కేసు వెనక ఎవరెవరు? | Sakshi
Sakshi News home page

కేసు వెనక ఎవరెవరు?

Published Wed, Aug 23 2017 12:39 AM

కేసు వెనక ఎవరెవరు? - Sakshi

ఉన్నపళంగా మూడుసార్లు తలాక్‌ చెప్పి విడాకులిచ్చే విధానాన్ని సుప్రీంకోర్టులో సవాల్‌ చేసిన వారంతా ముస్లిం మహిళలే. దీనికి సంబంధించి మొత్తం ఏడు పిటిషన్లను ఒకచోట చేర్చి సుప్రీంకోర్టు విచారించింది. ఈ కేసులు వేసిన మహిళలు ఎవరంటే...

షయారా బానో
ఉత్తరాఖండ్‌ ఉద్ధమ్‌సింగ్‌నగర్‌ జిల్లాకు చెందిన షయారా బానో 2002లో అలహాబాద్‌కు చెందిన స్థిరాస్తి వ్యాపారి రిజ్వాన్‌ అహ్మద్‌ను పెళ్లాడింది. 2015 అక్టోబర్‌లో ఉత్తరం ద్వారా ఆమె భర్త మూడుసార్లు తలాక్‌ చెప్పడంతో పాటు ఇద్దరు పిల్లలనూ తీసుకెళ్లిపోయాడు. మూడునెలల విరామాన్ని (ఇద్దత్‌) పాటించకుండా ఈ విధమైన విడాకులు ఇవ్వడం అక్రమం, రాజ్యాంగ విరుద్ధమని బానో సుప్రీంకోర్టులో కేసు వేశారు.

ఇష్రత్‌ జహన్‌
పెళ్లికి ముగింపు పలికేందుకు తలాక్‌కు రాజ్యాంగబద్ధతను కల్పించడాన్ని ఇష్రత్‌ జహన్‌ ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్‌లోని హౌరాకు చెందిన ఆమె నలుగురు పిల్లలకు తల్లి. జహన్‌కు ఆమె భర్త ముర్తజా 2015లో దుబాయ్‌ నుంచి టెలిఫోన్‌ ద్వారా మూడుసార్లు తలాక్‌ చెప్పడం దిగ్భ్రాంతిని కలిగించింది. ఫోన్‌ ద్వారా తలాక్‌ సమ్మతం కాదనీ, న్యాయం చేయాలంటూ ఆమె కేసు వేశారు.  

గుల్షన్‌ పర్వీన్‌
పుట్టింట్లో ఉండగా రూ. పది స్టాంప్‌ పేపర్‌పై భర్త పంపించిన విడాకుల పత్రం(తలాక్‌నామా)ను సవాల్‌ చేస్తూ యూపీలోని రాంపూర్‌కు చెందిన గుల్షన్‌ పర్వీన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పర్వీన్‌కు 2013 ఏప్రిల్‌లో వివాహం కాగా రెండేళ్ల కుమారుడున్నాడు. భర్త తరచుగా తనను ఇనుపరాడ్‌తో కొట్టేవాడనీ, విడాకులు ఇవ్వడంతో తాను, తన కొడుకు నిరాశ్రయులై పోయామనీ, న్యాయం చేయాలని ఆమె కోరారు.

ఆఫ్రీన్‌ రెహ్మాన్‌
వివాహ సంబంధాల పోర్టల్‌ ద్వారా 2014లో సయ్యద్‌ అలీ వార్సీని జైపూర్‌కు చెందిన ఆఫ్రీన్‌ రెహ్మాన్‌ పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన రెండు నెలల తర్వాత కట్నం కోసం అత్తమామల వేధింపులు మొదలయ్యాయి. చివరకు 2015 సెప్టెంబర్‌లో తనను ఇంటి నుంచి గెంటేశారని ఆఫ్రీన్‌ చెబుతున్నారు. పుట్టింట్లో ఉన్న తనకు 2016 జనవరిలో స్పీడ్‌పోస్ట్‌ ద్వారా విడాకులు అందాయనీ, ఇది తనకు ఆమోదయోగ్యం కాదని ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు.

మరో ముస్లిం న్యాయవాది పిటిషన్‌
సుప్రీంకోర్టు న్యాయవాది ఫరా ఫైజ్‌ కూడా పిటిషనర్లలో ఒకరు. షరియా చట్టం కింద ముస్లిం మహిళలకు భద్రత ఉన్నా ఖురాన్‌లో లిఖించని ట్రిపుల్‌ తలాక్, నిఖా హలాలాకు పర్సనల్‌లా బోర్డు ప్రాధాన్యతనిస్తోందని ఆమె అభ్యంతరం వ్యక్తంచేశారు.
♦ ఇంకా అతియా సాబ్రీతోపాటు భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్‌ (బీఎంఎంఏ) పిటిషన్‌ వేశారు.

 – సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌ 

Advertisement
Advertisement