‘కొండంత’ అబద్ధం

16 Oct, 2023 05:09 IST|Sakshi

రుషికొండ టూరిజం పునర్నిర్మాణ ప్రాజెక్టుపై ‘ఈనాడు’ విష ప్రచారం 

9.88 ఎకరాల్లో మాత్రమే ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిపాదనలు 

ఆ మేరకే సీఆర్‌జెడ్‌ నుంచి అనుమతులు 

వాస్తవానికి భవనాలు కట్టింది 1.84 ఎకరాల్లో మాత్రమే 

మిగిలిన 8.04 ఎకరాల్లో రోడ్లు, గ్రీనరి, ల్యాండ్‌ స్కేప్‌ 

7 బ్లాకుల నిర్మాణానికి ప్రతిపాదిస్తే.. కట్టింది 4 బ్లాకులే 

రుషికొండ మొత్తం విస్తీర్ణంలో 3% వినియోగం 

పర్యావరణ సమతుల్యత కోసం భారీగా పచ్చదనం పెంపు 

బోరువెల్స్‌ లేకుండానే భూగర్భ జలాలు ఎలా తోడేస్తారు?

సాక్షి, అమరావతి: ఉత్తరాంధ్ర ఊసే రామోజీకి నచ్చట్లేదు. అక్కడ అభివృద్ధి అసలే గిట్టట్లేదు. అందుకే విశాఖపట్నంలోని రుషికొండ టూరిజం పునర్నిర్మాణ ప్రాజెక్టుపై ‘ఈనాడు’ విష ప్రచారం మొదలెట్టింది. బోడి గుండుకి.. మోకాలికి ముడేస్తూ వాస్తవాల వక్రీకరణకు తెరలేపింది. త్వరలో రుషికొండను మిగలకుండా చేసేస్తారంటూ ప్రజలను మభ్యపెట్టేలా ఊహాజనిత కథనాన్ని అచ్చేసింది. విశాఖ జిల్లా పరవాడ మండలం ఎండాడ గ్రామం సర్వే నంబర్‌ 19/3, 19/4లో రుషికొండలో రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ)కి 61 ఎకరాల భూమి ఉంది.

అందులో కేవలం 9.88 ఎకరాల్లో మాత్రమే రిసార్టుల పునర్నిర్మాణ ప్రాజెక్టును ఏపీటీడీసీ ప్రతిపాదించింది. కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌ (సీఆర్‌జెడ్‌), అటవీ, జీవీఎంసీ, కాలుష్య నియంత్రణ మండలి నుంచి పూర్తి స్థాయి క్లియరెన్స్‌లు వచ్చిన తర్వాతే పనులు చేస్తోంది. కానీ, ఈనాడు మాత్రం 61 ఎకరాల్లోనూ కట్టడాలకు అనుమతులిచ్చారని, కొండ పూర్తిగా కనుమరుగవుతుందంటూ భయాందోళన కలిగించేలా కథనం ప్రచురించడంపై పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ కె.కన్నబాబు ఆదివారం ఓ ప్రకటనలో మండిపడ్డారు. ప్రభుత్వం ఏపీటీడీసీ ద్వారా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైఎండ్‌ లగ్జరీ రిట్రీట్‌ రుషికొండ ప్రాజెక్టును లీజుకిచ్చే ప్రతిపాదన ఇప్పటివరకు లేదన్నారు.

