఏర్పాటు
- బంగ్లాదేశ్ మీదుగా భారత్‌లోకి పంపుతున్న ఐఎస్‌ఐ

సాక్షి, హైదరాబాద్: భారత ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసే ఉద్దేశంతో భారీగా నకిలీ కరెన్సీని ముద్రించి, దేశంలోకి పంపిస్తున్న పాక్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ.. దీనికోసం ప్రత్యేకంగా పవర్‌ప్రెస్‌ను ఏర్పాటు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా ప్రాంతం నుంచి నకిలీ కరెన్సీని తీసుకువచ్చి హైదరాబాద్‌లో చెలామణి చేయడానికి యత్నించిన అంతర్రాష్ట్ర ముఠాను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు బెంగాలీలతో సహా ముగ్గురిని అరెస్టు చేశారు. వీరి నుంచి రూ. 11.95 లక్షలు స్వాధీనం చేసుకున్నట్టు అదనపు డీసీపీ ఎన్.కోటిరెడ్డి శుక్రవారం వెల్లడించారు. ఈ కరెన్సీ సైతం పవర్ ప్రెస్‌లోనే ముద్రితమై బంగ్లాదేశ్ మీదుగా పశ్చిమ బెంగాల్‌కు వచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రాంతం క్వెట్టాలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ ‘భారత్ పవర్ ప్రెస్’లో ముద్రితమవుతున్న నకిలీ నోట్లు అసలు కరెన్సీని తలదన్నేలా ఉన్నప్పటికీ... మూడు సెక్యూరిటీ ఫీచర్స్‌ను మాత్రం ఐఎస్‌ఐ కాపీ చేయలేకపోయింది.

 తొలిసారిగా యూఏపీఏ కింద కేసు
నకిలీ కరెన్సీ కేసుల్ని పోలీసులు ఐపీసీలోని సెక్షన్ 489 కింద నమోదు చేస్తారు. గౌస్ ఇప్పటికి 9 సార్లు చిక్కగా.. ఇదే సెక్షన్ కింద కేసు నమోదు కావడంతో బెయిల్‌పై బయటకు వచ్చి మళ్లీ దందా చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తొలిసారిగా నకిలీ కరెన్సీ కేసును అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ (యూఏపీఏ) కింద పోలీసులు నమోదు చేశారు. దీంతో ఇతడిపై పీడీ యాక్ట్ ప్రయోగించడానికి మార్గం సుగమమైంది. ఇకపై ఈ తరహా కేసుల్ని ఈ చట్ట ప్రకారమే నమోదు చేయాలని నిర్ణయించారు. నకిలీ కరెన్సీని మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న భార త పవర్ ప్రెస్‌కు పంపి పరీక్షలు చేయించారు.

రూటు మార్చి భారత్‌కు సరఫరా...
క్వెట్టాలో ముద్రితమవుతున్న ఈ నకిలీ కరెన్సీ తొలుత కరాచీకి చేరుతోంది. అక్కడ నుంచి ఐఎస్‌ఐ ప్రత్యేక పార్శిల్స్ ద్వారా వివిధ మార్గాల్లో భారత్‌కు పంపిస్తోంది. గతంలోలా సముద్ర మార్గం ద్వారా తరలించడం కష్టంగా మారడంతో ఐఎస్‌ఐ రూటు మార్చింది. కరాచీ నుంచి విమానాల ద్వారా బంగ్లాదేశ్‌కు చేరవేస్తోంది. అక్కడ నుంచి పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాకు తీసుకువచ్చి ఏజెంట్ల ద్వారా చెలామణి చేయిస్తోంది. తద్వార దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడంతో పాటు అలా వచ్చే నిధుల్ని పాక్ పరోక్షంగా ఉగ్రవాదానికి వాడుతోందనే అనుమానాలున్నాయి. ఏజెం ట్లకు ఐఎస్‌ఐ భారీగా కమీషన్లు చెల్లిస్తోంది.

మరిన్ని వార్తలు