తవ్వేకొద్దీ వేలకోట్లు

10 Aug, 2016 01:37 IST|Sakshi
తవ్వేకొద్దీ వేలకోట్లు

నయీమ్ నేర సామ్రాజ్యంలో వెలుగుచూస్తున్న అక్రమ ఆస్తులు
 
కట్టలుకట్టలుగా భూ లావాదేవీలు, బినామీ దందాల పత్రాలు
నగర శివారుల్లోనే వేల కోట్ల ఆస్తులు?
నల్లగొండ జిల్లా బొమ్మలరామారంలో ఒక్కచోటే 500 ఎకరాలు
150 డాక్యుమెంట్లలోని ఆస్తుల విలువ రూ.1,500 కోట్లు
విస్తుపోతున్న అధికారులు

 
 సాక్షి, హైదరాబాద్/నల్లగొండ/మహబూబ్‌నగర్:
 తవ్వే కొద్దీ కట్టలు కట్టలుగా బయటపడుతున్న డాక్యుమెంట్లు.. లెక్కలు తీసే కొద్దీ కళ్లు చెదిరే అస్తులు.. అక్కడా ఇక్కడా అని తేడా లేదు.. ఎక్కడ పడితే అక్కడ ఎకరాల కొద్దీ భూములు.. ప్లాట్లు.. బంగ్లాలు.. విలువైన ఆభరణాలు..! బినామీలు, బంధువుల పేరిట లెక్కలేనన్ని ఆస్తులు..!! రెండు దశాబ్దాలుగా నయీమ్ నిర్మించుకున్న నేరసామ్రాజ్యంలో అక్రమాస్తుల పుట్టలు పగులుతున్నాయి. ఒక్కో పుట్టలోంచి వందల కోట్ల ఆస్తులు బయటపడుతున్నాయి. బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ వేల కోట్ల దాకా ఉంటుందని తెలుస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన ప్రాంతాలతోపాటు పాటు నల్లగొండ జిల్లా భువనగిరి సమీపంలో నయీమ్ ఇబ్బడిముబ్బడిగా ఆస్తులు కూడబెట్టినట్టు వెల్లడైంది.

హైదరాబాద్, శివారు ప్రాంతాల్లోనే నయీమ్ భూదందా రూ.వెయ్యి కోట్లకు చేరినట్లు సమాచారం. సంపన్నులు ఉండే జూబ్లీహిల్స్ మొదలుకొని కొండాపూర్, షేక్‌పేట, అత్తాపూర్, రామాంతపూర్, సరూర్‌నగర్, ఘట్‌కేసర్, బైరామల్‌గూడ, సైదాబాద్‌లలో నయీమ్ పేరిట భూములు, ఫ్లాట్లు ఉన్నట్టు తేలింది. నగర శివార్లలోని అల్కాపురి టౌన్‌షిప్‌లో ఉన్న నయీమ్ ఇంటి నుంచి నార్సింగి పోలీసులు ఒరిజినల్, జిరాక్సులు కలిపి మొత్తం 210 పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో అత్యధికం స్థలాలకు సంబంధించినవే ఉన్నాయి. వీటిలో ఉన్న 175 ఒరిజినల్ డాక్యుమెంట్లు నయీమ్‌కు చెందిన బినామీ ఆస్తులని, మిగిలినవి సెటిల్‌మెంట్ల కోసం అతడి వద్దకు వచ్చిన వారిచ్చిన జిరాక్సులని పోలీసులు భావిస్తున్నారు.

ఇక భువనగిరి దగ్గర్లో ఉన్న టీచర్స్ కాలనీలో నయీమ్, బినామీల పేరిట 350 ప్లాట్లు రిజిస్టర్ అయినట్లు సోదాల్లో దొరికిన డాక్యుమెంట్ల ద్వారా తెలుస్తోంది. భువనగిరి చుట్టుపక్కల దాదాపు అన్ని మండలాల్లో ప్లాట్లున్నాయి. భువనగిరి శివార్లలో నయీమ్ పేరిట 26 ఎకరాలు రిజిస్టర్ అయినట్లు తెలుస్తోంది. బొమ్మలరామారం మండలంలో ఒక్కచోటే 500 ఎకరాల భూమి ఈ డాన్ పేరిట ఉన్నట్లు సమాచారం. మిర్యాలగూడలోని నయీమ్ అత్తగారింట్లో జరిపిన సోదాల్లో 360కిపైగా డాక్యుమెంట్లు, 100 సెల్‌ఫోన్లు, తపంచా స్వాధీనం చేసుకున్నారని అంటున్నారు. అందులో 150 డాక్యుమెంట్లలో ఉన్న ఆస్తుల విలువే రూ.1,500 కోట్లకు పైగా ఉందని అధికారులు లెక్క కట్టినట్టు సమాచారం.

