ఎన్డీయే పాలనలో పెరిగిన దాడులు

6 Apr, 2018 01:07 IST|Sakshi

బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి వేడుకల్లో కడియం  
సాక్షి, హైదరాబాద్‌: కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశవ్యాప్తంగా దళితులపై దాడులు పెరిగాయని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆందోళన వ్యక్తం చేశారు. బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతి ఉత్సవాల్లో భాగంగా గురువారం ఎల్‌బీ స్టేడియం ఆవరణలో జగ్జీవన్‌ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలపై అత్యాచార నిరోధక చట్టం అమలు విషయంలో కేంద్రం ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్నారు.

దళితులు ఇటీవలే కొంత చైతన్యం పొందుతూ వారి హక్కులను కాపాడుకుని, చట్టాలను సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఈ క్రమంలో వారిని అన్ని రకాలుగా అణచివేసే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ వర్గాల సమగ్ర అభివృద్ధికి అంబేడ్కర్‌ చట్టాలు చేస్తే ఎన్డీయే ప్రభుత్వం వాటిని నీరుగార్చే కుట్ర చేస్తోందని, దీనికి కోర్టులు వంతపాడటం బాధాకరమన్నారు.

సుప్రీం కోర్టులో ఈ చట్టాన్ని నీరుగార్చేందుకు జరుగుతున్న యత్నాలను కేంద్రం అడ్డుకోవాలన్నారు. సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ఈ చట్టాన్ని నీరుగార్చే ప్రయత్నాలను ఖండించారన్నారు. కార్యక్రమం లో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

 గుజరాత్‌లో పర్యటించిన జోగురామన్న
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర బీసీ, ఎంబీసీ కార్పొరేషన్‌ల ద్వారా కొత్త పథకాలు చేపట్టే క్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న నేతృత్వంలోని అధికారుల బృందం గురువారం గుజరాత్‌లో పర్యటించింది. ఈ సందర్భంగా అక్కడ అత్యాధునిక పద్ధతులు ఉపయోగిస్తున్న మట్టి పాత్రల తయారీ పరిశ్రమలను వారు సందర్శించారు.

అనంతరం ఆ రాష్ట్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి ఈశ్వర్‌ భాయ్‌ పర్మర్‌తో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను మంత్రి జోగు రామన్న ఆయనకు వివరించారు. బృందంలో ఎంబీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌ తాడూరి శ్రీనివాస్, ఎమ్మెల్యే రాథోడ్‌ బాబురావు, బీసీ సంక్షేమ శాఖ అదనపు సంచాలకుడు అలోక్‌కుమార్‌ తదితరులున్నారు.

మరిన్ని వార్తలు