రాష్ట్రంలో హైస్పీడ్ రైళ్లు

29 Jun, 2016 01:13 IST|Sakshi
రాష్ట్రంలో హైస్పీడ్ రైళ్లు

- చైనాలో సీఎం బృందం పరిశీలన
- టియాంజిన్ నుంచి బీజింగ్ వరకు ప్రయాణం    
 
 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో బుల్లెట్ లేదా హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టే అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలిస్తున్నారు. చైనా పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు మంగళవారం టియాంజిన్ నుంచి బీజింగ్‌కు బుల్లెట్ రైలులో ప్రయాణించినట్లు హైదరాబాద్‌లోని రాష్ట్ర ప్రభుత్వ సమాచార సలహాదారు కార్యాలయం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. బుల్లెట్ రైలులో సీఎంతో పాటు మంత్రి యనమల రామకృష్ణుడు, మౌలిక సదుపాయాల కల్పన ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్, సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్ తదితరులు ప్రయాణించారు. అమరావతి- విశాఖపట్నం, అమరావతి- హైదరాబాద్ మధ్య బుల్లెట్ లేదా హైస్పీడ్ రైళ్లు ప్రవేశపెట్టే అవకాశాలపై టియాంజిన్ నుంచి బీజింగ్ మధ్య 140 కిలోమీటర్లను 31 నిమిషాల్లో ప్రయాణించి పరిశీలించారు. బీజింగ్ నుంచి గుయాన్ చేరుకుని స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొనాల్సి ఉండగా, వాతావరణం అనుకూలించక పోవడంతో సీఎం ఏడున్నర గంటలు ఆలస్యంగా అక్కడికి చేరుకున్నారు.

 పీవీకి  నివాళులు: చైనా పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు ఘనంగా నివాళులు అర్పించారు. దేశంలో పీవీ ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుడితే తాను సీఎంగా వాటిని కొనసాగించానని తెలిపారు. ఢిల్లీలో పీవీ స్మృతి చిహ్నం ఏర్పాటు చేయాలని కృతనిశ్చయంతో ఉన్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు.

మరిన్ని వార్తలు