ఉత్తర ద్వారం తెరిచిన బీజేపీ.. ప్రధాన ద్వారం మార్పు కలిసొచ్చేనా?

2 Dec, 2023 08:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్​: ఎన్నికల ఫలితాల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల కార్యాలయాల్లో ఆసక్తికరమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గురువారం రాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరగగా, అదే రోజు నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో తూర్పు వైపు ఉన్న ప్రధాన ద్వారాన్ని మూసేసి గతంలో ఉపయోగించిన ఉత్తరం వైపు తలుపును తెరిచారు.

ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు ఇదే మార్గంలో రాకపోకలు సాగిస్తే పార్టీకి అనుకూలంగా మంచి ఫలితాలు రావొచ్చునని నాయకులు అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగానే వాస్తు మార్పు చేసి, ఉత్తరం వైపు ద్వారాన్ని ఉపయోగించాలని నిర్ణయించినట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. దాదాపు ఇరవై ఏళ్ల క్రితం పార్టీ కార్యాలయాన్ని నిర్మించాక తూర్పువైపు ప్రధాన ద్వారాన్నే చాలా కాలం ఉపయోగించారు. గతంలో బండి 

సంజయ్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక కొన్ని వాస్తుపరమైన మార్పులు చేశారు. ఇందులో భాగంగా తూర్పువైపు ద్వారం మూసేసి, ఉత్తరం వైపు తలుపులు తెరిచి రాకపోకలకు ఉపయోగించారు. మళ్లీ ఇప్పుడు ఎన్నికల పోలింగ్, ఫలితాలు వెలువడే సందర్భంగా వాస్తుపరంగా ఉత్తర ద్వారాన్ని ఉపయోగిస్తుండడం గమనార్హం.

పార్టీ పోటీచేస్తున్న నియోజకవర్గాల్లో గురువారం పోలింగ్‌ సరళిని బట్టి చూస్తే సానుకూల పరిణామాలే కనిపించాయని, గతం కంటే ఎక్కువ ఓటింగ్‌శాతమే నమోదు అవుతుందనే ధీమా పార్టీ వర్గాల్లో వ్యక్తమౌతోంది. మరి నిజంగానే ప్రధాన ద్వారం మార్పు అనేది పార్టీ అధిక సీట్లను గెలిపిస్తుందా అనేది తేలాలంటే ఫలితాలు వెలువడే దాకా వేచి చూడాల్సిందే మరి.

మరిన్ని వార్తలు