దశాబ్దాల సంప్రదాయానికి హైకోర్టు ముగింపు

13 Oct, 2016 00:36 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్న కాజ్‌లిస్ట్ (విచారణ కేసుల జాబితా) ముద్రణ సంప్రదాయానికి హైకోర్టు ముగింపు పలికింది. సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో కాజ్‌లిస్ట్ ముద్రణను ఈ నెల 13 నుంచి నిలిపివేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. తద్వారా హైకోర్టుకు ఏటా కోట్ల రూపాయల మేర డబ్బు ఆదా కానున్నది. కాజ్‌లిస్ట్ కావాలనుకునే న్యాయవాదులు సంబంధిత ముద్రణ సంస్థను ఆశ్రయించి డబ్బు చెల్లించి కొనుగోలు చేయవచ్చు.
 
 ఆంధ్రప్రదేశ్ ఏర్పడటానికి ముందు నుంచే హైకోర్టులో కాజ్‌లిస్ట్ ప్రచురణ ఉంది. ఏ న్యాయమూర్తి వద్ద ఈ కేసు ఉంది.. ఏ సీరియల్ నంబర్‌లో ఉంది.. తదితర వివరాలన్నీ కూడా ఈ కాజ్‌లిస్ట్‌లో ఉంటాయి. అయితే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తరువాత హైకోర్టు విస్తృతం కావడంతో ఆ మేర కాజ్‌లిస్ట్‌ల ముద్రణ కూడా పెరిగింది. అప్పటి నుంచి అవసరాలను బట్టి కాజ్‌లిస్ట్‌ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం హైకోర్టు 2,170 కాపీల కాజ్‌లిస్ట్‌లను ముద్రించి, వాటిని ఉచితంగా న్యాయవాదులకు అందజేస్తోంది. అయితే వాటిని న్యాయవాదులకు వారి వారి ఇళ్ల వద్ద అందజేసినందుకు నామమాత్రంగా సర్వీస్ చార్జీలు వసూలు చేస్తోంది.
 
  నెలకు కాజ్‌లిస్ట్ ముద్రణ కోసం హైకోర్టు రూ.15 లక్షలు వెచ్చిస్తోంది. ఈ లెక్కన ఏడాదికి రూ.1.80 కోట్లు ముద్రణ సంస్థకు చెల్లిస్తోంది. ప్రతి ఏటా హైకోర్టులపై ఈ కాజ్‌లిస్ట్‌ల ముద్రణ వ్యయం భారం పెరుగుతూ ఉండటంతో దీనిపై ప్రధాన న్యాయమూర్తుల సదస్సులో ప్రత్యేకంగా చర్చ జరిగింది. సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా అందుబాటులోకి రావడం, దాదాపు ప్రతీ ఒక్కరి దగ్గర స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉండటంతో కాజ్‌లిస్ట్‌ల ముద్రణకు స్వస్తి పలకాలని మూడేళ్ల క్రితమే ప్రధాన న్యాయమూర్తుల సదస్సులో నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా మన హైకోర్టులో సైతం కాజ్‌లిస్ట్‌ల ముద్రణ ఉపసంహరణ ప్రతిపాదనను రిజిస్ట్రీ వర్గాలు తీసుకురాగా న్యాయవాదులు వ్యతిరేకించారు. దీంతో కాజ్‌లిస్ట్‌ల ముద్రణ ఉపసంహరణ నిర్ణయం అమలు జరగలేదు.
 
 జస్టిస్ బొసాలే చొరవతో...
 అయితే జస్టిస్ దిలీప్ బి.బొసాలే తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మళ్లీ ఆ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. న్యాయవాద సంఘాలతో చర్చ జరిపిన జస్టిస్ బొసాలే చివరికి వారిని ఒప్పించారు. దీంతో ఈ నెల 13 నుంచి కాజ్‌లిస్ట్‌ల ముద్రణను నిలిపేస్తున్నట్లు హైకోర్టు అధికారిక ప్రకటన జారీ చేసింది. అయితే హైకోర్టు యథాతథంగా కాజ్‌లిస్ట్‌ను తయారు చేసి దానిని తన వెబ్‌సైట్‌లో ఉంచుతుంది. కక్షిదారులతో సహా ఎవరైనా కూడా ఆ కాజ్‌లిస్ట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హైకోర్టు తన స్వీయ అవసరాల కోసం 230 కాజ్‌లిస్ట్ కాపీలను కాపీకి రూ.95 చొప్పున చెల్లించి ముద్రణ సంస్థ నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించింది.
 

మరిన్ని వార్తలు