ఉపాధి కల్పన పేరుతో రూ.వంద కోట్లలు దోపిడీ!

2 Jul, 2013 04:39 IST|Sakshi
 సాక్షి,సిటీబ్యూరో:  నిరుద్యోగులకు ఉపాధి పేరిట గ్రేటర్‌లో కొనసాగుతున్న ఆటో పర్మిట్ల దోపిడీపై లోకాయుక్త విచారణకు ఆదేశించింది. గ్రేటర్‌లో ఇరవై వేల కొత్త ఆటోలకు ప్రభుత్వం అనుమతినిస్తూ రూపొందించిన అడ్డగోలు నిబంధనలపై తీవ్రంగా స్పందించింది. ఉపాధి కల్పన పేరుతో రూ.వంద కోట్లకు పైగా దోచుకునేందుకు సర్కారు రంగం సిద్ధం చేసిందని, రవాణాశాఖ మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీ, రవాణా కమిషనర్‌లను ప్రతివాదులుగా పేర్కొంటూ నాగోల్ ఆటో డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు చేసిన ఫిర్యాదును లోకాయుక్త పరిగణనలోకి తీసుకుంది.
 
ఆటో డ్రైవర్లను తోసిరాజని ‘ఎలాంటి డ్రైవింగ్ లెసైన్స్ కలిగి ఉన్న వారికైనా ఆటోలు అమ్ముకోవచ్చు’నంటూ రవాణాశాఖ ఇచ్చిన మార్గదర్శకాలు పెద్ద ఎత్తున ఆటో పర్మిట్ల బ్లాక్ మార్కెటింగ్‌కు అవకాశం కల్పించాయని ఆటో సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. కేవలం అర్హులైన ఆటో డ్రైవర్లకు మాత్రమే పర్మిట్లు ఇవ్వాలంటూ గత రవాణా కమిషనర్ సంజయ్‌కుమార్ ఇచ్చిన మార్గదర్శకాలను ప్రస్తుత రవాణా కమిషనర్ అనంతరాము బుట్ట దాఖలు చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వ పెద్దలకు రూ.30 కోట్ల వరకు ముడుపులు ముట్టినట్లు ఆటో సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై తీవ్రంగా స్పందించిన లోకాయుక్త ఈనెల 17వ తేదీ లోగా 20 వేల కొత్త ఆటోపర్మిట్లపై సమగ్రమైన నివేదిక ఇవ్వాలని ఆ ముగ్గురునీ ఆదేశించింది.
 
 దోపిడీ పర్వం ఇలా...
 
 ప్రస్తుతం గ్రేటర్‌లో లక్షా 10 వేల ఆటోలు ఉన్నాయి. పొరుగు జిల్లాల నుంచి మరో 10 వేల ఆటోలు రాకపోకలు సాగిస్తాయి. మరో 20 వేల కొత్త ఆటోలు అవసరమని ప్రభుత్వం  నిర్ణయించి, వాటికి అనుమతినిస్తూ జీవో(90) విడుదల చేసింది. అర్హులైన ఆటో డ్రైవర్లకు మాత్రమే చెందాల్సిన ఈ ఆటో పర్మిట్లు ఫైనాన్సర్లు, డీలర్ల ఖజానా నింపుతున్నాయి. రాష్ర్టంలోని ఇతర జిల్లాలు, పొరుగు రాష్ట్రాల్లో రూ.లక్షా 10 వేల నుంచి రూ.లక్షా 25 వేల లోపే లభిస్తున్న కొత్త ఆటో నగరంలో మాత్రం రూ.లక్షా 75 వేలకు విక్రయిస్తున్నారు. ఈ విధంగా రూ.వంద కోట్ల దోపిడీకి పాల్పడుతున్నారు. 
 
 బినామీ పేర్లతో దందా..
 
 ఈ దోపిడీ పర్వంలో ఫైనాన్సర్లు మరో అడుగు ముందుకేశారు. ‘ఏదైనా డ్రైవింగ్ లెసైన్స్’ అనే నిబంధనను అడ్డు పెట్టుకొని బినామీ పేర్లతో ఆటోలను కొనుగోలు చేసి ఫైనాన్స్‌లో తిరిగి డ్రైవర్లకు కట్టబె డుతున్నారు. ఒక్కో ఫైనాన్సర్ రకరకాల పేర్లతో వందల ఆటోలను తమ గోడౌన్‌కు తరలిస్తున్నట్లు ఆటో సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇలా తరలించిన వాటిపై ఫైనాన్సర్లు నూటికి రూ.1.30 వడ్డీ చొప్పున, 30 నుంచి 35 నెలల కాలపరిమితికి డ్రైవర్ల నుంచి వసూలు చేస్తున్నారు. కొత్త ఆటోలకు ప్రభుత్వం అనుమతి నిచ్చిన ఈ పదిహేను రోజుల్లో సుమారు 2500 మంది ఇలా అధిక వడ్డీలకు ఆటోలు కొనుగోలు చేశారు. డీలర్లు, ఫైనాన్సర్ల ధన దాహానికి మరో 17,500 మంది నిరుపేద ఆటోడ్రైవర్లు సమిధలు కానున్నారు.
 
మరిన్ని వార్తలు