‘వీల్‌చైర్‌’ ఘటనపై గవర్నర్‌కు నివేదిక

19 Mar, 2017 05:15 IST|Sakshi
‘వీల్‌చైర్‌’ ఘటనపై గవర్నర్‌కు నివేదిక

నరసింహన్‌కు వివరణ ఇచ్చిన వైద్య శాఖ ఉన్నతాధికారులు
బాధ్యులుగా పేర్కొంటూ ఇద్దరు కాంట్రాక్టు కార్మికుల తొలగింపు
‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపిన పలువురు రోగులు


హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో జరిగిన వీల్‌చైర్‌ ఘటనపై వైద్య ఉన్నతాధికారులు శనివారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ను కలసి నివేదిక అందించారు. ఇరువురు అవుట్‌సోర్సింగ్‌ కాంట్రాక్టు కార్మికులను బాధ్యులను చేస్తూ విధుల నుంచి తొలగించినట్లు తెలిపారు. విద్యుదాఘాతానికి గురైన బేగంపేటకు చెందిన రాజును చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తీసుకు రాగా వీల్‌చైర్లు అందుబాటులో లేవు. మరుసటిరోజు చిన్నపిల్లల సైకిల్‌ను వీల్‌చైర్‌గా వినియోగించి గాంధీ ఓపీ విభాగానికి వచ్చాడు.

నడవలేని స్థితిలో ఉన్న రాజు చిన్నపిల్లల సైకిల్‌తో వచ్చిన దృశ్యాలతో ‘హేరాం.. ఎంతటి దైన్యం’ శీర్షికన సాక్షి ప్రచురించిన కథనానికి రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ స్పందించి వీల్‌చైర్‌ ఘటనతోపాటు గాంధీ ఆస్పత్రికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని నివేదిక రూపంలో ఇవ్వాలని ఆదేశించారు. దీంతో వైద్యశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్‌ తివారీ, డీఎంఈ డాక్టర్‌ రమణి, గాంధీ ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ బీఎస్వీ మంజుల శనివారం సాయంత్రం 5 గంటలకు గవర్నర్‌ను కలసి నివేదిక అందించారు. రాజు విద్యుదాఘాతానికి గురై గాంధీ ఆస్పత్రిలో చేరిన తర్వాత అందించిన వైద్యసేవలను కేస్‌షీట్లతో సహా చూపించారు.

వీల్‌చైర్ల విషయంతో ఓపీ విభాగంలో విధులు నిర్వహిస్తున్న అవుట్‌సోర్సింగ్‌ కాంట్రాక్టు కార్మికులు పి.వెంకటరత్నం, ఎస్‌.మహేంద్రాబాయిలను విధుల నుంచి తొలగించినట్లు వివరించారు. అనంతరం గాంధీ ఆస్పత్రిలో ఓపీ, ఐపీ వివరాలతోపాటు మౌలిక సదుపాయాలు, వైద్యపరికరాలు, లిఫ్ట్‌లు, సీటీ, ఎమ్మారై స్కానింగ్‌ యంత్రాలు, పడకలు, పారిశుధ్యం తదితర అంశాలపై రూపొందించిన నివేదికను గవర్నర్‌కు అందించారు.

గాంధీ ఆస్పత్రిలో నిరుపేదలకు అందిస్తున్న వైద్యసేవలపై గతంలోనే గవర్నర్‌ నరసింహన్‌ అధికారులకు హెచ్చరించారు. గతేడాది ఫిబ్రవరి 19వ తేదిన గాంధీ ఆస్పత్రిని ఆకస్మికంగా సందర్శించిన గవర్నర్‌ అక్కడి వైద్యసేవలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదిలాఉండగా గాంధీ ఆస్పత్రిలో జరుగుతున్న ఘటనలపై సాక్షి స్పందించిన తీరుపై పలువురు రోగులు, రోగి సహాయకులు హర్షం వ్యక్తం చేస్తూ, సాక్షి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, వైద్య మంత్రి లక్ష్మారెడ్డి ఆదివారం గాంధీ ఆస్పత్రిని సందర్శించనున్నారు. ఆదివారం ఉదయం 9 నుంచి రాత్రి 7 గంటల వరకు మంత్రి లక్ష్మారెడ్డి ఆస్పత్రిలోనే బస చేసి అన్ని అంశాలపై సమీక్షించనున్నారు.

మరిన్ని వార్తలు