ప్రకృతి వైద్యం.. పేదలకు దూరం

13 Jan, 2018 03:42 IST|Sakshi

యూజర్‌ చార్జీలను భారీగా పెంచిన ప్రకృతి వైద్యశాల

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు సంస్థలందించే ప్రకృతి వైద్యం ఇప్పటికే సామాన్యులకు అందకుండా పోయింది. ఇప్పుడు ప్రభుత్వం సైతం ఇదే దారిలో పయనిస్తోంది. ప్రకృతి వైద్యశాలలో యూజర్‌ చార్జీలు పెంచుతూ వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకుంది. యోగధ్యాన పరిషత్‌ పరిధిలోని ప్రకృతి వైద్యశాలలో అందించే అన్ని రకాల యోగా, ఆయుర్వేద చికిత్సలకు యూజర్‌ చార్జీలను పెంచింది. మొత్తం 32 రకాల సేవల చార్జీలను పెంచుతూ వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకుంది. యోగధ్యాన పరిషత్‌ పరిధిలో ఉండే ఈ ప్రకృతి వైద్యశాలను 1949లో హైదరాబాద్‌ బేగంపేట ప్రాంతంలో పది ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు.

ప్రభుత్వ పరిధిలోని ఏకైక ప్రకృతి వైద్యశాల కావడంతో ఇక్కడికి వచ్చే రోగుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. దీనికి తోడు ఇటీవలి కాలంలో ప్రకృతి వైద్యానికి ఆదరణ కూడా బాగా పెరుగుతోంది. బరువు తగ్గడం, ఆస్తమా, చర్మ రోగాలు, స్పాండిలైటిస్, నరాల వ్యాధుల చికిత్సలకు ఎక్కువ మంది ఇక్కడికి వస్తున్నారు. వ్యసనాలను మానేందుకు అధిక శాతం దీన్నే ఆశ్రయిస్తున్నారు. 200 పడకలుండే ఈ వైద్యశాలలో ఏటా 40 వేల మంది చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో యూజర్‌ చార్జీలను పెంచాలని యోగధ్యాన పరిషత్‌ ప్రతిపాదనలు పంపింది. వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి వాటిని ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

మరిన్ని వార్తలు