కంప్యూటరీకరణపై కాలయాపన

6 Sep, 2017 02:34 IST|Sakshi
కంప్యూటరీకరణపై కాలయాపన
- రెండేళ్ల క్రితం రూ.2.5 కోట్లు ఇచ్చిన ప్రభుత్వం
ఇప్పటివరకు పనులు ప్రారంభించని అధికారులు
పర్యాటకాభివృద్ధి సంస్థలో గందరగోళం
 
సాక్షి, హైదరాబాద్‌: భారీ ధరలకు కొన్న పడవలను మరమ్మతుల పేరుతో వృథాగా పడేయటం.. రూ.కోట్లు వెచ్చించి నాసికరం పనులతో సౌండ్‌ అండ్‌ లైట్‌ షోలు పడకేసేలా చేయటం.. అడ్డగోలు బిల్లులతో హరిత హోటళ్లలో నిధులు దారి మళ్లించటం.. ఇలా పర్యాటక అభివృద్ధి సంస్థలో అధికారులది ఆడింది ఆట పాడింది పాట. ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవటంతో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పర్యాటక ప్రాంతాలను ప్రధాన కార్యాలయంతో అనుసంధానించి నేరుగా పర్యవేక్షించే వెసులుబాటు కల్పించటం ద్వారా కొంతవరకు పరిస్థితిని అదులోపులోకి తెచ్చే వీలుంది. ఈ నేపథ్యంలో ప్రధాన కౌంటర్లను కంప్యూటరీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులనూ మురగబెట్టిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
 
టెండర్ల పేరుతో కాలయాపన 
పర్యాటకుల టూర్‌ బుకింగ్స్, వివిధ ప్రాం తాల్లో సౌండ్‌ అండ్‌ లైట్‌ షో టికెట్ల విక్రయం, హోటళ్ల లెక్కలకు సంబంధించిన కీలక విషయాల్లో కంప్యూటరీకరణ సరిగా లేదు. దీంతో కంప్యూటరీకరించేందుకు ప్రభుత్వం 2015లో రూ.రెండున్నర కోట్లను మంజూరు చేసింది. అయితే ఈ నిధులతో సంబంధిత పనులు చేపట్టాల్సిన పర్యాటకాభివృద్ధి కార్పొరేషన్‌.. టెండర్ల పేరుతో కాలయాపన చేసింది. ఓసారి టెండర్లు పిలవగా, కేవలం ఒకే బిడ్‌ దాఖలైందన్న కారణంతో దాన్ని రద్దు చేశారు. ఆ తర్వాత అదే తరహాలో మరోసారి రద్దు చేశారు. మరోసారి టెండర్లు పిలిచి.. పనులు మొదలుపెట్టినా కొలిక్కి తేలేక పోయారు. ఇలా రెండేళ్లపాటు ఆ నిధులను కంప్యూటరీకరణ కోసం ఖర్చు చేయలేదు. ఈ నేపథ్యంలో నిధులను అసలు లక్ష్యం కోసం ఖర్చు చేయలేదని గుర్తించిన ఆడిట్‌ విభాగం.. కార్పొరేషన్‌ వివరణ కోరింది.
 
ఖాళీ బిల్లులతో నిధుల దారి మళ్లింపు
రాష్ట్రవ్యాప్తంగా హరిత హోటళ్లను ఏర్పాటు చేస్తున్నా చాలా చోట్ల పర్యవేక్షణ సరిగా లేక నిధులు దారిమళ్లుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఖాళీ బిల్లులను దగ్గర పెట్టుకుని వాటితో నిధులు దారి మళ్లిస్తున్నట్టు ఫిర్యాదులున్నాయి. ఇటీవల స్వయంగా పోలీసులు విచారణ జరిపి హైదరాబాద్‌లోని ప్లాజా హోటల్‌లో అక్రమాల నిగ్గు తేల్చారు. హుసేన్‌సాగర్‌ సహా రాష్ట్రంలోని ప్రధాన జలాశయాల వద్ద బోటింగ్‌ విషయంలోనూ ఇలాంటి నిర్లక్ష్యమే కనిపిస్తోంది. 
 
అధికారుల నిర్లక్ష్యం
ప్లాజా హోటల్, రెస్టారెంట్ల ద్వారా వచ్చిన మొత్తాన్ని బ్యాంకు కరెంటు ఖాతాలోనే ఉంచటం వల్ల పెద్ద మొత్తంలో అదనపు ఆదాయాన్ని పర్యాటక అభివృద్ధి సంస్థ కోల్పోయింది. వేరే పద్ధతిలో ఇన్‌వెస్ట్‌ చేసి ఉంటే రూ.లక్షల్లో అదనంగా ఆదాయం సమకూరేదన్న విషయం ఇటీవల ఆడిట్‌ పరిశీలనతో తేలింది. కార్పొరేషన్‌కు చెందిన ఓ రెస్టారెంట్‌ నిర్వహణకు టెండర్లు పిలిచినా సకాలంలో దాన్ని అప్పగించక భారీ మొత్తంలో ఆదాయం కోల్పోయింది. ఇంత జరుగుతున్నా కార్పొరేషన్‌ ఉన్నతాధికారులు వాటిపై దృష్టి సారించలేదు.
మరిన్ని వార్తలు