సీటు వదులుకున్నా ఫీజు కట్టక్కర్లేదు

3 Aug, 2017 01:03 IST|Sakshi
సీటు వదులుకున్నా ఫీజు కట్టక్కర్లేదు
- ఎంబీబీఎస్, బీడీఎస్‌ అభ్యర్థులకు ఊరటనిచ్చిన కాళోజీ వర్సిటీ
మూడో కౌన్సెలింగ్‌కు ముందే లేఖ ఇవ్వాలని సూచన
నేటి నుంచి బీ, సీ కేటగిరీ సీట్లకు కౌన్సెలింగ్‌
 
సాక్షి, హైదరాబాద్‌: ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల్లో అడ్మిషన్లకు సంబంధించి కాళోజీ వర్సిటీ అభ్యర్థులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సులలో మొదటి దశ కౌన్సెలింగ్‌లో సీటు వచ్చిన వారు ఒకవేళ సీటు వదులుకుంటే రూ.3 లక్షలు చెల్లించాలనే నిబంధనలో మార్పులు చేసింది. రెండో దశ కౌన్సెలింగ్‌ వరకు ఈ అవకాశం కల్పించింది. అభ్యర్థులు రెండో దశ కౌన్సెలింగ్‌ తర్వాత సీటు వదులుకున్నా.. ఎలాంటి ఫీజులు చెల్లించా ల్సిన అవసరం లేదని పేర్కొంది. మూడో దశ కౌన్సెలింగ్‌(మాప్‌ ఆప్‌) ప్రక్రియకు ముందే సీటు వదులుకున్నట్లు లేఖలు ఇవ్వాలని సూచించింది.

మరోవైపు ప్రైవేటు, ప్రైవేటు మైనారిటీ కాలేజీల్లోని బీ కేటగిరీ, సీ(ఎన్నారై) కేటగిరీ ఎంబీబీఎస్, బీడీఎస్‌ సీట్ల భర్తీ కోసం ఈ నెల 3 నుంచి 5 వరకు ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ జరగనుంది. ఉస్మానియా వర్సిటీలోని పీజీఆర్‌ఆర్‌సీడీఈలో ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. బీ కేటగిరీ సీట్లకు సంబంధించి ఆగస్టు 3న 1 నుంచి 700 ర్యాంకు వరకు కౌన్సెలింగ్‌ ఉంటుంది. ఆగస్టు 4న 700 ర్యాంకు నుంచి సీట్ల భర్తీ ఆధారంగా చివరి ర్యాంకు వరకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. ఆగస్టు 5న సీ కేటగిరీ సీట్ల భర్తీ కోసం అన్ని ర్యాంకుల వరకు కౌన్సెలింగ్‌ జరుగుతుంది. బీ, సీ కేటగిరీ సీట్ల కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు అన్ని ఒరిజినల్‌ సర్టిఫికెట్లు తీసుకురావాలి.

సీటు పొందిన వెంటనే వర్సిటీ ఫీజు చెల్లించి ధ్రువీకరణ పత్రం పొందాలి. అనంతరం ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం కాలేజీ ఫీజులను, బాండ్‌ను, డీడీలను ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లకు అక్కడే చెల్లించాలి. సీటు పొందిన అభ్యర్థులు అదే రోజు వర్సిటీ ఫీజు చెల్లించకున్నా, సీటు పొందిన ధ్రువపత్రాన్ని అదే రోజు సంబంధిత కాలేజీ ప్రిన్సిపాల్‌కు ఇవ్వకున్నా సీటు రద్దవుతుంది. ప్రైవేటు ముస్లిం మైనారిటీ కాలేజీల్లోని బీ, సీ కేటగిరీ సీట్ల భర్తీ కోసం నిర్వహించే మొదటి దశ కౌన్సెలింగ్‌కు కేవలం ముస్లిం అభ్యర్థులు మాత్రమే హాజరుకావాలి.
 
10 తర్వాత రెండో దశ కౌన్సెలింగ్‌
ఎంబీబీఎస్, బీడీఎస్‌ ఏ కేటగిరీ రెండో దశ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఈ నెల 10 తర్వాత జరగనుంది. మూడు కేటగిరీ సీట్ల మొదటి దశ కౌన్సెలింగ్‌ పూర్తిగా ముగిసిన తర్వాత రెండో దశ కౌన్సెలింగ్‌ మొదలు పెట్టనున్నట్లు కాళోజీ విశ్వవిద్యాలయం వైస్‌ చాన్స్‌లర్‌ కరుణాకర్‌రెడ్డి తెలిపారు. 
మరిన్ని వార్తలు