1,302 పోస్టుల పంపిణీ ఎలా?

29 Aug, 2017 02:12 IST|Sakshi
1,302 పోస్టుల పంపిణీ ఎలా?
సెప్టెంబర్‌ చివరికల్లా సీనియారిటీ అంశాన్ని తేల్చండి
- ఆ వెంటనే ఇరురాష్ట్రాల మధ్య పంపిణీ
- అజయ్‌ మిట్టల్‌ కమిటీ నిర్ణయం
కమిటీ భేటీకి హాజరైన తెలంగాణ, ఏపీ సీఎస్‌లు
 
సాక్షి, హైదరాబాద్‌: ఏపీ, తెలంగాణ మధ్య మిగిలిన 1,302 పోస్టుల పంపిణీ ప్రక్రియను సెప్టెంబర్‌ ఆఖరులోగా పూర్తి చేయాలని కమలనాథన్‌ స్థానంలో నియమితులైన అజయ్‌ మిట్టల్‌ కమిటీ నిర్ణయించింది. మిట్టల్‌ నేతృత్వంలో సోమవారం హైదరాబాద్‌లో కమిటీ సమావేశమైంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్‌తోపాటు ఇరురాష్ట్రాల అధికారులు ఇందులో పాల్గొన్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల పంపిణీ దాదాపుగా కొలిక్కి వచ్చింది. మొత్తం 90 విభాగాల్లో 153 యూనిట్లుగా ఉద్యోగుల పంపిణీ ప్రక్రియను కమలనాథన్‌ కమిటీ పూర్తి చేసింది.

మొత్తం 55,870 మంది ఉద్యోగులను ఏపీ, తెలంగాణ మధ్య పంపిణీ చేయటంతోపాటు తుది కేటాయింపుల జాబితాను కూడా ప్రకటించింది. 1,302 మంది ఉద్యోగుల పంపిణీ మాత్రమే మిగిలిపోయింది. ఈ ఉద్యోగుల పంపిణీపైనే సమావేశంలో ప్రధానంగా చర్చించారు. వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో 3, ఎస్‌పీఎఫ్‌ పరిధిలో 4, కార్మిక శాఖలో రెండు పోస్టుల(మొత్తం 9 పోస్టులు) పంపిణీకి కమిటీ ఆమోదం తెలిపింది. 1,302 పోస్టులు కోర్టు పరిధిలో ఉన్నందున ఆలస్యమవుతున్న ట్లు చర్చ జరిగింది. 62 మంది ఎక్సైజ్‌ సూపరింటెండెంట్లు, 536 మంది స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు, 683 మంది నాన్‌ కేడర్‌ అడిషనల్‌ ఎస్పీలు, డీఎస్పీలు, 21 మంది ఇతరులు ఈ జాబితాలో ఉన్నారు.

సీనియారిటీకి సంబంధించిన వివాదంపైనే వీరిలో కొందరు కోర్టును ఆశ్రయించారని, సీనియారిటీని ఫైనల్‌ చేసి తుది పంపిణీ చేయాలని కోర్టు తీర్పునిచ్చిందని, దీంతో ఆలస్యమవుతోందని అధికారులు కమిటీకి తెలిపారు. సెప్టెంబర్‌ 30లోగా సీనియారిటీ అంశాన్ని తేల్చాలని కమిటీ చైర్మన్‌ అజయ్‌ మిట్టల్‌ రెండు రాష్ట్రాలకు సూచించారు. ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన అంశం కావటంతో సీనియారిటీ తేల్చాల్సిన బాధ్యత మీదేనంటూ ఏపీ అధికారులకు గడువును నిర్దేశించారు. సీనియారిటీ తేలిన వెంటనే తుది పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు.
 
సెక్షన్‌ ఆఫీసర్లపై నో కామెంట్‌
రెండు రాష్ట్రాల మధ్య వివాదాస్పదం గా మారిన సచివాలయంలోని 24 మంది సెక్షన్‌ ఆఫీసర్ల (ఎస్‌వో) సర్దుబాటు అంశా న్ని తెలంగాణ అధికారులు కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. కానీ కమలనాథన్‌ కమిటీ ఆధ్వర్యంలో ఎస్‌వో పోస్టుల తుది పంపిణీ పూర్తయిందని, తిరిగి ఆ విషయంలో జోక్యం చేసుకోవటం సరైంది కాదని కమిటీ చైర్మన్‌ తెలిపారు. అవసరమైతే ఇద్దరు సీఎస్‌లు సమావేశమై ఆ విషయంలో చర్చించుకోవాలని సూచించినట్లు సమా చారం. సర్దుబాటులో భాగంగా అదనంగా ఉన్న 24 మంది ఎస్‌వోలను ఏపీకి పంపించేందుకు 2 రాష్ట్రాల మధ్య జరిగిన రాయబారం విఫలమైంది. వీరిని చేర్చుకు నేందుకు ఏపీ ప్రభుత్వం నిరాకరించటం తోపాటు తెలంగాణకు లేఖ రాసింది. దీంతో ఈ విషయంపై సీఎస్‌లు మరోసారి సమావేశమయ్యే అవకాశాలున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. 
మరిన్ని వార్తలు