రెడీగా బినామీలు
నయీమ్ కూడగట్టిన ఆస్తుల్లో ఎక్కువ భాగం బినామీ పేర్లతోనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు బినామీలను వెతుక్కోవడం కష్టం కావడంతో ముందే ప్రణాళిక ప్రకారం సిద్ధం చేసుకుని కథ నడిపాడని పోలీసులు చెప్తున్నారు. అల్కాపురిలోని నయీమ్ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న వాటిలో ఆయుధాలు, పత్రాలతో పాటు భారీగా గుర్తింపు కార్డులు, పాస్‌పోర్ట్ ఫొటోలు కూడా ఉన్నాయి. మొత్తం 158 మందికి చెందిన పాస్‌పోర్ట్ ఫొటోలు, వివిధ రకాలైన గుర్తింపు కార్డులు దొరికాయి. వీటి ద్వారానే నయీమ్ బినామీ పేర్లతో ఆస్తుల్ని రిజిస్టర్ చేయించుకుంటున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరంతా ఎవరు? ఇవన్నీ నయీమ్‌కు ఎక్కడ్నుంచి వచ్చాయి? వారికి నయీమ్‌తో ఏమైనా సంబంధాలు ఉన్నాయా? తదితర అంశాలపై దృష్టి పెట్టి దర్యాప్తు చేస్తున్నారు. వీరంతా నల్లగొండ జిల్లాకు చెందిన వారు కావొచ్చని భావిస్తున్నారు. గతేడాది నవంబర్ 16న ‘భువనగరి టీచర్స్ కాలనీలో మొదటి పాన్ ప్లాటింగ్ వాళ్ల నుంచి మనం రిటర్న్ కొన్న ప్లాట్స్’ అంటూ చేతి రాతతో ఉన్న నోట్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది దేనికి సంబంధించినది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

జాగా నచ్చితే అంతే..
హైదరాబాద్‌తోపాటు పాటు చుట్టపక్కల ఉన్న జిల్లాల్లోనూ నయీమ్ భారీ స్థాయిలో సెటిల్‌మెంట్లు చేశాడు. నయీమ్ ఇంటి నుంచి వివిధ ప్రాంతాల్లోని స్థలాలు, పొలాలకు చెందిన 35 జిరాక్సు ప్రతుల్నీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సెటిల్‌మెంట్ కోసం ఎవరైనా వచ్చినప్పుడు వారి నుంచి జిరాక్సు ప్రతుల్ని తీసుకునేవాడని పోలీసులు చెప్తున్నారు. ఎదుటి వారిని బెదిరించి సెటిల్ చేయడంతో భారీగా కమీషన్లు తీసుకోవడం నయీమ్ దందాల్లో ప్రధానమైంది. ఇలా సెటిల్‌మెంట్ కోసం తన వద్దకు వచ్చిన స్థలాల్లో ఏదైనా నచ్చితే దాన్ని అతడే సొంతం చేసుకునే వాడు. నయీమ్ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న జిరాక్సు ప్రతుల్లో హైదరాబాద్, సైబరాబాద్, నల్లగొండ, మెదక్, కరీంనగర్‌లతో పాటు ఏపీలోని గుంటూరు జిల్లా పెదకాకానికి చెందినవి కూడా ఉన్నాయి.

