ఈవీఎంల మొరాయింపు

1 Dec, 2023 07:20 IST|Sakshi
హఫీజ్‌పేటలో ఈవీఎంకు మరమ్మతులు

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ నగరంలో పోలింగ్‌ శాతం పెంచేందుకు అన్ని ఏర్పాట్లు కల్పించామని అధికారులు ఎన్ని ప్రకటనలు గుప్పించినప్పటికీ, ఓటర్లకు ఇబ్బందులు తప్పలేదు. కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లో.. ముఖ్యంగా పాతబస్తీ పరిధిలోని చాంద్రాయణగుట్ట, మలక్‌పేట తదితర నియోజకవర్గాల్లో ఎండవేడిమి తగల కుండా కనీసం టెంట్లు కూడా వేయలేదు. తాగునీటి వసతి లేనేలేదు. దీంతో క్యూలో నిలబడేందుకు ఓటర్లు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. చార్మినార్‌, అంబర్‌పేట, జూబ్లీహిల్స్‌, నాంపల్లి తదితర నియోజకవర్గాల్లో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్‌కు అంతరాయం కలిగింది. జియాగూడ దుర్గానగర్‌లోని విద్యాశ్రీ స్కూల్‌లో ఈవీఎంలు మొరాయించడంతో గంటన్నర ఆలస్యంగా పోలింగ్‌ ప్రారంభమైంది. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం మధురానగర్‌, జవహర్‌నగర్‌, యూసుఫ్‌గూడల్లోని పోలింగ్‌ బూత్‌లలో దాదాపు 45 నిమిషాలు ఈవీఎంలు పనిచేయలేదు. అంబర్‌పేటలో ఉదయం అరగంట ఆలస్యంగా పోలింగ్‌ ప్రారంభించిన అధికారులు సాయంత్రం ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో పోలింగ్‌ కంపార్ట్‌మెంట్‌లోకి ఇద్దరేసి వెళ్తుండటాన్ని కమాండ్‌ కంట్రోల్‌సెంట్రల్‌ ద్వారా పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్‌రాస్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కమాండ్‌ కంట్రోల్‌సెంటర్‌కు వచ్చిన సీఈఓ వికాస్‌రాజ్‌ ఈ విషయాన్ని గుర్తించారు.

మరిన్ని వార్తలు