అధికారంతోనే పేద కులాలకు గౌరవం: కృష్ణయ్య

26 Jun, 2017 00:43 IST|Sakshi
అధికారంతోనే పేద కులాలకు గౌరవం: కృష్ణయ్య
హైదరాబాద్‌: పేద కులాలకు అధికారంతోనే గౌరవం పెరుగుతుందని, ఆ దిశగా బీసీ సంక్షేమ సంఘం ఉద్యమిస్తుందని టీడీపీ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య తెలిపారు. తెలంగాణ బీసీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం హైదరాబాద్‌లో జరిగింది. 4,689 ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే ఆలోచనను సీఎం కేసీఆర్‌ విరమించుకోవాలని సమా వేశంలో కృష్ణయ్య హెచ్చరించారు. ప్రభుత్వ శాఖల్లోని 2 లక్షల ఉద్యోగాలతో పాటు 40 వేల ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు.

బీసీలకు క్రీమీలేయర్‌ను ఎత్తివేయాలని కోరారు. జనాభా దామాషా ప్రకారం విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేయాల న్నారు. ఏకీకృత సర్వీసుల్లో జనాభాకు అనుగుణంగా ఉద్యోగాల్లో ప్రమోషన్లు, పాత పింఛన్‌ విధానాన్ని అమలుచేయాలన్నారు. కార్యక్రమంలో బీసీ ఉపాధ్యాయ సంఘం నాయకులు కృష్ణుడు, కోటేశ్వర్‌రావు, గురుప్రసాద్, సురేశ్, నర్సింహాచారి, విజయ్‌కుమార్, రాష్ట్ర బీసీ ఫ్రంట్‌ చైర్మన్‌ మల్లేశ్‌యాదవ్, రాష్ట్ర బీసీ హక్కుల పోరాట కమిటీ ప్రెసిడెంట్‌ రాజేందర్, ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు