భాగ్యనగరితో అమ్మ అనుబంధం..

12 Dec, 2016 14:45 IST|Sakshi
భాగ్యనగరితో అమ్మ అనుబంధం..

తమిళనాడు దివంగత సీఎం జయలలితకు నగరంతో విడదీయరాని అనుబంధం ఉంది. ఇక్కడ ఆమెకు రెండు ఇళ్లులున్నాయి. అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చేవారు. విద్య, ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం ఎంతో మంది తమిళులు నగరంలో నివసిస్తున్నారు. జయలలిత మరణ వార్త విని వారంతా హతాశులయ్యారు. ‘అమ్మ’ లేరన్న విషయాన్ని నమ్మలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ‘అమ్మ’ను చివరిసారి కళ్లారా చూసుకునేందుకు అంత్యక్రియలు పూర్తయ్యేంత వరకూ టీవీ లకు అతుక్కుపోయారు. ఈ నేపథ్యంలో వెస్ట్‌ మారేడుపల్లి టీఐటీ క్వార్టర్స్‌ వద్ద నివసిస్తున్న పలువురు తమిళులు, నగరవాసులు జయలలితతో తమకున్న అనుబంధాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు.

శ్రీనగర్‌ కాలనీతో..
జయలలిత 1970లో శ్రీనగర్‌ కాలనీలో ప్లాట్‌ కొనుగోలు చేసి అందమైన భవంతి(ఇంటి నెంబర్‌ 8–3–1099)ని నిర్మించుకున్నారు. ఆ సమయంలో ఆమె  తెలుగు, తమిళ భాషల్లో పెద్ద నటీమణిగా వెలుగొందుతున్నారు. ఇక్కడ షూటింగ్‌లు ఉన్నప్పుడు తప్పనిసరిగా శ్రీనగర్‌ కాలనీలోని తన నివాసంలోనే ఉండేవారు. ఉదయం వేళ వాకింగ్‌ కూడా చేసేవారని ఆమెతో పరిచయం ఉన్న పలువురు స్థానికులు గుర్తు చేసుకున్నారు. అయిదారేళ్లు ఆమె ఈ నివాసాన్ని వినియోగించుకున్నారని అనంతరం తమిళనాడులో స్థిరపడడంతో తరచూ వచ్చి వెళ్తుండేవారని పేర్కొన్నారు. ఆమె ఇక్కడున్న సమయంలో పలువురు అగ్ర నిర్మాతలు, దర్శకులు, హీరోలు కూడా వచ్చేవారని స్థానికులు చెప్పారు. రెండు, మూడు సార్లు సూర్యకాంతంను కూడా ఆమె ఇంట్లో చూశానని ఓ మహిళ పేర్కొంది.

సినిమా వాళ్ల రాకపోకలతో ఈ వీధికి జయలలిత వీధిగా అప్పట్లోనే పేరొచ్చిందన్నారు. మరోవైపు జయలలిత పేరు మీదనే జీహెచ్‌ఎంసీలో ఆస్తిపన్ను చెల్లిస్తున్నారు. కరెంట్‌ బిల్లు, వాటర్‌బిల్లు అన్నీ జయలలిత పేరుమీదనే ఉన్నాయి. అంతేకాదు 1970లోనే ఆమె టెలిఫోన్ కనెక్షన్ కూడా తీసుకున్నట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. అనంతరం ఫోన్ డిస్‌కనెక్ట్‌ కావడం 1978లో ఈ ఇంటిని అద్దెకు ఇవ్వడం జరిగిందని స్థానికులు చెప్పారు. గత కొన్నేళ్ల నుంచి ఈ ఇల్లు ప్రముఖ డిస్టిలరీస్‌ సంస్థ యునైటెడ్‌ బేవరేజస్‌కు అద్దెకిచ్చారు. అద్దె డబ్బులు నేరుగా జయలలిత బ్యాంక్‌ ఖాతాలోకి వెళ్తాయని నిర్వాహకులు తెలిపారు. ఈ బిల్డింగ్‌ నిర్వహణ మొత్తం ఓ మేనేజర్‌కు అప్పగించారు.

