జూన్‌ 15లోగా పూర్తి చేయండి

21 Apr, 2018 01:26 IST|Sakshi

పులిచింతల పునరావాస చర్యలపై మంత్రి హరీశ్‌రావు ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: పులిచింతల ప్రాజెక్టు నిర్వాసితుల సహాయ, పునరావాస చర్యలన్నీ జూన్‌ 15 కల్లా పూర్తిచేయాలని నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. పునరావాస చర్యలపై శుక్రవారం జలసౌధలో ఆయన సమీక్షించారు. పులిచింతల ప్రాజెక్టుకు సంబంధించి 80 శాతం పునరావాస పనులు పూర్తయ్యాయని, ఏపీ విడుదల చేసిన నిధుల్లో రూ.47 కోట్లు మిగిలాయని, వాటితో పనులు చేపట్టాలని పేర్కొన్నారు. పునరావాస పనుల పురోగతిలో జాప్యం జరుగుతోందని అసంతృప్తి వ్యక్తం చేశారు.

ట్రిపుల్‌ ఆర్‌ (రిపేర్స్, రెనోవేషన్, రీస్టోరేషన్‌) పథకం కింద కేంద్రం 575 చెరువులకు వివిధ దశల్లో రూ.459 కోట్లు మంజూరు చేసిందని పేర్కొన్నారు. తొలిదశలో 1,200 చెరువులను ఈ పథకం కిందికి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించగా, 182 చెరువులకు రూ.125.45 కోట్లు కేంద్రం విడుదల చేసిందని పేర్కొన్నారు. రెండో దశలో 147 చెరువులకు గత జనవరిలో 163 కోట్లను కేంద్రం మంజూరు చేసిందని, ఇందులో 72 చెరువుల మరమ్మతు, పునరుద్ధరణ పనులను మిషన్‌ కాకతీయ రెండో, మూడో విడతల్లో చేపట్టామన్నారు.

>
మరిన్ని వార్తలు