బంగారం ధర తగ్గినా కొనేవారులేరు!

21 Apr, 2015 19:53 IST|Sakshi
బంగారం ధర తగ్గినా కొనేవారులేరు!

హైదరాబాద్: అక్షయ తృతీయ అనగానే  బంగారం షాపులు పూలతో సింగారించుకుని కొనుగోలు దారులకు ఆహ్వనం పలికేవి. కానీ ఈ అక్షయ తృతీయకు మాత్రం  కొనుగోలు దారులు లేక బంగారం షాపులు వెలవెలబోతున్నాయి. కిందటి ఏడాదితో పోల్చితే బంగారం ధర తగ్గినా, కొనుగోళ్ళు మాత్రం పుంజుకోలేదు. అక్షయ తృతీయ అనగానే మహిళలే కాదు అటు బంగారం షాపు యజమానులు సంతోషపడే వారు.  కానీ ఈ సారి పరిస్థితి వేరుగా ఉంది. అటు కస్టమర్లు ఇటు బంగారం షాపు యజమానులు నిరుత్సాహంగా ఉన్నారు. కారణం  ఒక్కటే. అక్షయ తృతీయ  రోజున తృతీయ ముహూర్తం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకే ఉండటం. ఆ ముహూర్తంలోనే ఎక్కువ మంది బంగారం కొనుగోలు చేసేందుకు ఇష్టపడతారు. అంతేకాదు ఆ ముహూర్తంలో కొంటే సాక్షాత్తు లక్ష్మీ దేవి నట్టింట్లో ఏడాది మొత్తం తిరుగుతుందని ఎక్కువ మంది నమ్మకం. ఈ సారి రాత్రి ముహూర్తం ఉండటం కొంత కస్టమర్లను  నిరుత్సాహపడేలా చేస్తోంది.  అయినప్పటికీ కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు ఆఫర్లు ఇస్తున్నామని  బంగారం అమ్మకం దారులు చెపుతున్నారు.

ఇక కస్టమర్లు మాత్రం ముమూర్తం ఎప్పుడున్నా ఖచ్చితంగా కొనితీరుతామని చెపుతున్నారు. సెంటిమెంట్‌గా భావించడం వల్లనే కొనుగోలు చేస్తున్నామని ఈ రోజు బంగారం కొంటే మంచి జరుగుతుందని వారు చెపుతున్నారు. ఇక కిందటి ఏడాది ఇదే అక్షయ తృతీయకు  10 గ్రాముల బంగారం ధర 30 వేల  రూపాయలు ధర పలికింది, కిలో వెండి ధర 47వేల 500 రూపాయలు.  ఈ ఏడాది  మాత్రం 10 గ్రాముల బంగారం ధర 26 వేల రూపాయలకు తగ్గింది. కిలో వెండి 37 వేల రూపాయలకు పడిపోయింది. అయినప్పటికీ బంగారం వెండి కొనుగోలు చేసేందుకు కస్టమర్లు ముందకు రావడం లేదు.  స్టాక్స్‌లలో పెట్టుపెట్టడానికే  పెద్ద పీఠ వేస్తున్నారని గోల్డ్‌ అనలిస్ట్‌లు  చెపుతున్నారు. బంగారం ధర పెరుగుతూ ఉంటే కొనుగోలుదారులు ఎగబడతారు. తగ్గుతూ ఉంటే కొనడానికి అంతగా ఆసక్తి చూపరని అర్ధమవుతోంది.

మొత్తం మీద ఈ సారి బంగారం షాపుల యజమానులకు కాసుల పంట పండిస్తుందనుకున్న అక్షయ తృతీయ చాలా నిరాశ మిగిల్చింది.  అయినప్పటికీ రానున్నది పెళ్ళిళ్ళ సీజన్‌ అయినందున మళ్లీ ధరలు పుంజుకుంటాయని అమ్మకాలు పెరుగుతాయనే ఆశాభావంతో వారు ఉన్నారు.

మరిన్ని వార్తలు