అంగన్‌వాడీలకు ‘ఆన్‌లైన్‌’లో సరుకులు

30 Dec, 2017 04:11 IST|Sakshi

     కొత్తగా సప్లై చైన్‌ వ్యవస్థ.. బార్‌కోడ్‌ ఆధారంగా చేరవేత 

     అవకతవకలకు కళ్లెం వేసేందుకు సర్కారు నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: అంగన్‌వాడీ కేంద్రాలకు సరుకుల సరఫరాలో అక్రమాలకు కళ్లెం వేసేందుకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కొత్తగా సప్లై చైన్‌ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అంగన్‌వాడీ కేంద్రాలకు సరుకులు చేరవేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ట్యాబ్‌లు, బార్‌కోడింగ్‌ విధానాన్ని తీసుకొస్తోంది. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలో ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో ఇదే నమూనాను జనవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. 

బార్‌కోడ్‌ ద్వారానే పంపిణీ.. 
రాష్ట్రంలోని 149 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో 35,700 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వీటి ద్వారా 22.28 లక్షల మంది బాలింతలు, గర్భిణులు, శిశువులకు పోషకాహారాన్ని అందిస్తున్నారు. పోషకాహార పంపిణీకి ప్రభుత్వం కోట్లు వెచ్చిస్తుండగా... కొన్నిచోట్ల ఈ సరుకులు పక్కదారి పడుతుండడంతో లక్ష్యం గాడితప్పుతోంది. దీంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో క్షేత్రస్థాయిలో అక్రమాలను అరికట్టేందుకు సర్కారు ఉపక్రమించింది. రాష్ట్రంలోని ప్రతి ప్రాజెక్టు పరిధిలో ఒకటి చొప్పున 149 గోదాములున్నాయి. వీటి ద్వారా పప్పులు, వంటనూనె, మురుకులు, బాలామృతం ప్యాకెట్లను అంగన్‌వాడీ కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇప్పటివరకు ఐసీడీఎస్‌ ప్రాజెక్టు అధికారుల నుంచి జారీ అయ్యే ప్రొసీడింగ్‌ల ద్వారా కేంద్రాలకు సరుకులను సరఫరా చేస్తుండగా... ఇకనుంచి బార్‌కోడ్‌ పద్ధతిని అమలు చేయనున్నారు. అంగన్‌వాడీ కేంద్రం స్థాయిలో అవసరమైన కోటా వివరాలను ఐసీడీఎస్‌ ప్రాజెక్టుకు ముందుగా చేరవేయాల్సి ఉంటుంది.

అనంతరం ఐసీడీఎస్‌ ప్రాజెక్టు అధికారులు ఆయా కేంద్రాలకు అవసరమైన కోటా విడుదల చేస్తూ.. సరుకుల వారీగా బార్‌కోడ్‌ను ఆన్‌లైన్‌లో కేంద్రం నిర్వాహకులకు జారీ చేస్తారు. అలాగే సరుకులు పంపిణీ చేసే కాంట్రాక్టరు సదరు కోటాను అంగన్‌వాడీ కేంద్రానికి తీసుకెళ్లినప్పుడు అంగన్‌వాడీ టీచర్‌ వేలిముద్రలు నమోదు చేస్తేనే కోటా పంపిణీకి సంబంధించిన ఫైలు తెరుచుకుంటుంది. అనంతరం బార్‌కోడ్‌ ద్వారా సరుకులను పొందాల్సి ఉంటుంది. వేలిముద్రల నమోదుకు కాంట్రాక్టరు వద్ద ట్యాబ్‌ ఉంటుంది. అదేవిధంగా బార్‌కోడ్‌ వివరాలు, సరుకుల పంపిణీ సమాచారం ట్యాబ్‌లో నిక్షిప్తం కావడంతో పంపిణీ చేసిన వెంటనే ఆ సమాచారం రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలోని సెంట్రల్‌ సర్వర్‌కు చేరుతుంది. దీంతో కాంట్రాక్టరు రూటుమ్యాపు సైతం తెలుస్తుందని, సరుకులు దారితప్పే అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలో బార్‌కోడ్‌ విధానాన్ని మూడు నెలల క్రితం ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ఈ కార్యక్రమం అక్కడ సత్ఫలితాలిచ్చింది. దీంతో ఈ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించారు.

మరిన్ని వార్తలు