టీడీపీ నేత బండారు సత్యనారాయణ నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే ప్రాజెక్టుపై న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు దాఖలయ్యాయని, ప్రతి అంశంపై కోర్టుకు సమగ్ర నివేదిక ఇచ్చిన తర్వాతే పనులు చేశామని చెప్పారు. భవనాల నిర్మాణం, రహదారులు సహా అన్ని పనులకు సంబంధిత శాఖల ఆమోదం తీసుకున్నామని, ఎక్కడా ఉల్లంఘనలకు చోటివ్వలేదని స్పష్టంచేశారు. ప్రభుత్వంతో సమగ్రంగా చర్చించి, పరిపాలనపరమైన అనుమతులు పొందామని, ఇదంతా పర్యాటక శాఖకు తెలియకుండా జరగదని చెప్పారు. అదేవిధంగా అప్పటి పర్యాటక మంత్రికి తెలియకుండా ఈ ప్రాజెక్టు జరగదని, ఈనాడు రాసినవి అవాస్తవాలని  చెప్పారు. అసలు వాస్తవాలను ఆయన వెల్లడించారు. 

ఆరోపణ: 61 ఎకరాల్లో కట్టడాలకు అనుమతులు 
వాస్తవం: రుషికొండలో ఏపీటీడీసీకి ఉన్నది 61 ఎకరాలు. అందులో 9.88 ఎకరాల్లో మాత్రమే పర్యాటక రిసార్టుల పునర్నిర్మాణ ప్రాజెక్టుకు సీఆర్‌జెడ్‌ నుంచి అనుమతులు తీసుకుని పనులు చేపట్టింది. ఇందులో 19,968 చదరపు మీటర్లలో 7 బ్లాక్‌లు నిర్మించాలన్నది ప్రతిపాదన. 5.18 ఎకరాల్లో మాత్రమే భవనాలు ఉంటాయి. మిగిలిన 4.70 ఎకరాలు రోడ్లు, గ్రీనరి, గార్డెనింగ్, ల్యాండ్‌ స్కేప్, డ్రెయిన్ల కోసం వినియోగిస్తారు.  

ఆరోపణ: రుషికొండలో 90 శాతం విస్తీర్ణంలో పనులు 
వాస్తవం: ఏపీటీడీసీ ప్రాజెక్టులో కేవలం 1.84 ఎకరాల్లో మాత్రమే 4 బ్లాకులను (విజయనగరం, గజపతి, కళింగ, వేంగి) నిర్మించింది. మిలిగిన 8.04 ఎకరాల్లో ఎటువంటి భవన నిర్మాణాలు చేపట్టలేదు. వాటిని ల్యాండ్‌ స్కేపింగ్‌ పనుల కోసం వినియోగిస్తారు. అంటే ప్రతిపాదిత 19,968 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కేవలం 13,542 చదరపు మీటర్లకు మాత్రమే నిర్మాణాలకు పరిమితమైంది. రుషికొండలో అందుబాటులో ఉన్న మొత్తం విస్తీర్ణంలో 3 శాతం భూమిలో మాత్రమే భవనాల నిర్మాణం జరిగింది. ఇంకా 97 శాతం ప్రాంతం ఖాళీగానే ఉంది. 

ఆరోపణ: రుషికొండపై పర్యావరణానికి విఘాతం 
వాస్తవం: రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి సీఆర్‌జెడ్‌ క్లియరెన్స్, ఏపీ కోస్టల్‌ జోన్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ, జీవీఎంసీ నుంచి ప్లాన్‌ అప్రూవల్, ఫైర్‌ క్లియరెన్స్‌ తీసుకుంది. పర్యావరణ సమతుల్యత కోసం ఏపీటీడీసీ 16,350 స్థానిక జాతుల మొక్కలు, 24,120 హెడ్జ్‌ ప్లాంట్స్, 4,047 తీగజాతి మొక్కలతో గ్రీనరీని అభివృద్ధి చేసింది. రుషికొండను ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో భారీ ఎత్తున మొక్కలు నాటుతూ వృక్ష సంపదను పెంచుతోంది. సీఆర్‌జెడ్‌ అనుమతి పొందిన ప్రాంతంలో ఎక్కడా బోర్‌వేల్స్‌ వేయలేదు. ఇక భూగర్భ జలాలను వెలికితీశారనడానికి అవకాశమే లేదు.   

మరిన్ని వార్తలు