విప్లవ నాయకికి ఘననివాళి..  
నగరంలో పలుచోట్ల జయలలిత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ‘అమ్మ’ మృతితో సికింద్రాబాద్‌ కార్ఖానాలోని తమిళ బస్తీ ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. కార్ఖానాలోని గణేష్‌ ఆలయం సమీపంలో జయలలిత చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.  స్థానికుడు విజయ్‌ మాట్లాడుతూ పేద మహిళల కోసం సీఎం జయలలిత తమ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని, ‘అమ్మ’గా అండగా ఉన్నారని కొనియాడారు. ‘అమ్మ’ లేని లోటును ఎవరూ పూడ్చలేరన్నారు. కార్యక్రమంలో కిషోర్, దీపక్, రోహిత్, మహాలక్ష్మి, రాణి, మాయవతి, పార్వతి, మంజు, భాను తదితరులు పాల్గొన్నారు. జయలలిత పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకురాలు దేవిరెడ్డి విజితారెడ్డి అన్నారు. ఆమె ఆధ్వర్యంలో బర్కత్‌పురాలో జయలలిత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

శోకసంద్రంలో రాధిక కాలనీ..
జయలలితకు వెస్ట్‌మారేడ్‌పల్లిలోని రాధిక కాలనీలోనూ ఆమె ఇష్టసఖి శశికళ పేరుతో ఓ ఇల్లు ఉంది. 2001లో జయలలిత ఈ ఇంటికి వచ్చారు. దీంతో కాలనీవాసులు ఆమెను కలసి అభినందనలు తెలిపారు. ఆమె మరణ వార్త విని కాలనీవాసులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆమెతో జ్ఞాపకాలను గుర్తు చేసుకొని కన్నీటిపర్యంతమయ్యారు. కాగా ఈ ఇల్లు రెండేళ్లుగా ఖాళీగా ఉంటోంది.

జయ నా క్లాస్‌మెంట్‌...  
‘అమ్మ’ ఇకలేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నాం. కోలుకుంటున్నారన్న వార్త విని సంతోషపడ్డాం. కానీ మరుసటి రోజే ఆమె మరణ వార్త రావడంతో షాక్‌కు గురయ్యాం. చెన్నైలో నేను స్టేల్ల మేరీస్‌ కాలేజీలో 1966–67లో ఇంటర్‌ చదువుతున్న సమయంలో జయ నా క్లాస్‌మెంట్‌. జయకు ఐఏఎస్‌ కావాలన్న ఆశయం ఉండేది. కొద్ది రోజులకే సినిమా షూటింగ్‌ ఉందని జయలలిత గారి తల్లి సంధ్య కాలేజీ మాన్పించారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగారు. తమిళుల ఆరాధ్య దైవంగా మారారు.
    – గిరిజ, యునైటేడ్‌ ఇన్సూరెన్స్ సంస్థ మాజీ మేనేజర్, మారేడుపల్లి, స్వస్థలం చెన్నై
ఎదురులేని నాయకురాలు....
జయలలిత లాంటి నాయకురాలు ఇక ఎవరూ రారు. పార్టీని క్రమశిక్షణతో ముందుకు తీసుకెళ్లారామె. హైదరాబాద్‌ నుంచి తమిళనాడుకు వెళ్ళినప్పుడల్లా ఆనందంగా ఉండేది. తమిళనాడు ఉహించని రీతిలో అభివృద్ధి చెదింది. ఆమె ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఆమెను ఎదురులేని నాయకురాలిగా తీర్చిదిద్దాయి. మంచి నాయకురాలిని కొల్పోయాం..ఆమె మృతి చెందారన్న వార్త విన్నప్పటి నుంచి చాలా బాధగా ఉంది.
– చంద్రమోహన్, మారేడుపల్లి, స్వస్థలం చెన్నై

మరిన్ని వార్తలు