కేసుల భయంతోనే కేసీఆర్‌ కొత్త డ్రామా

8 Aug, 2017 01:48 IST|Sakshi
కేసుల భయంతోనే కేసీఆర్‌ కొత్త డ్రామా

టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్‌: హారా, ఈఎస్‌ఐ కుంభకోణాల్లో సీఎం కేసీఆర్‌ పాత్రపై ఇప్పటికే ఆయనను సీబీఐ రెండుసార్లు విచారించిందని, ఆ కేసుల భయంతోనే కొత్త డ్రామాకు తెరతీశారని టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి ఆరోపించారు. పార్టీ నేతలు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, వేం నరేందర్‌రెడ్డితో కలసి అసెంబ్లీ ఆవరణలో సోమవారం ఆయన మాట్లాడారు.

సీబీఐ కేసులకు భయపడి బీజేపీకి మోకరిల్లుతున్నారని విమర్శించారు. జీఎస్టీ వల్ల నష్టాలను అసెంబ్లీలో చర్చించకుండా బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపించారని, ఆమోదించిన వారే కేసులు వేస్తామంటే చెల్లుతుందా అని ప్రశ్నించారు. కోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికే మొట్టికాయలు పడతాయని హెచ్చరించారు. ఢిల్లీలో జరిగిన జీఎస్టీ సమావేశానికి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ను దూరంగా పెట్టడం అవమానకరమన్నారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పించే తీరిక ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, మంత్రి కేటీఆర్‌కు లేకుండాపోవడం బాధాకరమన్నారు. తెలంగాణ వ్యతిరేకి అని ఇప్పటిదాకా తిట్టిన వెంకయ్యనాయుడును మంత్రి కేటీఆర్, తెలంగాణ ద్రోహి అని తిట్టిన తుమ్మల నాగేశ్వర్‌రావును ముఖ్యమంత్రి కేసీఆర్‌ కలిశారని రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు.

మరిన్ని వార్తలు