కాంగ్రెస్‌.. ఎంఐఎం మధ్య ఘర్షణలు

1 Dec, 2023 07:20 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ జిల్లాలో పాతబస్తీ పరిధిలోని కొన్ని నియోజకవర్గాల్లో ఎంఐఎం, కాంగ్రెస్‌ల మధ్య ఘర్షణలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. చార్మినార్‌, బహదూర్‌పురా, యాకుత్‌పురా, మలక్‌పేట, నాంపల్లి నియోజకవర్గాల్లో ఈ పరిస్థితులు తలెత్తాయి. బహదూర్‌పురాలో సాయంత్రం 5 గంటలకు పోలింగ్‌ బూత్‌ను పరిశీలించి వెళ్తున కాంగ్రెస్‌ అభ్యర్థి షేక్‌ అక్బర్‌పై ఎంఐఎం కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. కిషన్‌బాగ్‌ ఎంఐఎం కార్పొరేటర్‌ హుస్సేనీపాషా కాంగ్రెస్‌ కార్యకర్తలపై దాడికి దిగారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు యాకుత్‌పురా ఎంబీటీ అభ్యర్థి అమ్జదుల్లాఖాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాంపల్లిలోని రెండు పోలింగ్‌ కేంద్రాల్లో రిగ్గింగ్‌ జరిగిందనే ప్రచారంతో కాంగ్రెస్‌ అభ్యర్థి ఫిరోజ్‌ఖాన్‌ అక్కడకు చేరుకున్నారు. ఎంఐఎం ఏజెంట్లు ఆయనను వెంబడించడంతో కాసేపు పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఎంఐఎం అభ్యర్థి మాజిద్‌ హుస్సేన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్‌ రోడ్‌నెంబర్‌ 14లోని డీఏవీ స్కూల్‌లో ఓటు వేశాక ఎమ్మెల్సీ కవిత నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ కేసు నమోదైంది. హిమాయత్‌నగర్‌లో పురుష ఓటరు స్థానే జాబితాలో మహిళ ఫొటో ఉండటంతో ఓటేయకుండా వెళ్లిపోయారు.

మరిన్ని వార్తలు