ఎమ్మెల్యేల వేతనం పెంపు

31 Mar, 2016 02:15 IST|Sakshi
ఎమ్మెల్యేల వేతనం పెంపు

♦ రూ. 95 వేల నుంచి రూ. 1.25 లక్షలకు వేతనం
♦ గరిష్ట పెన్షన్ 50 వేలకు పెంపు
♦ కోత పెట్టమన్న ప్రతిపక్ష నేత
♦ పెంపును వ్యతిరేకించిన శ్రీధర్‌రెడ్డి
♦ బిల్లుకు సభ ఆమోదం    

 సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వేతనం, భత్యాలను పెంచారు. ఈమేరకు రూపొందించిన బిల్లుకు శాసనసభ బుధవారం ఆమోదముద్ర వేసింది. అయితే ఈ బిల్లును వైఎస్సార్‌సీపీ సభ్యుడు శ్రీధర్‌రెడ్డి వ్యతిరేకించారు. 175 నియోజకవర్గాల్లో ఏ నియోజవకర్గంలో అయినా, జీతాల పెంపునకు ప్రజాభిప్రాయం అనుకూలంగా వస్తే తాను రాజీనామా చేస్తానని ప్రకటించారు. పెంపును తగ్గించడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని విపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. బిల్లుకు సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది.

వేతనాన్ని రూ. 95 వేల నుంచి రూ. 1.25 లక్షలకు, వాహన రుణాన్ని రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచారు. ఇకపై వార్తాపత్రికలు, పుస్తకాల కొనుగోలుకు ఏటా రూ. 20 వేలు ఇవ్వనున్నారు. నియోజకవర్గం భత్యాన్ని రూ. 1.38 లక్షలకు పెంచారు. ఏటా 70 వేల కిలోమీటర్లు రైల్లో ఫస్ట్‌క్లాస్‌లో ప్రయాణించడానికి అవసరమైన రైల్వే కూపన్లను సభ్యులకు ఇస్తున్నారు. ఇక మీదట ఆ కూపన్లకు బదులు ఏటా రూ. లక్ష ఇవ్వనున్నారు. అందులో సగం.. జనవరిలో, మిగతా సగం జూలైలో చెల్లించనున్నారు. సభ్యుడు/మాజీ సభ్యుడు మరణిస్తే.. ఆ సభ్యుని భార్య/భర్తకు రూ. 25 వేలు పెన్షన్ చెల్లించనున్నారు.

మరిన్ని వార్తలు