మరింత జవాబుదారీతనంతో ‘ఈ-చలాన్’

8 Apr, 2016 18:02 IST|Sakshi
హైదరాబాద్  : 
- శరత్ తన వాహనాన్ని రాంగ్‌రూట్‌లో నడపలేదు. అయినప్పటికీ ఇంటికి చలాన్ వచ్చింది.
- భరత్ తన వాహనాన్ని నో పార్కింగ్ జోన్‌లో నిలపలేదు. అయినా జరిమానా విధించారు.
- ఆ ఉల్లంఘనకు పాల్పడింది వేరే వాహనం... పొరపాటున అతడికి ఈ-చలాన్ పంపారు.
 
నగర ట్రాఫిక్ విభాగం అధికారులకు వాహనచోదకుల నుంచి తరచుగా ఇలాంటి ఫిర్యాదులు వస్తున్నాయి. విచారణ నేపథ్యంలో అవి నిజాలనీ స్పష్టమవుతున్నాయి. అలాంటప్పుడు విధినిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బంది, అధికారుల్ని గుర్తించాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ-చలాన్ల జారీలో సమగ్ర విధానం లేకపోవడంతో అది సాధ్యం కావట్లేదు. దీంతో సిటీ ట్రాఫిక్ పోలీసులు ఈ-చలాన్ల జారీలో పాదర్శకత పెంచడం, సిబ్బందిని జవాబుదారీ చేయడం, సాక్ష్యాధారాల సేకరణకు ప్రత్యేక విధానం రూపొందించారు. 
 
ఈ-చలాన్లు పంపే ఉల్లంఘనల గుర్తింపు నుంచి అప్రూవ్ వరకు పారదర్శకంగా ఉండేలా సాఫ్ట్‌వేర్ అమల్లోకి రానుంది. దీని ప్రకారం క్షేత్రస్థాయిలో ఉల్లంఘనల ఫొటోలు తీసిన సిబ్బంది...గరిష్టంగా 20 సెకన్ల నిడివితో ఉండే వీడియోనూ చిత్రీకరించాలి. వాటిని అప్‌లోడ్ చేసే సమయంలో వారి పేరు, నంబర్, హోదా తదితరాలను పొందుపరచాలి. వీటిని అప్రూవ్ చేస్తున్న, అప్‌లోడ్ చేస్తున్న వారూ ఈ వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. వీటి ఆధారంగా ఉల్లంఘనలకు పాల్పడనివారికి ఈ-చలాన్లు జారీ అయితే అందుకు బాధ్యులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఏర్పడనుంది. ఈ నెలలోనే నూతన విధానాన్ని ప్రారంభించనున్నామని ట్రాఫిక్ విభాగం డీసీపీ-2 ఏవీ రంగనాథ్ వెల్లడించారు.
మరిన్ని వార్తలు