అక్రమ వలసదారులపై నజర్..!

16 Aug, 2015 04:48 IST|Sakshi

♦ నసీర్‌తో పాటు మరో ముగ్గురి అరెస్టుతో అప్రమత్తమైన పోలీసులు
♦ నగరంలోని పలు ప్రాంతాలపై ముమ్మర నిఘా
 
 సాక్షి, సిటీబ్యూరో  : నగరంలో ఉంటున్న అక్రమ వలసదారులపై నగర పోలీసులు దృష్టి సారించారు. వాళ్లు ఆశ్రయం పొందుతున్న ప్రాంతాలను గుర్తించి పాస్‌పోర్టు, వీసాలు లేకుండా ఎంత మంది ఉన్నారని గుర్తించే దిశగా ముందుకెళుతున్నారు. హర్కత్ ఉల్ జిహదీ అల్ ఇస్లామీ (హుజీ)తో సంబంధమున్న పాకిస్థానీ మహమ్మద్ నసీర్‌తో పాటు ఫైజల్ మహమ్మద్ (బంగ్లాదేశ్), జోయ్‌నల్ అబెదిన్ (బంగ్లాదేశ్), జియా ఉర్ రెహమన్ (మయన్మార్)ల అరెస్టు నేపథ్యంలో నగరంలో అక్రమంగా వలస ఉంటున్న వారి అంశం చర్చకు వచ్చింది. అరెస్టయిన వారందరూ అక్రమ వలసదారులే కావడం పోలీసుల్లో ఆందోళన కలిగిస్తోంది.

సోమాలియా, ఈథియోపియా, ఇరాక్, ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్, మయన్మార్ దేశాల్లో జరిగిన యుద్ధాల్లో ఆప్తులను కోల్పోయి...ఇక్కడ ఉంటున్న శరణార్థుల వివరాలను కూడా సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. చెంచల్‌గూడతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో విదేశీయులు కనబడితే చాలు వారి పాస్‌పోర్టు, వీసాలు ఉన్నాయా? లేవా? అని చెక్ చేసే పనిలో పడ్డారు. ఉగ్రవాద దాడులు జరగవచ్చన్న ఐబీ హెచ్చరికల నేపథ్యంలో అక్రమ వలసదారులపై కన్నేసి ఉంచామని, ఇందులో భాగంగానే నసీర్ తమకు చిక్కాడని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

 సైబరాబాద్‌లోనూ..
 సైబరాబాద్ పరిధిలోని బాలాపూర్, బాబానగర్, బార్కస్, షహీన నగర్, శాస్త్రీపురం, కిషన్‌బాగ్ ప్రాంతాల్లో 1,725 మంది శరణార్థులు ఎటువంటి వీసాలు, పాస్‌పోర్టులు లేకుండా అక్రమంగా ఉంటున్నారనే విషయాన్ని గుర్తించిన సైబరాబాద్ సీపీ సీవీ ఆనంద్...ఇటీవల నగరానికి వచ్చిన యూఎన్‌హెచ్‌సీఆర్ మిషన్ చీఫ్ విలియమ్ టాల్ దృష్టికి తీసుకెళ్లారు. వీరి వద్ద ఎటువంటి గుర్తింపు కార్డులు లేకపోవడంతో ఎవరూ ఏమి చేస్తున్నారనే విషయం కూడా తెలియడం లేదని చెప్పడంతో... వారికి  రెండేళ్ల కాలపరిమితి గల రెఫ్యూజీ సర్టిఫికెట్‌ను జారీ చేస్తామని అంగీకరించారు. ఇప్పటికే దీనిపై సైబరాబాద్ పోలీసులు దృష్టి కేంద్రీకరించి శరణార్థుల కదలికలపై నిఘా వేశారు.

 వయా దుబాయ్ టూ పాకిస్థాన్
 ఇప్పటికే చెంచల్‌గూడకు చెందిన మహమ్మద్ మసూద్ ఆలీ ఖాన్ సహకారంతో ఓటరు గుర్తింపు కార్డులు, ఆధార్ కార్డులు పొందడమే కాకుండా 15 మందికి భారత పాస్‌పోర్టులు ఇప్పించి విదేశాలకు పంపించడంపైనా పోలీసులు దృష్టి కేంద్రీకరించారు. అయితే వీరిని దుబాయ్ మీదుగా పాకిస్థాన్‌కు పంపించారన్న విషయం పోలీసుల విచారణలో నిందితుడు వెల్లడించినట్టు సమాచారం. ఇదే నిజమైతే వారిని పాకిస్థాన్‌కు పంపించడానికి కారణమేంటి? ఉగ్రవాదులుగా శిక్షణ తీసుకునేందుకు వారిని పంపించారా? ఉద్యోగాల పేరుతో నమ్మించి ఉగ్రవాద చర్యల్లో భాగస్వామ్యులను చేసేందుకు అక్కడికి పంపించి ఉంటారా అన్న దిశగా పోలీసులు విచారణ సాగుతున్నట్టు తెలుస్తోంది.

  పాస్‌పోర్టు తనిఖీకి వచ్చిన కానిస్టేబుళ్లను కూడా పోలీసులు పిలిపించి మాట్లాడినట్టు సమాచారం.

మరిన్ని వార్తలు