ఇది ఆల్‌టైమ్ రికార్డ్

10 Apr, 2016 04:33 IST|Sakshi
ఇది ఆల్‌టైమ్ రికార్డ్

ఒక్క రోజు.. 54.74 మిలియన్ యూనిట్లు
గ్రేటర్ డిస్కం చరిత్రలో ఇప్పటి వరకు ఇదే అత్యధికం
 
 సాక్షి, హైదరాబాద్: ఒకవైపు ప్రచండ భానుడి ప్రతాపం.. మరోవైపు ఉక్కపోత.. వడగాడ్పులు.. దీంతో సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు. నిన్నమొన్నటి వరకు చలిగాలులతో ఎంతో ఆహ్లాదంగా ఉన్న ఈ మహానగరం రోజురోజుకూ పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలతో తల్లడిల్లిపోతోంది. ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల వాడకం ఒక్కసారిగా పెరగడంతో విద్యుత్ వినియోగం రెట్టింపైంది. విద్యుత్ పంపిణీ సంస్థ చరిత్రలోనే అత్యధికంగా ఈ ఏడాది ఏప్రిల్ 5వ తేదీన 54.74 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగింది. గత ఏడాది మే 26న రికార్డు స్థాయిలో 53.2 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగగా, ఈ ఏడాది నెల రోజుల ముందే ఆ రికార్డును బ్రేక్ చేయడం గమనార్హం. రానున్న రోజుల్లో ఇది 58 మిలియన్ యూనిట్లు దాటే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న డిమాండ్ చూస్తే విద్యుత్ అధికారులకే ముచ్చెమటలు పడుతున్నాయి.

 ఉడుకుతున్న కేబుళ్లు..
 గ్రేటర్ పరిధిలో 39 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా, వీటిలో 32.5 లక్షలు గృహ, 5.5 లక్షల వాణిజ్య కనెక్షన్లు ఉన్నాయి. చిన్న, మధ్యతరహా, భారీ పరిశ్రమలు మరో 40 వేలకుపైగా ఉన్నాయి. వీటి అవసరాలు తీర్చేందుకు అవసరమైన విద్యుత్ ఉన్నా పగటి ఉష్ణోగ్రతలకు తోడు ఒక్కసారిగా వినియోగదారుల నుంచి డిమాండ్ పెరుగుతుండటంతో ట్రాన్స్‌ఫార్మర్లపై తీవ్ర భారం పడుతోంది. సూర్యుని ప్రతాపానికి విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ వైర్లు కరిగి సాగిపోతున్నాయి. భూగర్భ కేబుళ్లు వేడికి ఉడికిపోయి జాయింట్స్ వద్ద కాలిపోతున్నాయి. ఇలా ప్రతిరోజూ రెండు, మూడు ఫీడర్ల పరిధిలో ఈ సమస్య తలెత్తుతోంది. మరోవైపు ఆయిల్ లీకేజీలకు తోడు ఓవర్ లోడ్ వల్ల ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయి. వీటి స్థానంలో కొత్త వాటిని అమర్చి విద్యుత్ పునరుద్ధరించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులు అత్యవసర లోడ్ రిలీఫ్‌ల పేరుతో కోతలు అమలు చేస్తున్నారు. విద్యుత్ డిమాండ్ అధికంగా ఉన్న శివారు ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది.
 
 24 గంటలు విద్యుత్ సరఫరా..
 వేసవి డిమాండ్‌పై ముందే ఓ అంచనాకు వచ్చాం. ఇప్పటికే లైన్స్‌ను పునరుద్ధరించాం. పవర్ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేశాం. రూ.240 కోట్లు ఖర్చు చేసిసరఫరా వ్యవస్థను అభివృద్ధి చేశాం. ఎలాంటి అంతరాయం లేకుండా 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నాం. అత్యవసర పరిస్థితుల్లో మినహా కోతలు అమలు చేయడం లేదు. విద్యుత్ సరఫరాపై ఆందోళన చెందాల్సిన  అవసరం లేదు.
 - శ్రీనివాసరెడ్డి, డెరైక్టర్, ఆపరేషన్స్, టీఎస్‌ఎస్‌పీడీసీఎల్

>
మరిన్ని వార్తలు