కాలుష్య విషం

25 Feb, 2015 00:57 IST|Sakshi
కాలుష్య విషం

గ్రేటర్‌లో పెరుగుతున్నపగటి ఉష్ణోగ్రతలు
ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వాయు కాలుష్యం
పొంచి ఉన్న వ్యాధుల ముప్పు
ఇప్పటికే ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
 

సిటీబ్యూరో: మహా నగరం కాలుష్యానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోతోంది. ఇది చాపకింద నీరులా మన ఆరోగ్యాన్ని హరిస్తోంది. గ్రేటర్‌లో పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలకు తోడు వాయు కాలుష్యం సిటీజనులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కల్తీ ఇంధన వినియోగం, కాలం చెల్లిన వాహనాలు, ఆర్టీసీ బస్సులు, పరిశ్రమల పొగ వెరసి నగరంలో కాలుష్యం తీవ్రస్థాయిలో ఉంటోందని తెలంగాణ  కాలుష్య నియంత్రణ మండలి తాజా నివేదిక వెల్లడించింది. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ సంవత్సరం జనవరి చివరి వరకు కాలుష్య ఉద్గారాల సగటు పెరిగిందని తెలిపింది. అత్యంత రద్దీగా ఉండే పంజగుట్ట, అబిడ్స్, చార్మినార్, ప్యాట్నీ సెంటర్, లక్డీకాపూల్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ సహా పారిశ్రామికవాడ పాశమైలారం, జూపార్క్, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం పరిధిలో వాయు కాలుష్యం తీవ్రమవుతోందని నివేదిక బయటపెట్టింది. ముఖ్యంగా కార్బన్ మోనాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, సల్ఫర్‌డయాక్సైడ్, అమ్మోనియా, స్థూలధూళికణాలు, బెంజీన్, టోలిన్ వంటి కాలుష్య కారకాలు మానవ ఆరోగ్యానికి పొగబెడుతున్నాయని పీసీబీ స్పష్టం చేసింది.
 
ఎండ..పొగతో ఇబ్బందులు

సాధారణంగా మార్చి రెండో వారంలో నగరంలో ఎండ తీవ్రత ఉంటుంది. ఈసారి ఫిబ్రవరి మూడో వారంలోనే ఎండ మాడ్చేస్తోంది. మంగళవారం      నగరంలో గరిష్టంగా 33.9 డిగ్రీలు, కనిష్టంగా 18 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గాలిలో తేమ 26 శాతంగా నమోదైంది. ఈసారి మండువేసవిలో పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉందని బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు పీల్చే గాలిలో ధూళి రేణువుల (రెస్పైరబుల్ సస్పెండెడ్ పార్టిక్యులేట్ మ్యాటర్-ఆర్‌ఎస్‌పీఎం) సాంద్రత పెరగడం ఆందోళన కలిగిస్తోంది. వాహనాల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో  కాలుష్యం రోజురోజుకూ తీవ్రమవుతోంది. చర్మ, కంటి, శ్వాసకోశ వ్యాధులతో బాధ పడుతున్న వారి సంఖ్య ఇటీవల అనూహ్యంగా పెరుగుతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఇంధన వినియోగం పెరిగి, గాలిలో కాలుష్య ఉద్గారాల మోతాదు అధికమవుతోందని నివేదిక తేల్చడం ఆందోళన కలిగిస్తోంది.
 
ఇంధనంతో ముప్పు

గ్రేటర్ పరిధిలో వాహనాల సంఖ్య 41 లక్షలకు చేరింది. వీటికి ఏటా సుమారు 109.5 కోట్ల లీటర్ల పెట్రోలు, 120.45 కోట్ల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తున్నట్లు అంచనా. రాష్ట్ర వ్యాప్తంగా ఇంధన వినియోగంలో మహానగరం పరిధిలోనే 50 శాతం ఉంది. వాహనాల సంఖ్య నగరంలో ఏటా రెండు లక్షల చొప్పున పెరుగుతోంది. కానీ 6,411 కిలోమీటర్ల రహదారులే అందుబాటులో ఉన్నాయి. దీంతో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగి... సగటు వాహన వేగం గంటకు 12 కి.మీ.కు పడిపోతోంది. దీంతో వాహనాల పొగ నుంచి వెలువడే కాలుష్య ఉద్గారాలు వాతావరణంలో చేరి పర్యావరణంపై దుష్ర్పభావం చూపుతున్నాయి.  

కాలుష్య ఉద్గారాలతో అనర్ధాలివీ: వాయు కాలుష్యంలో టోలిన్, బెంజిన్ అధికంగా నమోదవుతున్న ప్రాంతాల్లో ఉన్నవారు క్యాన్సర్, రక్తహీనత, టీబీ వ్యాధుల బారిన పడతారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.  సల్ఫర్ డయాక్సైడ్ శ్వాసకోశాలకు చికాకు కలిగించి బ్రాంకైటిస్‌కు కారణ మవుతుంది.   నైట్రోజన్ డయాక్సైడ్ వల్ల కళు,్ల ముక్కు మండుతాయి. శ్వాసకోశాలకు తీవ్ర చికాకు కలుగుతుంది. అమ్మోనియా మోతాదు పెరగడం వల్ల కళ్లు తీవ్రంగా మండడంతో పాటు శ్వాసకోశ భాగాలన్నీ దెబ్బతింటున్నాయి.
     
పీఎం10, పీఎం 2.5, ఆర్‌ఎస్‌పీఎం సూక్ష్మ, స్థూల ధూళి రేణువులు నేరుగా ఊపిరితిత్తుల్లో చేరి తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులు,పొడిదగ్గు, బ్రాంకైటిస్‌కు కారణమవుతున్నాయి.దుమ్ము, ధూళి కళ్లలోకి చేరి రెటీనా దెబ్బతింటుంది. చికాకు, అసహనం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతుంది.  తలనొప్పి, పార్శ్వపు నొప్పి కలుగుతుంది. ఆర్‌ఎస్‌పీఎం మోతాదు అధికమైతే ఊపిరితిత్తుల క్యాన్సర్లు పెరిగే ప్రమాదం పొంచి ఉంది.ఇటీవల నగరంలో శ్వాసకోశ సమస్యలు, అస్తమా, క్రానిక్ బ్రాంకైటిస్, సైనస్ సమస్యలు పెరగడానికి ప్రధాన కారణం వాయుకాలుష్యమే. గంట పాటు ట్రాఫిక్ రద్దీలో ప్రయాణం చేసిన వారు చురుకుదనం కోల్పోయి ఒళ్లంతా మగత, నొప్పులతో బాధ పడుతున్నారు.ముఖానికి, ముక్కుకు మాస్క్‌లు, కళ్ల రక్షణకు అద్దాలు ఉపయోగించడం ద్వారా ఆర్‌ఎస్‌పీఎం దుష్ర్పభావాలను కొంతమేర నివారించే అవకాశాలుంటాయని వైద్యులు చెబుతున్నారు.
 
 

మరిన్ని వార్తలు