ఆ వివాదాలు తేలకుండా విడాకులివ్వద్దు

19 Mar, 2017 05:30 IST|Sakshi
ఆ వివాదాలు తేలకుండా విడాకులివ్వద్దు

- ఎన్‌ఆర్‌ఐ భర్తకు కుటుంబ న్యాయస్థానం ఆదేశం
- అమెరికాలో విడాకుల కేసు విచారణ నిలిపివేస్తూ ఉత్తర్వులు


సాక్షి, హైదరాబాద్‌: భారత్‌లో ఉంటున్న బిడ్డ సంరక్షణ, భార్యతో ఉన్న ఆస్తుల పంపకం వివాదాలు తేలకుండా అమెరికాలో విడాకుల కేసును కొనసాగించవద్దని ఓ ఎన్‌ఆర్‌ఐని హైదరాబాద్‌ నగర కుటుంబ న్యాయస్థానం ఆదేశించింది. ఈ నెల 31 వరకు విడాకులు కేసు విచారణను ఆపాలంటూ న్యాయమూర్తి తిరుపతయ్య సదరు ఎన్‌ఆర్‌ఐని ఆదేశిస్తూ ఇటీవల మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. అదనపు కట్నం కోసం భార్యను వేధించడంతోపాటు భార్య, పిల్లలను భారత్‌కు పంపించి అమెరికా న్యాయస్థానం ద్వారా విడాకులు పొందాలని ప్రయత్నించిన ఎన్‌ఆర్‌ఐ కొమ్మినేని సిద్దిజ్ఞానేశ్వరప్రసాద్‌కు ఇక్కడి న్యాయస్థానం ఆదేశాలు ప్రతిబంధకంగా మారాయి.

ఇక్కడి కేసులు, సివిల్‌ వివాదాలు తేలకుండా అమెరికాలో తన భర్త ప్రసాద్‌ వేసిన విడాకుల కేసు విచారించకుండా ఆదేశించాలని కోరుతూ సోని ఓలేటి కొమ్మినేని అనే మహిళ కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. హిందూ సంప్రదాయం ప్రకారం భారత్‌లో పెళ్‌లైందని, ఇక్కడ క్రిమినల్, సివిల్‌ వివాదాలు పెండింగ్‌లో ఉండగా ఏకపక్షంగా అమెరికాలో విడాకుల కేసు కొనసాగితే సోనికి అన్యాయం జరుగుతుందని ఆమె తరఫు న్యాయవాది వై.బాలాజీ కోర్టుకు నివేదించారు. 2013 డిసెంబర్‌ 6న తిరుపతిలో సోనీని ప్రసాద్‌ వివాహం చేసుకున్నారని, అనంతరం కోటి రూపాయలు కట్నం తేవాలంటూ ఆమెను వేధింపులకు గురిచేశారని తెలిపారు.

కాన్పు ఖర్చు తేవాలని వేధింపులు
అమెరికా వెళ్లేందుకు విమాన ఖర్చుల కోసం రూ.3 లక్షలు తీసుకొని సోనీని అమెరికా తీసుకెళ్లార ని న్యాయవాది వివరించారు. అమెరికాలో ఉన్న సమయంలో ఓ సారి హత్యాయత్నంతోపాటు కాన్పు ఖర్చునూ పుట్టింటి నుంచి తేవాలని వేధించే వారన్నారు. 2015 నవంబర్‌ 15న నెలల బాబుతో భార్యను భారత్‌లో వదిలి, ఆమె పాస్‌పోర్టు లాక్కొని ప్రసాద్‌ అమెరికా వెళ్లిపోయాడని పేర్కొ న్నారు. ఈ క్రమంలోనే ప్రసాద్‌ అమెరికాలోని టెక్సాస్‌ డెన్‌టౌన్‌ కౌంటీ జిల్లా కోర్టులో విడాకుల కేసు దాఖలు చేశారన్నారు. సమన్లు అందుకున్న సోని తమ మధ్య వివాదాలు తేలేవరకూ విడాకుల కేసు విచారించవద్దని అభ్యంతరం వ్యక్తం చేశారని వివరించారు. అయితే ఆ వివాదాలను పరిష్కరించే పరిధి తమకు లేదని, విడాకుల కేసును మాత్రమే విచారించే అధికారం తమకుందని అక్కడి కోర్టు స్పష్టం చేసింది. అక్కడి విడాకులు కేసులో ముందుకు వెళ్లకుండా ప్రసాద్‌ను ఆదేశించాలని కోరుతూ సోని కుటుంబ కోర్టును ఆశ్రయించింది.

మరిన్ని వార్తలు