హజ.. పనం.. వరహా..

15 Apr, 2018 00:54 IST|Sakshi

కాకతీయ సామ్రాజ్యంలో చెలా‘మనీ’లో ఉన్న నాణేలు..

వెలుగుచూస్తున్న ఆసక్తికర అంశాలు

రాణీ రుద్రమ దేవి.. పరాక్రమానికి ప్రతిరూపం. ఆ పేరు వింటేనే శత్రువుల గుండెలు అదిరిపోయేవి. మరి ఆమెకు ఉన్న బిరుదేమిటో తెలుసా..? రాయ గజకేసరి! ఏనుగంతటి శత్రువుపై లంఘించి సంహరించే సింహం వంటి రాజు అన్నది దాని సారాంశం. మరి ఆమె హయాంలో రూపుదిద్దుకున్న నాణేలాపై పేరేముండేదో తెలుసా..? రాయగజ!!

సాక్షి, హైదరాబాద్‌ :  ప్రపంచంలోనే గొప్ప సామ్రాజ్యాల్లో ఒకటిగా కీర్తి గడించిన కాకతీయుల హయాంలో చలామణీలో ఉన్న నాణేలపై ఇప్పటి వరకు పెద్దగా స్పష్టత లేదు. తాజాగా దీన్ని కొలిక్కి తెచ్చేందుకు కాకతీయ హెరిటేజ్‌ ట్రస్టు ఆధ్వర్యంలో నాణేల పరిశోధకులు రాజారెడ్డి అధ్యయనం జరుపుతున్నారు. మూడు నెలలపాటు శ్రమించి 1,600 నాణేలను పరిశీలించి, వాటిని కాకతీయ శాసనాలతో అనుసంధానించి ఓ కొలిక్కి తెచ్చారు. ఓ మహా సామ్రాజ్యానికి సంబంధించిన నాణేల వివరాలను ప్రజల ముంగిట ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

1,600 నాణేలపై పరిశోధన
ఇప్పటి వరకు కాకతీయుల నాణేలపై పెద్దగా పరిశోధన జరగలేదు. వారి సామ్రాజ్య చిహ్నమైన వరాహం గుర్తు ఉన్న నాణేలు కాకతీయులవి అని మాత్రమే చరిత్రకారులు గుర్తించారు. కానీ ఆ సామ్రాజ్యంలో ఏ చక్రవర్తి ఎలాంటి నాణేలు రూపొందించారన్న విషయంలో స్పష్టత రాలేదు. 1975లో ప్రముఖ చరిత్రకారుడు పరబ్రహ్మశాస్త్రి ఈ నాణేలపై పరిశోధన చేసి కొన్ని వివరాలు వెల్లడించినా, ఆయా చక్రవర్తుల నాణేల అమలు విధానాన్ని మాత్రం వెల్లడించలేకపోయారు.

దీంతో నాటి నాణేలపై స్పష్టత రావాలన్న ఉద్దేశంతో కాకతీయ హెరిటేజ్‌ ట్రస్టు.. పురావస్తు శాఖ (హెరిటేజ్‌ తెలంగాణ) సహకారంలో బృహత్‌ అధ్యయనానికి నడుం బిగించింది. ట్రస్టు నిర్వాహకులు, ప్రభుత్వ సలహాదారు పాపారావు సూచనతో ప్రముఖ నాణేల అధ్యయన నిపుణులు డాక్టర్‌ రాజారెడ్డి.. నాంపల్లి స్టేట్‌ మ్యూజియంలో ఉన్న 1,600 కాకతీయ నాణేలపై మూడు నెలలుగా పరిశోధన జరుపుతున్నారు. తాజాగా ఆయన ఆ పరిశోధన వివరాలతో పుస్తక ముద్రణకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఎక్కువ విలువ, తక్కువ విలువ..  
ప్రస్తుతం నగదులో డినామినేషన్స్‌ ఉన్నట్టుగానే కాకతీయులు నాణేల్లో డినామినేషన్స్‌ రూపొందించారు. ఎక్కువ విలువ, తక్కువ విలువ ఉన్న నాణేలన్నమాట. 1.6 నుంచి 1.8 సెం.మీ. పరిమాణంలో 3.64 గ్రాముల బంగారంతో రూపొందించిన నాణేలను వరహాలుగా పేర్కొన్నారు. వాటిలో పదో వంతు అంటే.. 0.36 గ్రాముల బంగారంతో 4 మి.మీ. వ్యాసంతో రూపొందించిన నాణేలను పనంగా పిలుచుకున్నారు. అందులో నాలుగో వంతు విలువతో కేవలం 3 మి.మీ. పరిమాణంలో హజ పేరుతో నాణేలు చెలామణి చేశారు.

