‘డబుల్‌’ సమస్యలు తొలగిపోయాయి

29 Dec, 2016 00:15 IST|Sakshi
‘డబుల్‌’ సమస్యలు తొలగిపోయాయి

మండలిలో మంత్రులు ఇంద్రకరణ్, తుమ్మల ప్రకటన

- నిధులు, ఇసుక, సిమెంట్‌ సమస్యలన్నీ పరిష్కారమయ్యాయని వ్యాఖ్య
- త్వరలోనే శరవేగంగా ఇళ్ల నిర్మాణం చేపడతామని వెల్లడి
- కేసీఆర్‌ హామీలన్నింటినీ తుంగలో తొక్కుతున్నారు: షబ్బీర్‌ అలీ
- ఖమ్మంలో ఓ వైద్య కళాశాలకు అక్రమ భూకేటాయింపు: సుధాకర్‌రెడ్డి
- గృహ నిర్మాణంపై రెండో రోజు వాడివేడి చర్చ

సాక్షి, హైదరాబాద్‌: రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి సమస్యలన్నీ తొలగిపోయా యని.. త్వరలో ఇళ్ల నిర్మాణాన్ని వేగంగా చేపట్ట బోతున్నామని గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు చెప్పారు. ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.17 వేల కోట్లు సమీకరించిం దని.. ఉచితంగా ఇసుక సరఫరాతో పాటు సిమెంట్‌ కోసం 32 కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుందని చెప్పారు. పేదలకు గృహ నిర్మాణం అంశంపై శాసనమండలిలో బుధ వారం కూడా అధికార, విపక్షాల మధ్య వాడి వేడి చర్చ జరిగింది. ‘డబుల్‌’ ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వం విఫలమైందని విపక్ష కాంగ్రెస్‌ ఆరోపించగా.. ఇందిరమ్మ, రాజీవ్‌ స్వగృహ పథకాల్లో అవినీతి, అక్రమాలు జరిగాయని అధికార పార్టీ నేతలు దీటుగా ఎదురుదాడి చేశారు.

మీరు దోచి పెట్టారు.. కాదు మీరే..
రాజీవ్‌ స్వగృహ ఇళ్లను కాంగ్రెస్‌ ప్రభుత్వం భూత్‌ బంగ్లాలుగా మార్చిందని.. అసలు ఇళ్లు నిర్మించకుండానే కాంట్రాక్టర్లకు రూ.1,000 కోట్లు దోచిపెట్టిందని టీఆర్‌ఎస్‌ సభ్యుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. దీనిపై కాంగ్రెస్‌ సభ్యుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి దీటుగా స్పందించారు. ఓ ప్రజాప్రతినిధికి చెందిన వైద్య కళాశాలకు ఖమ్మంలో 11 వేల గజాల స్థలాన్ని ప్రభుత్వం అక్రమంగా కట్టబెట్టిందని ఆరోపించారు. దీనికి సంబంధించి సమాచార హక్కు చట్టం కింద పొందిన పత్రాలను సభలో ప్రదర్శించారు. ఆ స్థలాన్ని డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి కేటాయించాలని డిమాండ్‌ చేశారు. అహ నా పెళ్లంట సినిమాలో కోట శ్రీనివాసరావు కోడిని వేలాడదీసి, దాన్ని చూస్తూ భోజనం చేసినట్లుగా డబుల్‌ బెడ్‌ రూం పథకం తయారు కావొద్దని ఎద్దేవా చేశారు. ఇక డబుల్‌ బెడ్‌రూం ఇళ్లపై ప్రభుత్వం ప్రజల్లో ఆశలు రేకెత్తించిందని, కానీ ఏమీ చేయకపోవడంతో నిరాశ నెలకొందని బీజేపీ సభ్యుడు ఎన్‌.రామచంద్రరావు పేర్కొన్నారు. ముస్లిం జనాభా అధికంగా ఉన్న హైదరాబాద్‌ వంటి ప్రాంతాల్లో నిర్మించే డబుల్‌ ఇళ్లలో వారికి కోటాను పెంచాలని ఎంఐఎం సభ్యుడు సయ్యద్‌ అల్తాఫ్‌ రిజ్వీ కోరారు.

ఏడాదికి రెండు లక్షల ఇళ్లు ఏవీ?
టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చి 31 నెలలు గడిచినా నిర్మించింది 900 ఇళ్లు మాత్రమేనని మండలిలో విపక్షనేత షబ్బీర్‌ అలీ మండిపడ్డారు. ఏడాదికి రెండు లక్షల ఇళ్లు నిర్మిస్తామని గత ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చి, విస్మరించారని ఆరోపించారు. హైదరాబాద్‌లోని ఐడీహెచ్‌ కాలనీలో నిర్మించిన ఇళ్లను చూపించి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓట్లను దండుకున్నారని ఆరోపించారు. ఇక ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి, అబద్ధాలాడి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌.. అమాయక ప్రజలను మోసం చేస్తోందని కాంగ్రెస్‌ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విమర్శించారు. రూ.10 లక్షలు ఖర్చయ్యే డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను రూ.5 లక్షలతోనే నిర్మించాలన్నందునే కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదన్నారు. ప్రభుత్వం బిల్లులు నిలిపివేయడంతో రాష్ట్రంలో రెండు లక్షల ఇందిరమ్మ ఇళ్లు మధ్యలోనే ఆగిపోయాయని.. ఊళ్లకు వెళ్తే కూలిపోయిన ఇళ్లు కనిపిస్తున్నా యని రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానిం చారు. దీనిపై టీఆర్‌ఎస్‌ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. ‘ఊళ్లలో అంతకుముందు కట్టిన ఇళ్లు కూలుతున్నయి అన్నారు.. అంతే..’ అని మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ సర్దిచెప్పారు.

మరిన్ని వార్తలు