కలసికట్టుగా ‘మత్తు’ వదిలిద్దాం

23 Aug, 2017 00:36 IST|Sakshi
- డ్రగ్స్‌ నియంత్రణకు ‘ఎక్సైజ్‌’ కార్యాచరణ 
డీఆర్‌ఐ, ఎన్‌సీబీ, పోలీస్‌ శాఖలతో సమావేశం
 
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోకి డ్రగ్స్‌ రాకుండా నియం త్రించేందుకు ఎక్సైజ్‌ శాఖ కార్యాచరణ రూపొందిస్తోంది. డ్రగ్స్‌ మాఫియాకు చెక్‌ పెట్టేందుకు పలు దర్యాప్తు విభాగాల ఆధ్వర్యంలో సంయుక్తంగా కలసి పని చేయాలని నిర్ణయించింది. మంగళవారం ఈ మేరకు రాష్ట్ర ఆబ్కారీ శాఖ భవనంలో ఎక్సైజ్‌ కమిషనర్‌ చంద్రవదన్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌ నేతృత్వంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో, డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్, కస్టమ్స్, బ్యూరో ఆఫ్‌ ఇమిగ్రేషన్, రాష్ట్ర ఇంటెలిజెన్స్, సీఐఎస్‌ఎఫ్, డ్రగ్‌ కంట్రోల్‌ బోర్డు, రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల నుంచి వచ్చిన అధికారులతో నాలుగు గంటల పాటు సమావేశం కొనసాగింది. 
 
ఆ నెట్‌వర్క్‌లను ఛేదించాలి 
ప్రస్తుతం రాష్ట్రంలోకి వివిధ దేశాల నుంచి వస్తున్న నార్కోటిక్‌ డ్రగ్, సైకోట్రోఫిక్‌ మత్తు పదార్థాల నియంత్రణకు ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లు, ఓడరేవుల్లో విజిలెన్స్‌ను పటిష్టం చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా ఆఫ్రికన్‌ డ్రగ్‌ రవాణా నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు కేంద్ర హోంశాఖ నుంచి నిధులు ఉపయోగించుకొని ఉమ్మడిగా పని చేయా లని నిర్ణయించారు. ఇటీవల డ్రగ్‌ కేసు వ్యవహారంతో ఈ విభాగాలన్నీ చేసిన దాడులు, పట్టుబడ్డ మత్తు పదార్థాలు, వాటి లింకులపై చర్చించారు. హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో తయారవుతున్న మత్తు పదార్థాల కేంద్రాలపై దాడులు, కేసుల నమోదు, వాటి దర్యాప్తునకు కావాల్సిన అవసరాలపై దృష్టి కేంద్రీకరించినట్టు ఎక్సైజ్‌ అధికారులు తెలిపారు.  
మరిన్ని వార్తలు