గజకేసరి బిరుదుతో..
కాకతీయ చక్రవర్తులను గజకేసరి బిరుదుతో పిలిచేవారు. ఈ గజకేసరి పేరుకు కొన్ని పదాలు చేర్చి నాణేలపై ముద్రించారు. ఇవి తప్ప రాజుల పేర్లు ఎక్కడా లేకపోవటంతో ఏ నాణెం ఎవరి హయాందో తేలలేదు. బీదర్‌ వద్ద లభించిన శాసనంలో రాణీ రుద్రమ గురించి వర్ణించే క్రమంలో రాయ గజకేసరి పేరును వాడారు.

స్టేట్‌ మ్యూజియంలో ఉన్న నాణేలను పరిశీలించగా కొన్ని నాణేలపై రాయగజ అన్న పదాలు కనిపించాయి. దీంతో అవి రుద్రమదేవి రూపొందించినవిగా గుర్తించారు. అలాగే కండవల్లి శాసనంలో ప్రతాప రుద్రుడిని దాయ గజకేసరిగా అభివర్ణించారు. కొన్ని నాణేలపై దాయ గజ అక్షరాలు ఉండటంతో అవి ఆయన హయాంలో రూపొందించినవిగా రాజారెడ్డి తేల్చారు. కొన్నింటిపై అరి గజ అన్న పదాలు కనిపించాయి.

కానీ ఆ బిరుదు ఎవరికి ఉందో తెలిపే శాసనం ఇప్పటి వరకు వెలుగు చూడలేదు. కొన్ని ప్రాంతాల్లో ఎన్నో శాసనాలు పడిఉన్నాయి. కానీ వాటిపై ప్రభుత్వాలు శ్రద్ధ చూపకపోవటంతో పరిశోధన సాగలేదు. ఇటీవల నేలకొండపల్లిలో ప్రతాప రుద్రుడి సేనాధిపతి రుద్రసేనాని మనవడు పసాయిత గణపతిరెడ్డి వేయించిన శాసనాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు శ్రీరామోజు హరగోపాల్‌ తదితరులు గుర్తించారు.

నాణేలు కరిగించిన బహమనీయులు
కాకతీయ సామ్రాజ్యాన్ని కూల్చేసిన బహమనీయులు పెద్ద దురాగతానికి పాల్పడ్డారు. కాకతీయులకు గొప్ప సామ్రాజ్యమన్న పేరు ఉండటంతో దాని గుర్తుగా ఉండే వాటిని రూపుమాపాలని నిర్ణయించారు. తొలుత వారి దృష్టి నాటి నాణేలపై పడింది. కాకతీయ సామ్రాజ్యంలో ఉన్న నాణేలన్నింటినీ కరిగించేశారు. అయితే బంగారు, వెండి నాణేల విలువ ఎక్కు వగా ఉండటంతో కొంతమంది ప్రజలు వాటిని దాచుకున్నారు.

అలా ఉన్నవే ఇప్పుడు తవ్వకాలలో బయటపడుతున్నాయి. కానీ రాగి నాణేల ను జనం దాచుకోలేదు. అవన్నీ బహమనీయు ల చేతుల్లో అదృశ్యమయ్యాయి. అందుకే ఇప్పటి వరకు కాకతీయులకు చెందిన ఒక్క రాగి నాణెం కూడా వెలుగు చూడలేదు. ఇలాంటివెన్నో ఆసక్తికర విషయాలతో కాకతీయుల నాణేల చరిత్రతో తొలి పుస్తకం వెలువడబోతోంది.


వరహా..
3.64 గ్రాముల బంగారంతో రూపొందించిన నాణెం.
పనం..
వరహాలో పదో వంతు. అంటే 0.36 గ్రాముల బంగారంతో రూపొందించిన నాణెం.
హజ..
పనంలో నాలుగో వంతు. కేవలం 3 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉంటుంది.

మరిన్ని వార్తలు