బీఎస్‌ఎన్‌ఎల్‌ తీరుపై హైకోర్టు ఆక్షేపణ

17 May, 2017 04:00 IST|Sakshi
బీఎస్‌ఎన్‌ఎల్‌ తీరుపై హైకోర్టు ఆక్షేపణ

- మరణించిన ఉద్యోగి ఆర్థిక ప్రయోజనాలు ఇవ్వని అధికారులు
- వడ్డీతో సహా చెల్లించాలని అధికారులకు హైకోర్టు ఆదేశం


సాక్షి, హైదరాబాద్‌: మృతి చెందిన ఓ మహిళా ఉద్యోగికి సంబంధించిన ఆర్థిక ప్రయోజనాలను ఆమె కుటుంబ సభ్యులకు అందచేసే విషయంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారులు వ్యవహరించిన తీరును ఉమ్మడి హైకోర్టు తప్పు పట్టింది. ఆర్థిక ప్రయోజనాలు అందుకోవాలంటే మృతురాలితో ఉన్న బంధుత్వానికి సంబంధించి కోర్టు నుంచి వారసత్వ ధృవీకరణ పత్రం తీసుకురావాల్సిందేనని ఆమె భర్త, కుమారుడిని బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారులు ఒత్తిడి చేయడంపై మండిపడింది.

మృతురాలికి చెందిన ఆర్థిక ప్రయోజనాలన్నింటినీ వడ్డీతో సహా ఆమె భర్త, కుమారుడికి చెల్లించాలని అధికారులను ఆదేశించింది. బీఎస్‌ఎన్‌ఎల్‌ వద్ద మృతురాలి భర్త, కుమారుడు ఎవరనే వివరాలు స్పష్టంగా ఉన్నా, మళ్లీ వారసత్వ ధృవీకరణ పత్రం తీసుకురావాలనడంలో ఔచిత్యమేమిటో అర్థం కావడం లేదని పేర్కొంది. ఆర్థిక ప్రయోజనాల చెల్లింపు విషయంలో కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్‌ (క్యాట్‌) ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించింది. క్యాట్‌ ఉత్తర్వులను సవాలు చేస్తూ బీఎస్‌ఎన్‌ఎల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ పి.వి.సంజయ్‌కుమార్, జస్టిస్‌ నక్కా బాలయోగితో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది.

పి.లక్ష్మీసామ్రాజ్యం బీఎస్‌ఎన్‌ఎల్‌లో సూపర్‌ వైజర్‌గా పనిచేస్తూ మృతి చెందారు. ఆమెకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను ఇవ్వకపోవడంతో ఆమె భర్త, కుమారుడు క్యాట్‌ను ఆశ్రయించారు. విచారణ జరిపిన క్యాట్‌... ఆమె భర్త, కుమారుడికి ఆర్థిక ప్రయోజనాలు ఇవ్వాలని బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారులను ఆదేశించింది. ఈ ఉత్తర్వులపై బీఎస్‌ఎన్‌ఎల్‌ హైకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన ధర్మాసనం.. బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారుల తీరును తప్పుపడుతూ తీర్పునిచ్చింది.

మరిన్ని వార్తలు