పెద్ద కమ్యూనిస్టునంటూనే విమర్శలా? | Sakshi
Sakshi News home page

పెద్ద కమ్యూనిస్టునంటూనే విమర్శలా?

Published Tue, Aug 8 2017 1:47 AM

పెద్ద కమ్యూనిస్టునంటూనే విమర్శలా? - Sakshi

కేసీఆర్‌ వైఖరిపై మండిపడ్డ సీపీఐ నేత నారాయణ
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో కమ్యూనిస్టు భావజాలంతో ప్రభుత్వాన్ని నడుపుతున్న తానే పెద్ద కమ్యూనిస్టునని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌.. రాష్ట్రంలో కమ్యూనిస్టు ఉనికిని ప్రశ్నించడంపై సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు నారాయణ మండిపడ్డారు. సోమవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. తాను ఓ పెద్ద కమ్యూనిస్టునని చెప్పుకుంటూ తమపై విమర్శలు చేస్తున్న కేసీఆర్‌పై మండిపడ్డారు. కమ్యూనిస్టు పార్టీలో ముగ్గురున్నా, నలుగురున్నా కమ్యూనిజం ఎల్లప్పుడూ అలాగే ఉంటుందన్నారు.

ఎర్రజెండా ఎంతో మంది హేమాహేమీలను చూసిందని, వారి ముందు కేసీఆర్‌ ఎంత అని ప్రశ్నించారు. కమ్యూనిస్టు పార్టీలు గెలిచినా, ఓడినా ఎర్రజెండా ఎప్పటికీ ఉంటుందన్నారు. అయితే టీఆర్‌ఎస్‌ జెండా మాత్రం కేసీఆర్‌ ఉన్నప్పుడే పోతుందని చెప్పారు. సిరిసిల్లలో కేటీఆర్‌ నడుపుతున్న ఇసుక దందాపై ప్రశ్నించినందుకే దళితులను చిత్రహింసలు పెడుతున్నారన్నారు. ఈ దందాలో రూ.వేల కోట్లు అధికారపార్టీ నేతలు దండుకుంటున్నారని నారాయణ ఆరోపించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement