ఈ-పాస్ ‘దేశం’ బ్రేక్ ? | Sakshi
Sakshi News home page

ఈ-పాస్ ‘దేశం’ బ్రేక్ ?

Published Mon, Aug 3 2015 1:42 AM

ఈ-పాస్ ‘దేశం’ బ్రేక్ ? - Sakshi

- అమలు విధానం వాయిదాకు అవకాశం
- కొంత కాలం గడువు ఇవ్వాలని టీడీపీ డీలర్ల ఒత్తిళ్లు
- అన్ని దుకాణాలకు అందని ఎలక్ట్రానిక్ కాటాలు
వినుకొండ:
నిత్యావసర సరుకుల బ్లాక్ మార్కెట్‌ను అరికట్టేందుకు రేషన్ దుకాణాల్లో ప్రవేశపెట్టిన బయోమెట్రిక్ (ఈ-పాస్)విధానానికి తెలుగు తమ్ముళ్లు అడ్డుపడుతున్నట్లు తెలుస్తోంది. టీడీపీకి చెందిన డీలర్లు తెచ్చిన ఒత్తిడి మేరకే ఈ విధానం అమలును కొంతకాలంపాటు వాయిదా వేయనున్నట్టు సమాచారం. ప్రస్తుతం పట్టణాల్లోని రేషన్ దుకాణాల్లో బయోమెట్రిక్ విధానం అమలవుతోంది. ఆగస్టు 1వ తేదీ నుంచి ప్రతి గ్రామంలోని చౌకధరల దుకాణాల్లో బయోమెట్రిక్ విధానం అమలు చేయనున్నట్టు అధికారులు ముందుగానే ప్రకటించారు.

గ్రామీణ ప్రాంతాల్లోని షాపులకు దాదాపుగా బయోమెట్రిక్ మిషన్లు పంపిణీ చేశారు. వీటితో పాటు ఎలక్ట్రానిక్ కాటాలను సరఫరా చేయాల్సి ఉండగా కొన్ని షాపులకు ఇంకా రావాల్సివుందని తెలుస్తోంది. ఎలక్ట్రానిక్ కాటాలు అన్ని షాపులకు అందజేయక పోవడాన్ని సాకుగా చూపి విధానం అమలును తాత్కాలికంగా వాయిదా వేయనున్నారనే విమర్శలు ఉన్నాయి. అయితే అధికారపార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు బయోమెట్రిక్ విధానాన్ని వాయిదా వేస్తున్నట్టు సమాచారం.
 
ప్రతి నెలా ఒకటవ తేదీ నుంచి కార్డుదారులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయాల్సి ఉంది. ఈ నెలలో ఇప్పటి వరకు రూరల్ ప్రాంతంలోని ఏ ఒక్క షాపు నుంచి కూడా కార్డుదారులకు సరుకుల పంపిణీ జరగలేదు. పాతపద్ధతి ప్రకారమే రేషన్ దుకాణాల నుంచి సరుకుల పంపిణీ జరుగుతుందని అంటున్నారు. రేషన్ దుకాణాల డీలర్లకు సరుకుల పంపిణీకి సంబంధించి ఇంకా రెవెన్యూ అధికారులు కీ రిజిస్టర్‌లు ఇవ్వలేదు. జిల్లాలో 2,713 చౌకధరల దుకాణాలు ఉన్నాయి. అర్బన్ ప్రాంతాల్లో 567 దుకాణాల్లో ఈ-పాస్ విధానంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. తెనాలి డివిజన్‌లో ఇంకా 604 బయోమెట్రిక్ మెషీన్లు పంపిణీ చేయాల్సి ఉందని అధికారులు అంటున్నారు.
 
కిరోసిన్ పంపిణీలో అమలు కాని ఈ-పాస్ విధానం....
కిరోసిన్ హాకర్లు ప్రతి నెల 10  నుంచి 20వ తేదీ వరకు రేషన్ షాపులకు కిరోసిన్ సరఫరా చేస్తారు. 20 నుంచి 28 వరకు డీలర్లు కార్డుదారులకు కిరోసిన్ సరఫరా చేయాల్సి ఉంది. అయితే నిత్యావసర సరుకుల కోసం కార్డుదారులు వెళ్లి వేలు ముద్ర వేస్తే (ఈ-పాస్ విధానం) బియ్యం, కందిపప్పు, పంచదార, కిరోసిన్ తీసుకున్నట్లు వస్తుంది. కానీ కార్డుదారులకు ఆ సమయంలో  కిరోసిన్ పంపిణీ జరగదు. దీంతో ప్రతి నెలా బ్లూకిరోసిన్‌ను బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తున్నారు. ఇది కిరోసిన్ హాకర్లకు, డీలర్లకు కాసులు కురిపిస్తున్నట్లు తెలుస్తోంది.
 
సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేస్తాం ...
జిల్లాలో ప్రధానంగా నరసరావుపేట, గురజాల డివిజన్ల పరిధిలో బయోమెట్రిక్ విధానాన్ని యుద్ధప్రాతిపదికన అమలు చేసేం దుకు ప్రయత్నిస్తున్నాం. ఎలక్ట్రానిక్ కాటాలు రాష్ట్రంలోని అన్ని షాపులకు ఒక్కరే సరఫరా చేయాల్సి ఉంది. అందువల్ల కొంత జాప్యం జరుగుతోంది. అంతేతప్ప మరొక కారణం కాదు. త్వరలో ప్రతి చోటా ఈ పాస్ విధానం అమల్లో ఉంటుంది.
 -  చిట్టిబాబు, డీఎస్‌వో

Advertisement
Advertisement