మొత్తం 35 జిరాక్సు ప్రతుల్లో సరూర్‌నగర్, ఘట్‌కేసర్ మండలంలోని ఔషాపూర్, రామాంతపూర్, భువనగిరి, గౌలిపుర, ఎన్టీఆర్ నగర్, గుంటూరు జిల్లా చినకాకానిలోని శ్రీగాయత్రి, అత్తాపూర్, కొండాపూర్‌లోని 9 ఎకరాలు 37 గుంటలు, మెదక్‌లోని అమీర్‌పుర, మన్సూరాబాద్, జూబ్లీహిల్స్‌లోని 1365 చదరపు గజాలు, తార్నాక, సైదాబాద్, రంగారెడ్డి జిల్లా కీసరలోని నాగారం, బైరామల్‌గూడ, కరీంనగర్‌లోని నగ్మూర్‌లో ఉన్న ప్లాట్, ఫ్లాట్‌లకు సంబంధించినవి ఉన్నాయి. వీటి విలువ రూ.120 కోట్ల వరకు ఉండచ్చని భావిస్తున్నారు. ఎన్‌కౌంటర్ తర్వాత షాద్‌నగర్‌లో నయీమ్ ఇంట్లో సోదా చేసిన పోలీసులకు కూడా దాదాపు 140కి పైగా భూములు, ఆపార్ట్‌మెంట్లకు సంబంధించిన పత్రాలు దొరికినట్టు సమాచారం.

విస్తుపోతున్న ఐటీ అధికారులు!
నయీమ్ హైదరాబాద్ తర్వాత భువనగిరిలో పెద్దమొత్తంలో ఆస్తులు కూడబెట్టాడు. ఈ ప్రాంతంలోని అనుపానులన్నీ అతనికి తెలిసి ఉండడంతో పాటు పెద్దఎత్తున అనుచరగణం ఉండడంతో ఇక్కడ భారీ స్థాయిలో భూములు కొనుగోలు, కబ్జాలు చేశాడని అంటున్నారు. మిర్యాలగూడలోని నయీమ్ అత్తగారింట్లో జరిపిన సోదాల్లో భూ లావాదేవీలకు సంబంధించిన ఈ విలువైన పత్రాలు దొరికాయి. భువనగిరిలో నయీమ్ బంధువులు, అనుచరుల ఇళ్లలో కూడా సోదాలు కొనసాగాయి. ఈ సోదాలన్నింటిలో బయటపడుతున్న డాక్యుమెంట్లు చూసి ఆదాయపు పన్ను శాఖ అధికారులే విస్తుపోతున్నారని సమాచారం.

గుర్తించకుండా విగ్గులు, మేకప్ కిట్లు..
భద్రత విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటాడో నయీమ్ ఇళ్లు, సంబంధీకుల ఇళ్లలో దొరికిన మేకప్ కిట్ల ద్వారా తెలుస్తోంది. దాదాపు 30 విగ్గులు, 15 మేకప్ కిట్లు లభించాయి. ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు పెట్టుకున్న విగ్గు పెట్టుకునేవాడు కాదు. అలాగే దాదాపు 250కి పైగా సెల్‌ఫోన్‌లు కూడా వినియోగించాడని పోలీసుల సోదాల్లో వెలుగుచూసింది. దుస్తులు, బూట్ల కొనుగోలులోనూ నయీమ్ ప్రత్యేకత కనబరుస్తాడని తెలుస్తోంది. ఒకేసారి 20-30 జతల షూలు, 30-50 జతల దుస్తులు కొంటాడని సమాచారం.

 నయీమ్ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న 35 జిరాక్సు పత్రాల్లోని కొన్ని భూ లావాదేవీల వివరాలివీ..
హైదరాబాద్‌లోని రామాంతపూర్‌లో 35 ఎకరాల 20 గుంటల భూమి. ఇక్కడ గజానికి 20వేలపై మాటే. విలువ దాదాపు రూ.348.48 కోట్లు!
కొండాపూర్‌లో 9 ఎకరాల 35 గుంటలు. ఇక్కడ గజానికి రూ.50వేలపైనే ఉంది. విలువ దాదాపు 242 కోట్లు.
సరూర్‌నగర్‌లో ఐదు ఎకరాల భూమి. విలువ  73 కోట్లు.
అత్తాపూర్, షేక్‌పేట, బైరామ్‌గూడ, ఘట్‌కేసర్ ఔషన్‌పూర్, జూబ్లీహిల్స్, సైదాబాద్, బైరామల్ గూడలలో కూడా అనేక భూములున్నాయి. అక్కడ గజానికి 15 వేల నుంచి 25 వేల మధ్య ధర పలుకుతోంది.

మరిన్ని వార్తలు