మోక్షం!

31 Mar, 2016 02:27 IST|Sakshi
మోక్షం!

జంట జలాశయాలకు వ్యర్థ జలాల నుంచి విముక్తి
త్వరలో మురుగు శుద్ధి కేంద్రాల నిర్మాణం
11 గ్రామాలను గుర్తించిన జలమండలి
శుద్ధి జలాలు స్థానిక అవసరాలకు వినియోగం

 
సాక్షి, సిటీబ్యూరో:  గ్రేటర్‌లోని చారిత్రక జంట జలాశయాల పరిరక్షణ దిశగా మరో ముందడుగు పడింది. సమీప గ్రామాల నుంచి నిత్యం వెలువడుతున్న వ్యర్థ జలాలు జలాశయాల్లో కలుస్తుండడంతో మురుగుకూపాల్లా మారుతున్న విషయం విదితమే. విషం నుంచి వీటికి విముక్తి కల్పించేందుకు 11 గ్రామాల పరిధిలో మురుగు శుద్ధి కేంద్రాలు(ఎస్టీపీ) నిర్మించాలని జలమండలి సంకల్పించింది. సుమారు రూ.40.50 కోట్ల అంచనా వ్యయంతో వీటిని నిర్మించనున్నారు. ఉస్మాన్ సాగర్ (గండిపేట్)కు ఆనుకొని ఉన్న ఖానాపూర్, వట్టినాగులపల్లి, జన్వాడ, అప్పోజిగూడ, చిలుకూరు, బాలాజీ దేవాలయం, హిమాయత్ నగర్ గ్రామాల పరిధిలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఇక హిమాయత్ సాగర్ పరిధిలో హిమాయత్ సాగర్, అజీజ్ నగర్, ఫిరంగినాలా, కొత్వాల్‌గూడ పరిధిలో ఎస్టీపీలు నిర్మించనున్నారు. వీటికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను పీబీఎస్ సంస్థ సిద్ధం చేసింది.

నిర్మాణ వ్యయంలో తెలంగాణ  కాలుష్య నియంత్రణ మండలి రూ.13 కోట్లు, పంచాయతీ రాజ్ శాఖ  రూ.27.50 కోట్లు వెచ్చించనున్నాయి. నిర్మాణ, నిర్వహణ పనులను జలమండలి పర్యవేక్షి స్తుంది. ఈ గ్రామాల నుంచి రోజు వారీ ఇక్కడికి వచ్చే గృహ, పారిశ్రామిక, వాణిజ్య సం స్థల వ్యర్థ జలాలను శుద్ధి చేసిన అనంతరం స్థానికంగా వన సంరక్షణకు వినియోగించనున్నట్లు జలమండలి వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి.

 ఎట్టకేలకు విముక్తి
సుమారు తొమ్మిది దశాబ్దాలుగా భాగ్యనగరి దాహార్తిని తీరుస్తున్న జంట జలాశయాలను మురుగు నుంచి విముక్తి చేసే పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. పర్యావరణ ఇంజినీరింగ్ సంస్థ ‘నీరి’ నిపుణులు 2011లో సమగ్ర అధ్యయనం చేసి.. తీసుకోవాల్సిన పరిరక్షణ చర్యలపై రాష్ట్ర ప్రభుత్వా నివేదిక సమర్పించారు. ఈ సిఫారసులకు ఐదేళ్లుగా మోక్షం లభించలేదు. దీంతో సమీప గ్రామాల మురుగు నీరు జంట జలాశయాల్లో కలుస్తుండడంతో అవి హుస్సేన్‌సాగర్‌లా కాలుష్య కాసారంగా మారుతాయని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, జలమండలి స్పందించి మురుగు శుద్ధి కేంద్రాల నిర్మాణానికి ముందుకురావడం శుభ పరిణామమని వారు చెబుతున్నారు. శుద్ధి చేసిన  నీరు తిరిగి జలాశయాల్లో చేరకుండా స్థానికంగా గార్డెనింగ్, టాయ్‌లెట్ ఫ్లషింగ్ వంటి అవసరాలకు వినియోగించాలని సూచిస్తున్నారు.

 ఇన్‌ఫ్లో చానల్స్‌ను ప్రక్షాళన చేయాలి
 ఎగువ ప్రాంతాల్లో ఉన్న సుమారు 84 గ్రామాల నుంచి జలాశయాలకు వరద నీటిని చేర్చే కాల్వలు (ఇన్‌ఫ్లో చానల్స్) కబ్జాకు గురవడం... ఇటుక బట్టీలు... ఇసుక మాఫియాకు అడ్డాలుగా మారడం... ఫాంహౌస్‌లు, ఇంజినీరింగ్ కళాశాలలు, గోడౌన్లు, ఇతర వాణిజ్య కార్యకలాపాలకు నిలయంగా మారడంతో రోజురోజుకూ ఇవి చిన్నబోతున్నాయి. ప్రస్తుత ఎండలకు ఈ జలాశయాల్లో నీరు అడుగంటిపోయింది. ఈ నేపథ్యంలో ఇన్‌ఫ్లో చానల్స్‌ను ఈ వేసవిలోనే ప్రక్షాళన చేయాలని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు.

అక్రమ నిర్మాణాలను తొలగించాలని కోరుతున్నారు. రెవెన్యూ, పంచాయతీ రాజ్, జలమండలి విభాగాలు సమన్వయంతో పనిచేస్తే ఈ జలాశయాలు పది కాలాల పాటు మహానగర దాహార్తిని తీరుస్తాయని పేర్కొంటున్నారు. ఇవి పూర్వపు స్థాయిలో జలకళను సంతరించుకుంటే నగరానికి రోజువారీగా 40 మిలియన్ గ్యాలన్ల తాగునీటిని పొందే అవకాశం ఉంటుందని.. దాదాపు పాత నగరం (ఓల్డ్‌సిటీ) దాహార్తి తీరుతుందని అంటున్నారు.

మరిన్ని వార్తలు