హైదరాబాద్ మార్కెట్లోకి ‘కరీంనగర్ పాలు’

3 Aug, 2015 01:39 IST|Sakshi
హైదరాబాద్ మార్కెట్లోకి ‘కరీంనగర్ పాలు’

అమ్మకాలు ప్రారంభించిన ఆర్థికమంత్రి ఈటల రాజేందర్
 
 సాక్షి, హైదరాబాద్: సహకార రంగంలో నడుస్తున్న పాల ఉత్పత్తి సంస్థలకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లో కరీంనగర్ పాల ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్‌కు చెందిన ‘కరీంనగర్ డెయిరీ’ పాలు, పాల ఉత్పత్తుల అమ్మకాలను ఆది వారం మంత్రి ప్రారంభించారు. లీటర్ టోన్డ్ మిల్క్ ప్యాకెట్‌ను కూడా ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. కరువును ఎదుర్కోవడానికి పాడి పరిశ్రమ చక్కటి మార్గమన్నారు. చంద్రబాబు ప్రభుత్వ సంకుచిత ధోరణి, నిర్లక్ష్యం వల్లే సహకార వ్యవస్థ నిర్వీర్యమైందని విమర్శించారు. తర్వాత అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సహకార రంగాన్ని బలోపేతం చేశారన్నారు. తెలంగాణ ప్రభుత్వం సహకార సంస్థలను ప్రోత్సహిస్తుందన్నారు. ఎంపీ వినోద్‌కుమార్ మాట్లాడుతూ స్వచ్ఛమైన పాలను హైదరాబాద్ ప్రజలకు అందించాలని కోరారు. కార్యక్రమంలో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, కరీంనగర్ డెయిరీ చైర్మన్ సీహెచ్ రాజేశ్వర్‌రావు, ఎమ్మెల్యేలు చెన్నమనేని రమేష్, మధు, ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి, గుత్తా జితేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు