భూములు బోలెడు | Sakshi
Sakshi News home page

భూములు బోలెడు

Published Thu, Aug 3 2017 12:59 AM

భూములు బోలెడు

నెల్లూరు : జిల్లాలో ఖాళీ భూములు భారీగా ఉన్నా.. ఆక్రమణల చెరలో చిక్కాయి. ఫలితంగా ప్రజావసరాలకు.. పారిశ్రామిక అవసరాలకు భూముల కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో వాటిని స్వాధీనం చేసుకునే దిశగా రెవెన్యూ యంత్రాంగం అడుగులు వేస్తోంది. నీతి ఆయోగ్‌ కమిటీ పర్యటన అనంతరం ఖాళీ భూముల గుర్తిం పు.. వాటి రక్షణపై కలెక్టర్‌ ఆర్‌.ముత్యాలరాజు దృష్టి సారించారు. ల్యాండ్‌ బ్యాంక్‌ పేరిట భూముల సంరక్షణ దిశగా చర్యలు చేపడుతున్నారు. జిల్లాలో 70 వేల ఎకరాలకు పైగా ఖాళీ భూములు ఉన్నట్టు రెవెన్యూ రికార్డులు చెబు తున్నాయి.

రెండు నెలల క్రితం నీతి ఆయోగ్‌ కమిటీ, కేంద్ర వాణిజ్య మంత్రిత్వ బృందం కృష్ణపట్నం తీరంలో పర్యటించి ఖాళీ భూముల విని యోగం, తదితర అంశాలను పరిశీలించింది. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు రంగంలోకి దిగి వివాదాలు, కోర్టు పరిధిలో లేని 26 వేల ఎకరాల ఖాళీ భూములను గుర్తించారు. మరో 44 వేల ఎకరాలు ఉన్నప్పటికీ వాటిలో అధిక శాతం ఆక్రమణ చెరలో ఉన్నట్టు గుర్తించారు. మరికొన్ని కోర్టు వివాదాలు, ఇతర సమస్యలతో ముడిపడి ఉన్నాయి.

ల్యాండ్‌ బ్యాంక్‌ ఏర్పాటు
జిల్లాలోని ఖాళీ భూములను గుర్తించి.. వాటి సంరక్షణకు ల్యాండ్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ ఆర్‌.ముత్యాలరాజు నిర్ణయించారు. ఈ క్రమంలో జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రభుత్వ, దేవాదాయ, పోరంబోకు తదితర అన్నిరకాల భూముల్ని గుర్తించే ప్రక్రియను రెండు నెలల క్రితం చేపట్టారు. ప్రస్తుతం కృష్ణపట్నం పోర్టు సమీపంలోని మండలాల్లో ఎక్కువగా భూములు ఉన్నట్టు గుర్తించారు. కోర్టు వివాదాలు, ఇతర ఇబ్బందులు లేని భూములు 26 వేల ఎకరాలు ఉండగా.. వాటిలో అధిక శాతం ఆంధ్రప్రదేశ్‌ పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) ఆ«ధీనంలో ఉన్నాయి. మరికొన్ని భూములను పోర్టు అనుబంధ పరిశ్రమల పేరిట ఖాళీగా ఉంచారు. ఇదిలావుంటే.. రిలయన్స్‌తో సహా అనేక పరిశ్రమలకు గతంలో భూములు కేటాయించారు. వీటిలో కొన్ని పరిశ్రమలు స్థాపన కాలేదు.

ప్రస్తుతం వివాదం లేకుండా నేలటూరుపాలెంలో రిలయన్స్‌ ఆధీనంలో ఉన్న 44 ఎకరాల భూమిని అధి కారులు స్వాధీనం చేసుకున్నారు. ముత్తుకూరు మండలంలో 350 ఎకరాల చౌడు భూములు ఉన్నట్టు గుర్తిం చారు. గరిమెనపెంట, మర్రిపాడు, రాపూరు మండలాల్లో వందలాది ఎకరాలు ఆక్రమణలో ఉన్నట్టు గుర్తించిన అధికారులు వాటిని స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. పనిలో పనిగా ప్యూరిఫికేషన్‌ ఆఫ్‌ ల్యాం డ్‌ రికార్డ్‌ ప్రక్రియ చేపట్టారు. ఇందుకోసం కొత్తగా సాఫ్ట్‌వేర్‌ను రూపొం దించి.. ప్యూరిఫికేషన్‌ కార్యక్రమాన్ని ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు.

కేంద్ర బృందాల పరిశీలన
ఏడాది జూన్‌ 12న కృష్ణపట్నం తీర ప్రాంతంలో నీతిఆయోగ్‌ కమిటీ పర్యటించింది. జిల్లాలో ఖాళీ భూములు, పరిశ్రమల స్థాపనకు ఉన్న సౌకర్యాలు, ఇతర అంశాలపై ఏరియల్‌ సర్వే నిర్వహించింది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారుల బృందం కూడా పర్యటించింది. ముఖ్యంగా తీర ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే పోర్టుకు అనుబంధంగా పరిశ్రమల స్థాపనకు ఉన్న అవకాశాలను ఈ బృందాలు పరిశీలించాయి.

Advertisement
Advertisement