నల్లబజారుకు కందిపప్పు

9 Nov, 2015 00:26 IST|Sakshi

రేషన్ డీలర్ల చేతివాటం
రెండు రోజులకే కోటా ఖతం
కంది పప్పు నో స్టాక్
కొరవడిన అధికారుల నిఘా

 
సిటీ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో పెద్దఎత్తున ‘రేషన్ కంది పప్పు’ నల్లబజారుకు తరలినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ చౌకధరల దుకాణాల్లో పంపిణీ ప్రక్రియ ప్రారంభమైన రెండు మూడు రోజులకే కంది పప్పు నో స్టాక్‌గా మారడం ఇందుకు బలం చేకూర్చుతోంది. కొందరు రేషన్ డీలర్లు వచ్చిన కంది పప్పు ఆయిపోయిందంటూ... మరి కొందరు పూర్తి కోటాను దిగమింగి సబ్సిడీ కంది పప్పు ఈ సారి రైతుబజార్, ప్రత్యేక కేంద్రాల్లో విక్రయిస్తున్నారని లబ్ధిదారులకు పేర్కొంటూ చేతులు దులుపుకుంటున్నారు. బహిరంగ మార్కెట్‌లో ధర పెరగడంతో డీలర్లు చేతివాటం ప్రదర్శించి లబ్ధిదారులు పంపిణీ చేయకుండా పక్కదారి పట్టించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో ధర కిలో రూ.200 లు పలుకుతుండగా.. చౌకధరల దుకాణాల ద్వారా సబ్సిడీపై రూ.50లకు పంపిణీ చేయా ల్సి ఉంటుంది. ఈ వ్యత్యాసం ఫలితంగా చౌక ధర కంది పప్పు గుట్టుచప్పుడు కాకుండా డీలర్లు సొమ్ము చేసుకుం టున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పూర్తి స్థాయి లో కంది పప్పు కోసం పూర్తిస్థాయి కోటా కోసం డీడీలు కట్టి ఇండెంట్ పెట్టిన డీలర్లు మొదటి విడతగా కేటాయించిన సుమారు 70 శాతం వరకు కోటాను గోదాముల నుంచి నేరుగా నల్లబజారుకు తరలించినట్లు తెలుస్తోంది. దాల్‌మిల్లర్స్, పప్పు దినుసుల వ్యాపారులు, దళారులు రేషన్ పుప్పుపై దృష్టి సారించడం డీలర్లకు మరింత కలిసివచ్చింది. అధికారుల నిఘా కేవలం ప్రకటనలకే పరిమితం కావడంతో నల్లబజారుకు తరలిపోయింది.

సగానికి పైగా దుకాణాల్లో నో స్టాక్..
గ్రేటర్‌లోని సగానికిపైగా ప్రభుత్వ చౌకధరల దుకాణాల్లో గురువారం నాటికి కంది పప్పు లేకుండా పోయింది. మొత్తం 13.96 లక్షల కార్డుదారులు ఉండగా, ప్రతి కార్డు కు  కిలో కంది పప్పు చొప్పున పంపిణీ చేయాల్సి ఉంది. ఇందుకు పౌరసరఫరా శాఖ హైదరాబాద్‌లోని తొమ్మిది సర్కిల్స్‌లోని రేషన్ షాపులకు 817 మెట్రిక్ టన్నులు, రంగారెడ్డి జిల్లా అర్బన్‌లోని మూడు సర్కిల్స్‌లోగల షాపులకు 578 మెట్రిక్ టన్నుల చొప్పున  కంది పప్పు కోటాను కేటాయించి మొదటి విడతగా 75 శాతం విడుదల చేసిం ది. చౌకధరల దుకాణాల డీలర్లకు కిలో రూ.49.45 పైసల చొప్పున సరఫరా చేసి రూ.50ల చొప్పున లబ్ధిదారులకు పంపిణీ చేయాలని సూచించింది. అయితే కంది పప్పుకు డిమాండ్ పెరగడం డీలర్లకు కాసులు కురిపిస్తోంది.

మరిన్ని వార్తలు